కుటుంబకష్టాల జీవనదిని చకచకా ఈదుతూ
చక్కబెట్టే మత్స్యావతారం -నాన్న,
అతి కష్టమైన సంసారభారాన్ని
నిండుగా మోసే కూర్మావతారం నాన్న,
నిందల బురదను మోస్తూ
మందహాసమయ్యే వరాహావతారం నాన్న,
లోపల కోరికలసింహాన్ని అణచి,
పైకి శాంతనరుడిగా
నిలబడే నరసింహుడు -నాన్న,
క్షణకాల కోపమై అరక్షణంలో
చల్లబడే పరుశరాముడు – నాన్న,
పిల్లలకిచ్చిన మాటలకై నిలువెల్లా శ్రమిస్తూ,
నిలుపుకునే శ్రీరాముడు -నాన్న,
బలంగా కన్పిస్తున్నా మానసిక
బలహీన – బలరాముడు నాన్న,
కుటుంబ లోక కల్యాణం కోసం ,
శోక అపవాదులను భరించే కృష్ణుడు నాన్న,
తట్టుకోలేని ఒత్తిళ్ళెదురైనా,
అర్ధరాత్రి ఆలుబిడ్డలను వదిలిపెట్టి
వెళ్ళలేని బుద్దుడు నాన్న,
రేపటి గెలుపు నాదేనని
స్వయంగా ప్రకటించుకునే
అమాయక కల్కి – నాన్న!
దగ్గరగా దర్శిస్తే -,
దశావతారాలు తానే..
తనలోనే దశావతారాలు!
డాక్టర్ కాసర్ల నరేశ్ రావు: 9441406252