మతం మానసికమైనది. మార్పు మౌలికమైనది.ఉద్వేగం వల్లనో, ఉద్రేకం వల్లనో మనసుపై కలిగే ప్రభావాన్ని,ఆ ప్రభావంలో తీసుకునే నిర్ణయాన్ని, దాని పర్యవసానాన్నిగణించడానికి నిర్దిష్ట పరామితులుండవు.
కానీ భౌతికమైన మార్పు వల్ల సాకారమయ్యే అభివృద్ధి మాత్రం కళ్లముందు కనిపిస్తుంది. దాన్ని కొలవడం కూడా సాధ్యమవుతుంది. అభివృద్ధి కష్టసాధ్యమైనది. ఉద్వేగాన్ని రేకెత్తించడం సులువు. అభివృద్ధికన్నా, అమూర్తమైన ఉద్వేగమే రాజకీయ ప్రయోజనాలకు దగ్గరి దారిగా కనిపిస్తుంది. అందుకే ప్రస్తుత కాలమాన పరిస్థితుల్లో మతం ఒక రాజకీయ ఉద్వేగ అస్త్రంగా మారింది. ఈ వలలో చిక్కుకుంటున్న ప్రతిపక్షాలు జాతీయ యవనికపై పదేపదే నీరసపడుతున్నాయి. సమీప భవిష్యత్తులో బీజేపీని ఓడించడం
అయ్యే పనేనా? అసలు బీజేపీకి ప్రత్యామ్నాయం ఉన్నదా? అన్న నైరాశ్యంలో మునిగిపోతున్నాయి.నిజమా? బీజేపీ నిజంగా అజేయమైనదా? దాన్ని ఎదిరించి గెలవడం సాధ్యం కాదా? ఇదొక ఆసక్తికరమైన చర్చ.
ఏయుగంలోనైనా ప్రకృతి ఎప్పుడూ ఒక సంతులనాన్ని కోరుకుంటుంది. త్రాసు ఒకవైపే మొగ్గి ఉండడం కాల స్వభావం కానే కాదు. అనంత విశ్వాంతరాళంలో శూన్యానికి వేలాడే గ్రహగోళాలు కూడా.. పరస్పర వికర్షణతో ప్రతిద్వంద్విస్తుంటాయి. భూగోళంలో నిక్షిప్తమైన అయస్కాంత క్షేత్రం కూడా ఉత్తర ధ్రువానికి సరిసమానమైన బలంతో దక్షిణ ధ్రువం ఉంటుంది. రాజకీయాల్లోనూ అంతే. ప్రత్యామ్నాయమే లేని, లేదనుకునే పరిస్థితి పూర్తిగా అసహజమైనది. అసందర్భమైనది. అవాస్తవికమైనది. ప్రత్యామ్నాయం ఎప్పుడూ ఉంటుంది. కానీ దాన్ని గుర్తించడానికి, ఒడిసిపట్టడానికి, వెలికి తీయడానికి, ప్రకటించడానికి కొన్ని ప్రత్యేక నైపుణ్యాలు, నాయకత్వ లక్షణాలు అవసరమవుతాయి.
2014లో బీజేపీ సొంతంగా 282 సీట్లతో కేంద్రంలో అధికారంలోకి వచ్చింది. అప్పుడు దానికి వచ్చిన ఓట్లు 31 శాతం. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఇంత తక్కువ ఓట్ల శాతంతో కేంద్రంలో సొంతంగా ఒక పార్టీ అధికారంలోకి రావడం అదే మొదటిసారి. 2019కల్లా బీజేపీ ఓట్లు 37 శాతానికి, సీట్లు 303కు పెరిగాయి. 1989 తర్వాత ఒక పార్టీ సాధించిన అత్యధిక ఓటు షేరు ఇదే. అయినా కూడా రెండు సార్వత్రిక ఎన్నికల్లోనూ బీజేపీకొచ్చింది మూడో వంతుకు కొంచం అటూ ఇటూ మాత్రమే. అంటే రెండొంతుల మంది బీజేపీకి ఓటు వేయలేదు. ఇది పోలైన ఓట్ల లెక్క మాత్రమే. ఈ గణాంకాల సందేశం… బీజేపీకి సంపూర్ణ ఆమోదనీయతేం లేదు.
