అస్సాం సాయుధ తిరుగుబాట్ల చరిత్రలో శుక్రవారం నాటి శాంతి ఒప్పందం ఓ మైలురాయి వంటిదనే చెప్పాలి. యునైటెడ్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ అస్సాం (ఉల్ఫా)కు, కేంద్ర ప్రభుత్వానికి మధ్య ఈ ఒప్పందం కుదిరింది. అరబింద రాజఖోవా నేతృత్వంలోని చర్చల అనుకూల ఉల్ఫా వర్గం మాత్రమే ఈ ఒప్పందంపై సంతకాలు చేసిందని గుర్తుంచుకోవాలి. అస్సాం ప్రజలకు సార్వభౌమాధికార, స్వతంత్ర రాజ్యాన్ని సాధించాలనే అసాధ్యమైన లక్ష్యంతో 1979లో ఉల్ఫా పురుడుపోసుకుంది. ఈ ఒప్పందం ప్రకారం ఉల్ఫా తీవ్రవాదులు ఆయుధాలు వదిలిపెట్టి ఎన్నికల రాజకీయాల్లోకి అడుగుపెడతారు. దీంతో దశాబ్దాలుగా అస్సాంను పీడిస్తున్న వేర్పాటువాద హింసాకాండకు తెరపడుతుందని భావిస్తున్నారు.
అస్సాంకు ప్రత్యేకమైన భాషా సంస్కృతులు, సహజవనరులు ఉన్నాయి. బలమైన అస్తిత్వ చైతన్యం కూడా ఉంది. 19వ శతాబ్దిలో తేయాకు తోటలు, బొగ్గుగనులు, చమురు శుద్ధి పరిశ్రమల్లో పనిచేసేందుకు పెద్ద ఎత్తున బయటివారు అస్సాంకు రావడం ఎక్కువైంది. అస్సామీ స్థానిక సంస్కృతి, సంప్రదాయాలపై దీని ప్రభావం పడింది. స్థానిక, స్థానికేతరుల మధ్య ఉద్రిక్తతలు పెరగడం మొదలైంది. బయటివారి పెత్తనాన్ని వ్యతిరేకిస్తూ ఉద్యమాలు తలెత్తాయి. వాటిలోంచి పుట్టుకువచ్చిందే ఉల్ఫా. లక్ష్యసాధనకు సాయుధ మార్గాన్ని ఎంచుకున్న ఈ సంస్థ క్రమంగా ఎదుగుతూ కొరకరాని కొయ్యగా మారింది.
1990లో అస్సాంపై ఉల్ఫా పట్టు పతాకస్థాయికి చేరుకున్నది. అప్పట్లో సమాంతర ప్రభుత్వం నడిపిన చరిత్ర ఆ సంస్థకున్నది. అస్సాం అడవుల్లో ఉల్ఫా ఆడిందే ఆట. పాడిందే పాట. చెట్ల ఆకులు కదలాలన్నా ఉల్ఫా నాయకుల అనుమతి ఉండాల్సిందేనని కథలు కథలుగా చెప్పుకొనేవారు. బడా కంపెనీల నుంచి కోట్లలో ‘యుద్ధనిధి’ వసూళ్లు జరిగేవి. యూనిలివర్ వంటి బహుళజాతి కంపెనీ నుంచి మూడున్నర కోట్లు రాబట్టుకోవడంపై అంతర్జాతీయంగా గగ్గోలు తలెత్తింది.
ఉల్ఫా అణచివేతకు గట్టిచర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడులు రావడం మొదలైంది. దాంతో కేంద్రం సైన్యాన్ని పంపి తిరుగుబాట్లను అణచివేసేందుకు కఠిన పద్ధతులనే ప్రయోగించింది. 1200 మందికి పైగా ఉల్ఫా తీవ్రవాదులను అరెస్టు చేసింది. అస్సాంను కల్లోలిత ప్రాంతంగా ప్రకటించింది. రాష్ట్రపతి పాలన విధించి సైనిక ప్రత్యేకాధికారాల చట్టం అమలు చేసింది. ఇవన్నీ కేంద్రానికీ, స్థానిక ప్రజలకు మధ్య దూరాన్ని పెంచాయి.
కేంద్ర బలగాలకు ఉల్ఫాకు మధ్య జరిగిన సాయుధ ఘర్షణల్లో ఇప్పటిదాకా పదివేల మందికి పైగా మరణించారని ఒప్పంద కార్యక్రమానికి హాజరైన కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించడం గమనార్హం. ప్రస్తుత ఒప్పందం అస్సాంకు శాంతి, సుస్థిరతలను తెస్తుందని అంటున్నారు. కానీ అది అంత సులభంగా సాధ్యమయ్యేలా కనిపించడం లేదు.
చర్చలను మొదటినుంచీ వ్యతిరేకిస్తున్న పరేశ్ బారువా నేతృత్వంలోని అతివాద వర్గం శాంతి ఒప్పందానికి దూరంగా ఉండిపోవడమే అందుకు కారణం. చర్చల అనుకూల వర్గంతో ఒప్పందం చేసుకొని అదే అంతిమ పరిష్కారమన్నట్టుగా హోంమంత్రి అమిత్ షా చెప్పుకొస్తున్నారు. కానీ అన్ని వర్గాలను కలుపుకొని వస్తేనే శాశ్వత శాంతి నెలకొంటుందని వేరే చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం పాక్షికంగానైనా ఉల్ఫా తీవ్రవాద సమస్యకు పరిష్కారం లభిస్తే మంచిదే.