తెలంగాణ రైతులు పండించిన వడ్లు కొనాలని డిమాండ్ చేస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో నేడు మహా ధర్నా జరుగుతున్నది. రైతు క్షేమం కోరే అందరూ ఈ ధర్నాకు మద్దతు ఇవ్వాలి. పార్టీలతో సంబంధం లేకుండా తెలంగాణ రైతుల ప్రయోజనాలు కోరే వారందరూ పాల్గొనాలి.
నేటి ‘మహాధర్నా’ను అధికార టీఆర్ఎస్ చేస్తున్న ధర్నాగా చూడవద్దు. ఇది తెలంగాణ సమాజం (తెలంగాణ ప్రభుత్వం అందులో ఒక భాగం) తనకు జరుగుతున్న అన్యాయాన్ని నిలదీస్తూ కేంద్ర ప్రభుత్వతీరుపై చేస్తున్న నిరసన.
తెలంగాణ సమాజంలో భాగమైన ఉద్యమకారులు, మేధావులు, ప్రగతిశీల శక్తులు, విద్యార్థులు ఒక్కమాటలో చెప్పాలంటే తెలంగాణ ఆత్మ వున్న
ప్రతి ఒక్కరూ మద్దతు ఇవ్వాల్సిన సందర్భం ఈ మహాధర్నా. స్వరాష్ట్రం సాధించుకున్న తెలంగాణ బిడ్డలు, అదే స్ఫూర్తితో ఢిల్లీ తో చేయబోయే
సమరానికి ఒక కర్టెన్ రైజర్ ఈ ‘మహాధర్నా’.
ఆర్ఎస్ పార్టీతోనూ, ప్రభుత్వంతోనూ విభేదాలు ఉండవచ్చు. ప్రజాస్వామ్య పరిపుష్టికి అది అవసరం కూడా. కానీ.. ‘మహాభారతపు ఘోషయాత్రలో పగతురు ఎత్తివచ్చినపుడు మనం అన్నదమ్ములం అయిదుగురము కాదు, నూటయిదుగురము’ అని ధర్మజుడు అన్నట్టు.. నేటి మహా ‘భారత్ గోస యాత్ర’లో మనందరం ఏకతాటి మీద నిలవాలా, వద్దా?
‘రైతుల కోసం నా రక్తం కాలువలు గట్టినా నాకు సంతోషమే’ అని తానన్న మాటలు బండి సంజయ్ నికార్సుగా నమ్మినవాడయితే రేపు ధర్నాకు వచ్చి కూచోవాలి. తన పక్కనే చోటు యిచ్చే ఔన్నత్యం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఉన్నది, మరి ఆ సౌహార్ద స్ఫూర్తి బీజేపీకి ఉన్నదా?
ఇవి సెటైర్ కోసం మాట్లాడే రాజకీయ పంచ్‌లు కాదు. నిజంగా జరగవలసిన పనులు. ప్రజా సంఘాలు కూడా కదలాలి. రైతు బాగుకోసం కార్యాచరణకు దిగాలి. ‘రైతు స్వరాజ్య వేదిక’ లాంటి సంస్థలు కూడా వరి పంటకొనుగోళ్ళ సమస్యల గురించి చర్చిం చాలి. రైతులకు అవగాహన కల్పించాలి. కేంద్రం కొంటామని గ్యారెంటీ ఇస్తే.. వరి తప్పక వేయండి, ధర మేం ఇప్పిస్తాం అని రైతులకు చెప్పాలి. ఆ పనికి సిద్ధమా?
‘ఇది బీజేపీ-టీఆర్ఎస్ పంచాయితీ, మాకేమీ సంబంధం లేదు’ అని తప్పించుకోకుండా బీజేపీయేతర ప్రతిపక్షాలు నిర్మాణాత్మకమైన పాత్ర పోషించాలి. సమస్యకు మూలమైన కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ విధానాల్ని ఎండగట్టాలి. మతం పేరుతో మన రాష్ర్టాన్ని కబళించజూస్తున్న బీజేపీ కి దిమ్మతిరిగే జవాబు చెప్పాలి.
నేటి ‘మహాధర్నా’ అందుకు సరైన సందర్భం.
ఇది తెలంగాణ సమాజం చేస్తున్న తిరుగుబాటు బావుటా!
కేంద్ర బీజేపీ ప్రభుత్వానికి తెలంగాణ సంధిస్తున్న ఈసూటి ప్రశ్నలకు మీమద్దతు ఇవ్వండి. ప్లకార్డులు పట్టుకోండి. హైదరాబాద్ లోని ధర్నా చౌక్‌కు రావడానికి మీకు ఇబ్బందులుంటే… మీమీ వేదికల్లోనైనా సరే నినాదాలివ్వండి.
శ్రీశైల్ రెడ్డి పంజుగుల
90309 97371