2018 మార్చిలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి చేతిలో 21 రాష్ర్టాలున్నాయి. దేశంలోని 76 శాతం విస్తీర్ణం, 70 శాతం జనాభా దాని ఏలుబడిలో ఉండింది. ప్రస్తుతం ఎన్డీయే చేతిలో ఉన్నవి (కర్ణాటక, మధ్యప్రదేశ్‌లలో ఎలా అధికారంలోకి వచ్చినా సరే) 17 రాష్ర్టాలు. 49.6 శాతం జనాభా, 44 శాతం భూభాగం మాత్రమే బీజేపీ-మిత్రపక్షాల పరిపాలనలో ఉంది! అంటే నాలుగేళ్లలోనే బీజేపీ బలం గణనీయంగా తగ్గింది. అందువల్ల దీన్ని ఎదిరించి నిలవడం అసాధ్యమేమీ కాదు.
వ్యూహంలో లోపం
బీజేపీ ఆడే ఆటను ప్రత్యర్థులు పూర్తిగా అర్థం చేసుకోకపోవడమే, అది అజేయమైనదనే భావనకు కారణం. శకుని మాయా పాచికలతో ధర్మరాజు జూదమాడినట్టు, ప్రత్యర్థులు ఎంతసేపూ బీజేపీ విసిరిన పాచికలనే తామూ చేతుల్లోకి తీసుకుని పందెం వేస్తున్నారు తప్ప, తమ పాచికలు విసిరే సాహసం చేయడం లేదు. బీజేపీ వ్యూహం సుస్పష్టం. అది తన బలాన్ని ఉన్నదానికన్నా ఎక్కువ చేసి, భూతద్దంలోపెట్టి చూపిస్తుంది. దీంతో ప్రత్యర్థులు ఒకరకమైన ఫ్రస్ట్రేషన్లో కూరుకుపోతారు. అ సమయంలో ఒక అప్రాధాన్యమైన అంశాన్ని అత్యంత ప్రధానమైన అంశంగా తెరపైకి తెస్తుంది. దాని మాయలో పడి ప్రత్యర్థులు అదే చాలా ఇంపార్టెంట్ అనుకుని తొందరపడి నోరుజారుతారు. ఆ వ్యాఖ్యలకు ప్రజా బాహుళ్యంలో ఆమోదం లేదని చాటి చెప్పేలా సోషల్‌మీడియా తదితర ఉపకరణాల ద్వారా బీజేపీ ఎదురుదాడి చేస్తుంది. ఈ దెబ్బతో ప్రత్యర్థులు మరింత గందరగోళపడిపోయి, మరిన్ని తప్పులు చేసి, మరింత నైరాశ్యంలో కూరుకుపోయి, తమమీద తామే నమ్మకం కోల్పోయే స్థితికి చేరుకుంటారు. ఒకరకంగా ఆట ప్రారంభించడానికి ముందే ఓటమి అంగీకరించే స్థితిలోకి జారిపోతారు.
