e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, October 21, 2021
Home News నాన్న కష్టం.. వయా ‘కార్గో’

నాన్న కష్టం.. వయా ‘కార్గో’

పొద్దున్నే నిద్రలేచి మొకం కడుగుతుంటే.. ఫోన్‌ రింగయింది. ‘డాడీ.. తాతయ్య’ అంటూ ఫోన్‌ తీసుకొచ్చింది పెద్దబిడ్డ. ‘చిన్నయ్యా.. బాగున్నవా?’, ‘బాగున్నా నాన్న.. మీరెలా ఉన్నారు?’, ‘బాగున్నం.. బుడ్డది బాగుందా?’, ‘బాగానే ఉంది నాన్న..’, ‘ఏంది చిన్నయ్య అట్ల మాట్లాడుతున్నావ్‌, మంచిగనే ఉన్నారా?’ నాన్న అలా అడిగేసరికి నాకు మాట రాలే. ఆయనే అర్థం చేసుకొని ‘డబ్బులేమన్న కావాలా? బియ్యం, సరుకులున్నయా?’ అన్నడు. ‘ఎహే..అదేం లేదు తీయ్‌. బాగానే ఉన్నాం. అమ్మ అరోగ్యం జాగ్రత్త’ అంటూ కాసేపు ఊరు బాగోగులు తెలుసుకొని ‘ఇక ఉంట నాన్న’ అని కట్‌ చేశా.

అదే రోజు సాయంత్రం 7 కావొస్తుంది. మళ్లీ నాన్న నుంచి ఫోన్‌.. పొద్దన్నే చేశాడు కదా మళ్లీ ఎందుకు చేశాడో అను కుంటూనే ‘చెప్పు నాన్న’ అన్నాను. ‘చిన్నోడా.. బియ్యం బస్సుకేసి పంపిస్తున్న. బస్తా మధ్యలో చిన్న డబ్బా ఉంది. జాగ్రత్త’ అన్నడు. ‘వద్దులేవే నేను కొనుక్కుంటా’ అనే లోపే ‘ఈసారి పంట బాగ పండింది చిన్నయ్యా.. మన పొలంలో 42 బస్తాలైనయ్‌. మొన్ననే రెండు బస్తాలు మిల్లుకేశినం. నీకు ఉన్నయ్యో, లెవ్వోనని పంపిస్తున్న, పెద్దోడు (అన్న కొడుకు) మధిరకు వొయ్‌ ఆర్టీసీ బస్సోల్లకి ఇచ్చిండంట’ అన్నడు. ‘ఇప్పుడు బస్సుల్ల పెద్ద సామాన్లు వేయనిస్తలేరే’ అన్న. ‘ఏదో ‘కార్గో’ల వస్తయన్నడ్రా పెద్దోడు’ ‘ఓ.. అదా.. సర్లే.. స్లిప్పులు వాన్ని వాట్సప్‌ చేయమను’ అంటూ ఫోన్‌ పెట్టేశా.

- Advertisement -

ఒక్కసారి గతం యాదికొచ్చింది. ‘నాడు నాన్నొక కూలీ. ఇప్పుడు సన్నకారు రైతు. నాది ప్రైవేటు ఉద్యోగం.. నెల ఆఖరికి ఇబ్బందులు తప్పవు. అయినా పొలం వేస్తున్నడంటే నా జీతంలోంచి దుక్కులు, కూలీలు, దుగాలకు, నాట్లకు, వరికోతలకు నాన్నకు కొంత డబ్బులు పంపేవాడిని. కానీ నాన్న మూడేండ్ల సంది నన్ను డబ్బులు అడుగుతలేడు. కారణం ‘రైతుబంధు’ కింద వచ్చే పెట్టుబడి సాయం. పండగలకు ఇంటికెళ్తే కచ్చితంగా బియ్యం పంపుతడు. మధ్యలో అయిపోతే ఆ బియ్యం కోసమైనా ఇంటికి వెళ్లేవాడిని. ఎందుకంటే ఆ బియ్యంతో వండిన అన్నం తింటుంటే ఏదో సంతృప్తి. అదంతా అమ్మానాన్నల చెమట

చుక్కల కష్టం కదా..

గతంలో రూంలో బియ్యం నిండుకుంటే నేనే ఊరికి వెళ్లాల్సి వచ్చేది. లేదంటే నాన్న పెద్దోడ్ని పంపేటోడు. వాడు మాపటేల బయలెల్తే.. సిటీకొచ్చేసరికి అర్ధరాత్రి అయ్యేది. ఆటోకు రూ.200 ఇచ్చి రూముకు చేరుకునేది. ఇప్పుడు నేను ఇంటికి పోకుండా, పెద్దోడు సిటీకి రాకుండా.. తొలిసారిగా బియ్యం ఇంటికొస్తున్నయ్‌. అర్ధరాత్రికి సెల్‌కు ఆర్టీసీ నుంచి మెసేజ్‌. ‘బియ్యం గాంధీ బస్టాండ్‌కు వచ్చినయ్‌.. 48 గంటల్లో తీసుకెళ్లండి’ అనేది ఆ మెసేజ్‌ సారాంశం.

పొద్దుగాల్నే ఎంజీబీఎస్‌ బస్టాండ్‌కు పోయిన. ఆర్టీసీ పార్సిల్‌ కౌంటర్‌కు వెళ్లి‘ఖమ్మం నుంచి బియ్యం వచ్చినయ్‌ మేడం’ అని వాట్సప్‌లోని స్లిప్‌ చూపెట్టగానే ఆ నంబర్‌ ఆధారంగా వెతికి బియ్యం బస్తాను నాకప్పజెప్పారు. ఆ 50 కేజీల బస్తాను మోస్తుంటే.. నాన్న బాధ్యతను మోసినంత సంబురమైంది. గతంలో ఇదే యాభై కేజీల బియ్యం బస్తా రూముకు రావాలంటే కనీసం రూ.600 అయ్యేది. దీంతో పాటు ఓ మనిషి సమయం కూడా వృథా. ఇప్పుడు రూ.150 మాత్రమే. గంటలో రూముకు చేరా.. ఆ బియ్యం బస్తా ఇప్పితే నాన్న చెప్పిన డబ్బా గుర్తుకొచ్చింది. డబ్బా మూత తీసి చూస్తే.. 8 వేలున్నయి. వాటిని చూస్తే కండ్లు ఎరుపె క్కినయి. నాన్న కష్టం కార్గో ద్వారా నాకు చేర్చిన తెలంగాణ ఆర్టీసీకి శతకోటి శనార్థులు.

డప్పు రవి

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement