కుంభకర్ణ నిద్ర నుంచి మేల్కొన్న కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ ఒక్కసారి ఆవులించి.. తెలంగాణ పర్యటన నేపథ్యంలో రాష్ట్ర రైతుల తరఫున ఒక ట్వీట్ చేద్దామని భావించినట్లున్నారు. రాష్ట్రంలో తమ పార్టీ వాళ్లు తెలుగులో రాసిచ్చిన విషయాన్ని యథాతథంగా ట్వీట్ చేసి చేతులు దులుపుకొన్నారు. ఆ విషయాన్ని ఆయన సరిచూసుకున్నారో లేదో అనుమానమే. ఎందుకంటే, వడ్లు కొనబోమంటున్న కేంద్రంలోని బీజేపీ సర్కారును, వడ్లు కొనాలని డిమాండ్ చేస్తున్న తెలంగాణ ప్రభుత్వాన్ని ఒకే గాటన కట్టి, దీనిపై పోరాటం చేస్తామంటూ ముక్తాయించారు. దేనిపై పోరాడుతారు? ఎవరిపై పోరాడుతారు? రాహుల్ అపరిపక్వతకు మరో నిదర్శనం ఈ ట్వీట్. ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి దాదాపు 20 ఏండ్లవుతున్నా.. కాంగ్రెస్ యువరాజుకు ఇంకా విషయ పరిజ్ఞానం అలవడకపోవటం ఆ పార్టీ చేసుకున్న దురదృష్టంగా భావించాలేమో!
1956లో ఉనికిలోకి వచ్చిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ను అత్యధికకాలంపాటు కాంగ్రెస్ పార్టీనే ఏలింది. అప్పుడు తెలంగాణలో రైతుల పరిస్థితి ఏమిటి? వానలు పడి నేల తడిస్తే ఇంత పంట. లేకుంటే పడావే. నాటి పాలకులకు ఓ సాగునీటి ప్రాజెక్టు కడుదామన్న ప్రణాళిక లేదు. భూగర్భ జలాలను పెంచాలన్న స్పృహ లేదు. కరువు కోరల్లో చిక్కుకొని ఊళ్లకు ఊళ్లే వలస పోతుంటే ఆ మానవ సంక్షోభాన్ని ఎలా నివారిద్దామన్న ఆలోచన లేదు. జీవితం మీద ఆశ కోల్పోయి ఆత్మహత్యల బాట పట్టిన రైతులను ఆదుకోవాలన్న బాధ్యత లేదు. తెలంగాణ బతుకులు తెల్లారిపోయింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వాల కనుసన్నలలోనే. తెలంగాణను వలస ప్రాంతంగా మార్చి ఇక్కడి వనరుల మీద, ఇక్కడి ప్రజల మీద, ఇక్కడి భాష సంస్కృతుల మీద ఆంధ్ర ఆధిపత్యాన్ని నెలకొల్పింది ఈ ప్రభువుల హయాంలోనే. వివక్షకు వ్యతిరేకంగా తిరగబడిన తెలంగాణను రక్తపుటేరుల్లో ముంచిన కళంక చరిత్ర కూడా వీరిదే.
దశాబ్దాల వెతలు, వేదనల తర్వాత నేడు స్వరాష్ట్రంలో తెలంగాణ రైతన్న ఊపిరి పీల్చుకుంటున్నాడు. సాగును పండుగలా జరుపుకొంటున్నాడు. కుడిఎడమల అండగా నిలుస్తూ కేసీఆర్ ప్రభుత్వం ఇస్తున్న భరోసాతో కొత్త జీవితాన్ని ఆస్వాదిస్తున్నాడు. దేశానికే అన్నం పెడుతానంటున్నాడు. కానీ, బీజేపీ సర్కారు లేనిపోని కొర్రీలు వేస్తూ, పంజాబ్‌కు ఒక నీతి తెలంగాణకు మరో నీతిని అనుసరిస్తూ దుష్ట రాజకీయాలకు పాల్పడుతున్నది. కేంద్రం అప్రజాస్వామిక పోకడలపై తెలంగాణ ప్రభుత్వం ఏడాదికిపైగా పోరాడుతోంది. పార్లమెంటులో టీఆర్ఎస్ ఎంపీలు నిరసన గళం వినిపిస్తున్నారు. అదే పార్లమెంటులో ఉన్న రాహుల్‌గాంధీ దీన్ని చూడలేదా? చూసి ఉంటే ఇన్నాళ్లూ ఏం చేసినట్లు? రాజకీయాల సంగతి పక్కనపెట్టినా.. రైతుల విషయంలో స్పందించే బాధ్యత లేదా? నిద్రలోంచి లేచినవాడిలాగా ఈ ఆకస్మిక ట్వీట్ ఏమిటి? అతనికంటే ఘనుడు ఆచంట మల్లన్న అన్నట్లుగా.. రాహుల్‌కు అసలు విషయాన్ని వివరించాల్సిన రాష్ట్ర కాంగ్రెస్ నేతలు, అదిగో పులి ఇదిగో తోక అంటూ వీరంగానికి సిద్ధమయ్యారు. ఇదీ కాంగ్రెస్ పరిస్థితి.