చెల్లాచెదురుగా శిబిరం
బీజేపీని ఎదుర్కొనడంలో విపక్షాలు విఫలమవడానికి అనేక కారణాలున్నాయి. విపక్ష శిబిరమంతా చెల్లాచెదురై ఉన్నది. ఈ తరహా రాజకీయాలను ఒకప్పుడు చాకచక్యంగా ఎదుర్కొన్న నాయకుల్లో అనేకమంది ఇప్పుడు లేరు. కొందరున్నా వయోభారంతో సతమతమవుతున్నారు. వారి వారసులు తగిన స్టేచర్ సంపాదించడంలో విఫలమయ్యారు. సమర్థత ఉన్నప్పటికీ మరికొందరు తమ తండ్రులు, తమ పార్టీలు గతంలో చేసిన తప్పులకు బాధ్యత వహిస్తూ ఓటర్ల ముందు బోనులో నిలబడ్డారు. బీహార్‌లో లాలూ కుమారుడు తేజస్వి, యూపీలో ములాయం కుమారుడు అఖిలేశ్ ఈ కోవలోకి వస్తారు. ఇక కాంగ్రెస్ పూర్తిగా అచేతనావస్థలోకి జారిపోయింది. గాంధీ కుటుంబానికి కాంగ్రెస్ తమ చేతిలో ఉండడమే ప్రధానం తప్ప పార్టీ అభ్యున్నతి కాదు. ఈ వాతావరణంలో అనేక రాష్ర్టాల్లో ఏళ్లుగా ఆయా పార్టీలను, సిద్ధాంతాలను, భావజాలాలనే నమ్ముకుని ఉన్న ద్వితీయ శ్రేణి నాయకులు, కార్యకర్తలు గందరగోళంలో పడిపోయారు. పోరాడాలన్న కసి వారిలో ఉంది. కానీ మార్గనిర్దేశం చేయగలిగిన వారు లేరు. చేయిపట్టి నడిపించేవారు లేరు. పలు రాష్ర్టాల్లో ఇదే పరిస్థితి.
అవగాహనా రాహిత్యం
క్షేత్రస్థాయి పరిస్థితి అలా ఉంటే, సైద్ధాంతిక అవగాహన రాహిత్యం మరో సమస్య. మతాన్ని మాత్రమే నమ్ముకుని రాజకీయాలు చేసినన్ని రోజులు బీజేపీ ఒకదశ వరకు ఎదగగలిగిందే తప్ప, పూర్తిస్థాయి రాజకీయ పక్షంగా అవతరించలేకపోయింది. 2014లో కూడా గుజరాత్ మోడల్ అంటూ మోదీ అభివృద్ధి నమూనానే చూపించారు తప్ప మతాన్ని కాదు. కారణాలు ఏవైనా బీజేపీ ఇప్పుడు హిందుత్వాన్ని, దేశభక్తిని ఎజెండాగా పెడుతున్నది. విచిత్రంగా విపక్షాల నాయకులు బీజేపీ నినాదాల మీదే మాట్లాడుతున్నారు.
ప్రశ్నించాల్సింది ఎవరు? ప్రతిపక్షాలు. జవాబివ్వాల్సింది ఎవరు? అధికారపక్షం. కానీ ఇప్పుడు రివర్స్‌లో జరుగుతున్నది. ప్రత్యర్థికి బీజేపీ రియర్ వ్యూ మిర్రర్లో గతాన్ని చూపుతుంది. అతడిక ముందు కుచూడడు. అద్దంలో గతాన్నే చూస్తూ నడుస్తుంటా డు. చివరికి యాక్సిడెంట్లో చిక్కుకుంటాడు. వర్తమానాన్ని గతానికి ముడిపెట్టి, ప్రత్యర్థిని అందులో బందీ చేయడం బీజేపీ వ్యూహం. వర్తమానాన్ని భవిష్యత్తుకు ముడిపెట్టి జరగాల్సినదాన్ని చెప్పినప్పుడే విపక్షాలు సఫలమవుతాయి. ఇప్పుడున్న
రాజకీయాల్లో ఏది మాట్లాడాలో కాదు; ఏది వదిలేయాలో తెలుసుకోవాలి. మనమేది చెప్పాలో కాదు; ఎదుటివారితో ఏది చెప్పించాలో తెలుసుకోవాలి. ఏది చేస్తే ప్రత్యర్థులు తన వ్యూహంలో చిక్కుకుంటారో బీజేపీకి తెలుసు. దాని నుంచి తప్పించుకునే తెలివితేటలు ఎక్కువగా అవసరం.
