యుగ, ఆది పదాల కలయికే యుగాది. అదే ఉగాది. నూతన యుగాదికి నాంది తిథి ఉగాది పర్వదినం. ‘ఉగస్య ఆది’- ఉగాది అని కూడా కొందరు నిర్వచిస్తారు. ఉగ అంటే నక్షత్ర గమనం, జన్మ, ఆయుష్షు అని అర్థాలున్నాయి. వీటన్నిటికి ఆది.. ఉగాది. జన్మ, ఆయుష్షులకు మొదటిరోజుగా ఉగాదిని భావిస్తారు. సనాతన సంప్రదాయం ప్రకారం చైత్ర శుక్ల పాడ్యమి నాడే సృష్టి జరిగిందని పురాణ వచనం. అందుకే చైత్ర మాసంతో కొత్త ఏడాది ప్రారంభమవుతుంది. కొత్త ఏడాది మొదటిరోజును ఉగాది పండుగ పర్వదినంగా చేసుకుంటాం.
వివిధ కాలాలకు చెందిన పలువురు రుషులు యుగ నిర్వచనం వివిధ రకాలుగా పేర్కొన్నారు. ‘యుగ’ అనే పదం వివిధ కాల పరిమాణాలను సూచిస్తుంది. దేవాది దేవుడైన శ్రీకృష్ణుడు భగవద్గీతలో బ్రహ్మదేవుడి రోజులో పగటి కాలగతి ఆధారంగా యుగాన్ని ఇలా నిర్వచించారు.
సహస్రయుగ పర్యంతమ్ అహర్యద్బ్రహ్మణో విదుః
రాత్రిం యుగసహస్రాంతాం తేహోరాత్రవిదో జనాః॥
(భగవద్గీత 8-17)
వెయ్యి చతుర్యుగాల (మహాయుగం) కాలం, బ్రహ్మదేవుడికి ఒక రోజు (కల్పం) అవుతుంది. మానవుల కాలమానం ప్రకారం 432 కోట్ల ఏండ్లు బ్రహ్మకు ఒక పగలు. రాత్రి కూడా అంతే. అంటే భూమిపై 864 కోట్ల ఏండ్ల కాల ప్రమాణం బ్రహ్మకు ఒక రోజున్నమాట. ఇలాంటివి 360 రోజులైతే ఆయనకు ఒక ఏడాది. అంటే బ్రహ్మ వందేండ్ల ఆయుష్షు మూడు లక్షల పదకొండు వేల నలభై కోట్ల ఏండ్లు. ఇప్పటివరకు ఆరుగురు బ్రహ్మలు సృష్టికార్యాన్ని ముగించారు. ప్రస్తుతం ఏడో బ్రహ్మ ద్వితీయపరార్థంలో ఉన్నాడు. అంటే ఆయన వయసు ప్రస్తుతం 51 ఏండ్లు. ఈ కలియుగం ప్రమాది నామ సంవత్సర చైత్ర శుద్ధ పాడ్యమి నాడు ప్రారంభమైంది. ఈ కల్పం ప్రారంభమై 197,29,49,114 ఏండ్లు పూర్తయ్యాయి. ఇప్పుడు మనం వైవస్వత మన్వంతరం కలియుగంలో ఉన్నాం.
విష్ణు సహస్ర నామాల్లో భగవంతుణ్ని ‘యుగాది కృత్’ అని సంబోధించబడింది. సత్య, త్రేతా, ద్వాపర, కలియుగాలతో కూడిన చతుర్యుగాలను శ్రీకృష్ణుడు తన యుగావతారాలతో ఆరంభిస్తాడని ఇది తెలియజేస్తుంది. కాబట్టి, ప్రస్తుత ఉగాది ప్రత్యేకంగా మనం ప్రస్తుతం ఉన్న కలియుగ ఆరంభాన్ని సూచిస్తుంది. ద్వాపర యుగాంతంలో శ్రీకృష్ణుడు తన భౌమ లీలలను ముగించగానే కలియుగం ప్రారంభమైంది.
యస్మిన్కృష్ణో దివం యాతస్తస్మిన్నేవ తదాహని
ప్రతిపన్నం కలియుగమితి ప్రాహుః పురావిదః
(శ్రీమద్భాగవతం 12.2.33)
కృష్ణ భగవానుడు వైకుంఠానికి వెళ్లిన రోజే కలియుగం ఆరంభమైందని కాలాన్ని శాస్త్రీయంగా విశ్లేషించిన ప్రాచీన పండితులు వివరించారు. కలహ, కల్మషాలతో కూడిన కలియుగం ఒక ‘ఇనుప యుగం’గా వర్ణించారు. కలియుగం ఎన్నో దుఃఖాలకు నిలయమైనప్పటికీ, దీనికి అద్భుతమైన లక్షణం ఒకటి ఉన్నదని చెప్తున్నది భాగవతం.
కలేర్దోషనిధే రాజన్నస్తి హ్యేకో మహాన్గుణః
కీర్తనాదేవ కృష్ణస్య ముక్తసఙ్గః పరం వ్రజేత్
(శ్రీమద్భాగవతం 12.3.51)
‘కలియుగం దోషసాగరమే అయినప్పటికీ దీనిలో ఒక మహాగుణం ఉన్నది. శ్రీకృష్ణ పరమాత్మను కీర్తించడం వల్ల మనిషి భవబంధ విముక్తుడై పరంధామాన్ని చేరగలుగుతున్నాడు’ అని భావం.
నూతన సంవత్సరం ఆరంభమయ్యే ఈ పర్వం నాడు శ్రీకృష్ణ భగవానుడికి, ఇష్టదైవానికి ‘ఉగాది పచ్చడి’ని నివేదించి ఇంటిల్లిపాదీ ప్రసాదంగా స్వీకరించాలి. ఈ పచ్చడిలోని షడ్రుచులు మానవ జీవితంలో అనేక పార్శాలకు నిదర్శనంగా అభివర్ణిస్తారు. కొత్త సంవత్సరాన్ని కొత్తగా ప్రారంభించాలి. ప్రతిరోజూ ఇష్టదైవ అర్చన విధిగా ఆచరించాలి. ‘హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ హరే రామ రామ రామ హరే హరే’ మంత్రాన్ని నిత్యం జపం చేయాలి. దీనివల్ల మన జీవన విధానంలో అనేక ఉన్నత అభిరుచులను ఆపాదించుకోవచ్చు. ఎన్ని కష్టాలెదురైనా నిశ్చలమైన మనసుతో స్థితప్రజ్ఞుడై జీవించవచ్చు. అలాగే, ఉగాది నాడు దేవాలయానికి వెళ్లి భగవంతుడి ఆశీస్సులు పొందాలి. యథాశక్తి అన్నదానం, బీదలకు సాయం, గో సేవ మొదలైన ధార్మిక సేవల్లో పాలుపంచుకోవాలి.
–శ్రీమాన్ సత్యగౌర చంద్రదాస ప్రభూజి,
93969 56984