జీవి అంటే జీవనేచ్ఛ! తన ఉనికిని కొనసాగించాలన్న కోరిక. ఒక వైరస్ అణువు నుంచి మానవుడి వరకూ, మానవుడి నుంచి దైవం వరకు ఉండే సమాన లక్షణం. ఈ సమాన లక్షణానికి ఆధారం.. శుద్ధచైతన్యంలో కలిగే ‘అహం’ భావం. అంటే ‘నేను’ అనే భావం. ఈ భావం కలిగించే జీవనేచ్ఛ ‘వివేచన’గా విచ్చుకుంటుంది. అంటే ప్రాథమికంగా జీవి తన ఉనికిని సుఖమయంగా కొనసాగించేందుకు చేయదగిన, చేయదగని పనుల గురించి తీసుకునే ‘నిర్ణయమే’ వివేచన. ఇది జీవి ఉనికి సురక్షితమైన కొనసాగింపునకు సురక్షితమైన ప్రధాన ఉపకరణం. వివేచన లేకుంటే జీవి మనుగడ ప్రశ్నార్థకంగా మారుతుంది.
వివేచన మూడు దశలలో, స్థాయులలో ప్రకటితమవుతుంది. మొదటిది సహజాత వివేచన. రెండోది స్థూలవివేచన. మూడోది సూక్ష్మ వివేచన. సహజాత వివేచన స్థూల వివేచనలో, ఈ రెండూ కలిసి సూక్ష్మ వివేచనలో విలీనమై ఉంటాయి. సహజాత వివేచన కొన్ని సంవేదనలకే పరిమితమై ఉంటుంది. అది కూడా పలుదిశలలో సాగకుండా ఒకే దిశలో ఉంటుంది. నిమ్నజీవులు సహజాత వివేచనకే పరిమితమవుతాయి. అంటే వాటి వివేచన తమ ఉనికి కొనసాగింపునకు కావలసిన ఆహార సంపాదన, పొందవలసిన రక్షణ, ప్రత్యుత్పత్తి ఇచ్ఛ మేరకే పనిచేస్తుంది. సంతాన పరిరక్షణ దృష్టి కూడా వాటికి ఉండదు. వర్గదృష్టి అసలే ఉండదు. దేహానికి మాత్రమే పరిమితమైన వివేచన ఇది.
స్థూల వివేచన కొంత విస్తరించి ఉంటుంది. జీవి తన గురించి ఆలోచించినా, తనకు అవసరమైన పరిసరాలనూ, ఇతర జీవరాశినీ పరిగణనలోకి తీసుకుంటుంది. తన స్వార్థ ప్రయోజనానికి విరుద్ధం కాకుండా, సహకరించినంతవరకు లోక ప్రయోజనాన్ని కూడా లెక్కలోకి తీసుకుంటుంది. ఇందులో స్వార్థం, పక్షపాతం, వ్యాప్తి చెందాలన్న కోరిక ప్రబలంగా ఉంటాయి. స్వభావంలో కూరుకుపోయి మారలేని గుణం, విజయ ఆకాంక్ష దీని ముఖ్య లక్షణం. మనిషి విషయంలో వ్యాపారం, రాజనీతి, వర్గాధిక్యత లాంటి విషయాల్లో ప్రాబల్యం చూపేది స్థూల వివేచనమే. తన, పర భేదాలలో కలగలసిన విభేదాత్మకమైన వైఖరి ఇది. అన్ని సామాజిక రుగ్మతలకూ స్థూలవివేచన ప్రబలతే కారణం.
సూక్ష్మ వివేచన స్వార్థ ప్రయోజనాన్ని దాటిన సత్యాన్వేషణాత్మక దృష్టి. సత్యజ్ఞానంతో లోకక్షేమానికి ప్రాధాన్యాన్నిస్తుంది. సహజత్వాన్ని, సరళత్వాన్ని, ప్రేమను విద్యగా పెంపొందిస్తుంది. ధర్మనిష్ఠతో మనిషిని అమృతత్వం వైపు నడిపిస్తుంది. ప్రతికూలతలను తొలగిస్తూ, అనుకూలతలను సృజిస్తూ సదా, సర్వదా శివ సంకల్పమయంగా సాగుతుంది. ఇదే అన్ని భేదాలను దాటి సకలలోక సంక్షేమాన్ని కోరే దైవీయమైన వివేచన.
ఏ సమాజంలో అయితే సహజాత వివేచన ప్రబలంగా ఉంటుందో ఆ సమాజం విషయ జీవితానికే పరిమితమవుతుంది. అక్కడ నాగరికత వృద్ధి చెందదు. ఆటవిక జీవనం ఇలాంటిదే! స్థూల వివేచన బలంగా ఉన్న సమాజం ‘నాగరికమై’నా అనేక విషమ వైఖరులు కలిగి ఉంటుంది. ఫలితంగా లౌకికంగా అభివృద్ధి పథంలో ఉన్నప్పటికీ, మానసికంగా సంతోష లేమితో సతమతమవుతూ ఉంటుంది. అలాంటి సమాజంలో తరచూ ఘర్షణలు చెలరేగుతూ ఉంటాయి.
ఏ సమాజంలో అయితే సూక్ష్మ వివేచన ‘సంస్కృతి’ ప్రబలమై వర్తిస్తుందో అక్కడ అన్యోన్యత, నిర్భయత, సమృద్ధి, సంతోషం, ప్రకృతి సంతులనం, సమష్టి సంక్షేమం తరతరాలుగా కొనసాగుతుంది. ఈ సూక్ష్మ వివేచన ప్రాబల్యమే మనిషిని పరిమిత సుఖాల నుంచి అఖండ ఆనందం వైపు మళ్లిస్తుంది. ఏ పరలోకాల ప్రమేయం లేని ఆధ్యాత్మిక వికాసాన్ని మనిషి జీవితానుభవంలోకి అద్వైత అనుభూతితో తెస్తుంది.
–యముగంటి ప్రభాకర్ 94401 52258