బీజేపీ ఎజెండాను గుడ్డిగా తప్పుబట్టడమో, విమర్శించడమో, వ్యతిరేకించడమో కాదు. దానికి ప్రత్యామ్నాయ ఎజెండా ఏదో, దానిని చెప్పగలగాలి. తక్షణ స్పందనలు అనర్థదాయకం. ఇగ్నోర్ చేయాల్సిన వాటిని కచ్చితంగా ఇగ్నోర్ చేయాల్సిందే. బీజేపీని ఎదుర్కొనే వ్యూహానికి రైతు ఉద్యమం మంచి ఉదాహరణ. ఎన్నిసార్లు, ఎంత రెచ్చగొట్టినప్పటికీ రైతులు బీజేపీ వలలో పడలేదు. తమ సింగిల్ పాయింట్ ఎజెండాకు కట్టుబడి ఉన్నారు. అందుకే వారు పైచేయి సాధించగలిగారు.
సిద్ధాంతంతో అధికారంలోకి వస్తామా? అధికారంలోకి వస్తే సిద్ధాంతాన్ని వ్యాప్తి చేయగలుగుతామా? అనే దానిపై బీజేపీ తన వైఖరిని తలకిందులు చేసుకుంది. ఒకప్పటి బీజేపీకి సిద్ధాంతమే ముఖ్యం. ఇప్పటి బీజేపీకి అధికారమే పరమావధి. అందుకోసం అది సిద్ధాంతంతో కూడా రాజీ పడుతుంది. కశ్మీర్లో పీడీపీతో పొత్తు ఇలాంటిదే. ఈశాన్యంలో బీజేపీ సైద్ధాంతిక భావజాల వ్యాప్తి తక్కువ. కానీ అక్కడ అనేక చిన్న పార్టీలను విలీనం చేసుకోవడం ద్వారా అది అధికారంలోకి రాగలుగుతున్నది. విపక్షాలు దీన్నుంచి పాఠం నేర్చుకోవాలి. చిల్లర గొడవలను పక్కనబెట్టి విశాల ప్రాతిపదికన ఏకమై, బీజేపీని ముఖాముఖి పోరులోకి దించినప్పుడే అవి పైచేయి సాధించగలవు. విపక్షాలు ఐక్యంగా ఉన్నచోట బీజేపీని నిలువరించడం సులువు. అది మహారాష్ట్ర అయినా, మరో రాష్ట్రమైనా!
ప్రత్యామ్నాయ మాడల్
దశాబ్దాల పాటు జాతీయ పార్టీల ఏలుబడిలో ఉన్న ఉత్తరాదితో పోలిస్తే, ప్రాంతీయ పార్టీల పరిపాలనలో ఉన్న దక్షిణాది ఎంతో అభివృద్ధి సాధించింది. ఉత్తరాది కన్నా దక్షిణాది 25-30 ఏళ్లు ముందుంటుంది. కానీ దక్షిణాది పార్టీలు తమతమ రాష్ర్టాలకే పరిమితమైపోయాయి తప్ప.. ‘ఇదీ మా అభివృద్ధి మోడల్. మోస్ట్ సక్సెస్ఫుల్, రిజల్ట్ ఓరియెంటెడ్’ అని ఇప్పటిదాకా దేశం ముందు ప్రెజెంట్ చేయలేదు. ఢిల్లీ మోడల్ అని ఆప్ చెప్తున్నా, అది కేవలం సిటీ స్టేట్ (నగర రాష్ట్రం) మోడల్. ఆప్ పర్స్పెక్టివ్ కూడా పరిమితమైనది. మండల్-కమండల్ వివాదం తర్వాత ఉత్తరాది కుల-మత రాజకీయాల్లో చిక్కుకుంటే, దక్షిణాది వాటికి అతీతంగా విజయవంతమైన అభివృద్ధి నమూనాలను ఆవిష్కరించింది.
