జనం వచ్చేకొద్దీ ఆగిన గుండెలో వేదన
ఏడుపులతో… మూలుగులతో
కిక్కిరిసిన చావు కళతో
నట్టింట్లో శవం ఉక్కిరిబిక్కిరి…
వచ్చిపోయేవారు చల్లే పలుకులకు
వరుసలతో తలచి తలచి
అరచి అలిసిన బంధువుల నోళ్లకు మధ్య
ఆఖరి ఘట్టం ముస్తాబు….
నిన్న గడ్డకట్టిన రోజు
కాస్త కరగటం మొదలై
ప్రాణం లేని శరీరం కోసం
నాలుగు కోపులు ప్రాణం పోసుకుంటే
పూల మధ్య ఘనీభవించిన
శాశ్వత మౌనాన్ని
గౌరవిస్తూ బారులు తీరాయి
ఆఖరి చూపులు..
కానీ,
కేవలం రెండే రెండు కన్నీటి బొట్ల కోసం
ఆశగా చూసిన ఆఖరి మజిలీ
చివరిలో కూడా….
చచ్చినా సుఖం లేదని
సంపాదించి ఇచ్చింది లాక్కోలేక
ఆగిన గుండెలో వేదన ఆగక
తుది రోజుకు చులకనై
ఖాళీ చేసిన శరీరాన్ని చూస్తూ
ఈ లోకంలో మళ్ళీ పుట్టించొద్దని
ముఖం చంపుకొని
తల కొరివికి ముందే
తన బాధలో తానే తగులపడిపోయింది.
-చందలూరి నారాయణరావు , 97044 37247