తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో భుజం భుజం కలిపి, ఆకలి డప్పులు మరిచి, తుపాకులకు తలొడ్డి నిర్భయంగా నడిచినవారిలో ఎందరో మహిళలున్నారు. తాము జీవిస్తున్నకాలంలో తమకు, తమవారికి, తరతరాలకు స్వేచ్ఛా స్వాతంత్య్రం సాధించడం కోసం త్యాగాలు చేశారు. మనిషి, బతుకు, స్వేచ్ఛ విలువలు తెలుసుకున్నారు, వాటిని ఆచరించారు. ప్రపంచ మహిళా ఉద్యమ చరిత్రలో క్లారా జట్కిన్, రోజా లక్సెంబర్గ్, సావిత్రి పూలేలాగా మల్లు స్వరాజ్యం కూడా తనకంటూ ఒక మహా అధ్యాయాన్ని లిఖించుకున్నారు.
వేల ఏండ్లుగా దోపిడీని భరిస్తూ స్తబ్ధంగా ఉన్న తెలంగాణ సమాజాన్ని విముక్తి మార్గం పట్టించిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం నిర్మాతల్లో మల్లు స్వరాజ్యం ఒకరు. భూ పంపకం, వెట్టిచాకిరీ రద్దు, భారత్లో హైదరాబాద్ రాజ్యం విలీనం కోసం జరిగిన పోరాటంలో పదకొండేండ్ల వయస్సులోనే తన ప్రస్థానాన్ని ప్రారంభించారు. భూస్వామ్య కుటుంబంలో పుట్టినా, సంపదను సృష్టించే శ్రామిక వర్గాలను ప్రేమతో చూసుకోవాలనే ఉత్కృష్ట గుణాన్ని తన అమ్మ చుక్కమ్మ నుంచి నేర్చుకున్నారు. దోపిడీ వర్గాలను కూలదోయడం, నిలువరించడం కోసం బాంబులు విసరడం, తుపాకీ పేల్చడం వంటి ఆయుధ శిక్షణను తన అన్న భీంరెడ్డి నర్సింహారెడ్డి, కమ్యూనిస్టు పార్టీ శిక్షణ శిబిరాల నుంచి నేర్చుకున్నారు.
1944లో రావి నారాయణరెడ్డి అధ్యక్షతన జరిగిన ఆంధ్ర మహాసభ కమ్యూనిస్టు పార్టీగా రూపాంతరం చెందింది. ఆంధ్ర మహిళాసభ, నవజీవన మహిళా మండలి వంటి సంఘాలు రాడికల్ స్వభావాన్ని సంతరించుకున్నాయి. ఐలమ్మ ధీరత్వం, దొడ్డి కొమురయ్య అమరత్వంతో గడీలను కూల్చడానికి, నైజాంను దించడానికి 1944-51 వరకు పోరాటం కొనసాగింది. ఈ పోరులో రాజకీయ, సాంఘిక, ఆర్థికవిప్లవం అంశాలను చేర్చి విజయానికి మల్లు స్వరాజ్యం కృషిచేశారు. ప్రజల భాషలో పదునైన ప్రసంగాలతో, స్థానిక సమస్యలు, సంస్కృతి ఆధారంగా అప్పటికప్పుడు పాటలు కడుతూ, పాడుతూ ఉత్తేజపరుస్తూ, నాయకత్వం వహించి పోరాటాల్లో పెద్ద ఎత్తున ప్రజలను సమీకరించారు.
తెలంగాణ రైతాంగ పోరాట కాలంలో మూడు వేల గ్రామాలను విముక్తి చేశారు. 10 లక్షల ఎకరాల భూ పంపిణీ జరిగింది. గ్రామ రాజ్య కమిటీలు ఏర్పడ్డాయి. స్త్రీలు సహజ సిద్ధం గా ఉత్పాదక, సంరక్షణ స్వభావాన్ని కలిగి ఉంటారు. మల్లు స్వరాజ్యం చొరవతో మహిళల పేరున భూమిని పంచే కార్యక్రమాలను పార్టీ చేయించింది. గ్రామపాలన కమిటీల్లో స్త్రీలకు చోటు కల్పించి, స్త్రీ, పురుషులకు సమాన హక్కుల ప్రకటనను వెలువరించారు. మహిళా రైతులకు కావాల్సిన నాగళ్లు, ఎడ్లను పార్టీతో పంపిణీ చేయించారు. మల్లు స్వరాజ్యం 1978-83 కాలంలో సూర్యాపేట శాసనసభ్యురాలిగా పనిచేశారు. సాధారణమైన నిరాడంబర జీవితాన్ని గడుపుతూ వ్యక్తిగత జీవితం అంటూ లేకుండా ప్రజా సమస్యల పరిష్కారం కోసమే పనిచేశారు.
తన జీవిత చరమాంకంలో దేశంలో పేట్రేగిపోతున్న మతోన్మాదశక్తుల పట్ల మల్లు స్వరాజ్యం ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణలో అలాంటి విచ్ఛిన్నకరశక్తులకు తావులేకుండా ఐక్య సంఘటన ఏర్పడాలని కోరుకున్నా రు. మరణశయ్యపై కూడా పీడితుల పట్ల ప్రేమతో, పీడకుల పట్ల కోపంతో పిడికిలి ఎత్తి దక్కన్ పీఠభూమి శిఖరాగ్రంపై వెలుగులు చిమ్ముతూ మల్లుస్వరాజ్యం కన్నుమూశారు. తెలంగాణ విప్లవస్ఫూర్తిని విశ్వవ్యాప్తం చేసిన పునీత మల్లు స్వరాజ్యం.
అస్నాల శ్రీనివాస్, 96522 75560
(వ్యాసకర్త: దొడ్డి కొమురయ్య ఫౌండేషన్)