ఎనిమిదేళ్లలో తెలంగాణ సాధించిన అభివృద్ధి ఒక కేస్ స్టడీ. ఇలాంటి నమూనాను దేశం ముందు ప్రతిపాదించి, విస్తరించాల్సిన సమయం ఇప్పుడు ఆసన్నమైంది. ఇందుకు అనువైన వాతావరణాన్ని కల్పించడం ముందస్తు అవసరం. దేశంలో జాతీయ స్థాయిలో ఇప్పుడు ఒకవైపు బీజేపీ ఉంది, మరో వైపు ఎవరున్నారు? కాంగ్రెస్ కనుమరుగయ్యే స్థితిలో ఉంది. జనతా పరివారం చీలికలు పీలికలైంది. ఉభయ వామపక్షాలు రెలవెన్స్ కోల్పోయాయి. ఎన్నికల సంఘం జాబితాలో జాతీయ పార్టీలుగా కొన్ని కనిపించినా అవి రాష్ర్టానికెక్కువ, దేశానికి తక్కువ. మరి బీజేపీకి ప్రతిద్వంద్వి ఎవరు?
ఫ్రంట్లు ఇంతకుముందే విశ్వసనీయత కోల్పోయాయి. ఉన్న పార్టీలను పాత కాలపు పాపభారం వెన్నాడుతున్నది. మత అతివాదమైన హిందుత్వకు మృదు మతవాదమైన హైందవానికి మధ్యే ఇక పోరాటం. ఈ పరిస్థితిలో సరికొత్త జాతీయ పార్టీ ఆవిర్భావమే అంతిమ పరిష్కారంగా అనిపిస్తున్నది. ఇప్పుడు దేశమంతటా… విభిన్నమైన పంథా కోరుకుంటున్న ప్రజలున్నారు. దానికి మద్దతివ్వగల మేధోశ్రేణి ఉంది. కాగడా అందిస్తే ముందుకు తీసుకెళ్లగల టార్చ్ బేరర్లున్నారు. దారి చూపితే పోరాడే లీడర్లు, క్యాడర్ ఉన్నారు. కావాల్సిందల్లా ఒక ఎజెండా.. దాన్ని ప్రతిఫలించే జెండా.. దాన్ని నిలబెట్టగల పార్టీ… నడిపించే నాయకుడు!
కాలగమనంలో నిర్నిరోధంగా ఏదీ ఉండదు. ఎదురు లేని శక్తి ఏదీ ఉండదు. చరిత్రలో అసాధ్యంగా, అసంభవంగా కనిపించే అనేక విషయాలు నిజమైన దాఖలాలున్నాయి. జర్మన్ గోడ బద్దలవడం, సోవియట్ పతనమవడం, తెలంగాణ ఏర్పడటం ఇలాంటివే. మనం చూసినవే. బీజేపీ ఇప్పుడు ప్రబలంగానే కనిపిస్తుండవచ్చు. కానీ, దాని పరిమితులు దానికున్నాయి. ఇప్పటికీ దక్షిణాదిలో, కోస్తా ప్రాంతాల్లో దాని బలమెంత అంటే చెప్పలేం. లక్ష్యం ఇప్పటికిప్పుడు జయించడం కాదు. ప్రత్యామ్నాయ సిద్ధాంత ప్రాతిపదికను దేశానికి అందివ్వడం, ప్రజల ముందు పెట్టడం. ఈ విశాల దృక్పథంతో చూసినప్పుడు.. ఇప్పుడు కనిపిస్తున్న జాతీయ రాజకీయ శూన్యతలో ప్రత్యామ్నాయ రాజకీయ శక్తి అవతరణకు కచ్చితంగా అవకాశం ఉంది. దేశానికి ఆ అవసరం కూడా ఉంది.
– మల్లావఝల