‘నీళ్లు-నిధులు-నియామకాలు’ నినాదమే ప్రధాన లక్ష్యంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైంది. ఆవిర్భావం నుంచి నిబద్ధతతో, బంగారు తెలంగాణే లక్ష్యంగా రాజకీయ దార్శనికతతో ముఖ్యమంత్రి కేసీఆర్ పాలన సాగిస్తున్నారు. నీళ్ల లక్ష్యం కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నెరవేరింది. మన రాష్ట్రంలో ఆదాయ వనరుల ద్వారా వచ్చిన నిధులను మన రాష్ట్ర పురోభివృద్ధికే వ్యయం చేస్తున్నాం. ఇక మూడవది నియామకాలు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రభుత్వ, ప్రభుత్వ అనుబంధ సంస్థల్లో 2 లక్షల ఉద్యోగాలిచ్చింది. ప్రభుత్వం దీనితో సంతృప్తి చెందక ‘మన ఉద్యోగాలు మనకే’ అనే నినాదాన్ని నిజం చేస్తూ
95 శాతం స్థానికులకే ఉద్యోగాలు కల్పించేలా, ప్రణాళికాబద్ధంగా 80,039 ఉద్యోగాలు భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. ఏటా జాబ్ క్యాలెండర్ విడుదల చేయనున్నట్లు అసెంబ్లీ సాక్షిగా సీఎం కేసీఆర్ చేసిన ప్రసంగం తెలంగాణ నిరుద్యోగుల్లో ఆత్మైస్థెర్యాన్ని పెంచింది.
నిరుద్యోగుల ఆశలకనుగుణంగా ఉద్యోగ కల్పన చేయడం ప్రామాణికమైన అంశం. మనం రెండు విషయాలను ప్రధానంగా అవగాహన చేసుకోవాలి. ఒకటి ప్రభుత్వరంగంలో ఉద్యోగాలు, రెండు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా ఉద్యోగాలు. గత ఏడున్నరేండ్లుగా ప్రభుత్వరంగంలో ఉద్యోగాల కల్పన జరగలేదని విపక్షాలు తీవ్ర విమర్శలు చేశాయి. తెలంగాణలో యువతకు ఉపాధి కల్పనలో ప్రభుత్వం ఏమరుపాటుతో లేదు. తెలంగాణ ప్రభుత్వ అధికారిక గణాంకాల ప్రకారం లక్షా 57 వేలకుపైగా ఉద్యోగాల నోటిఫికేషన్లు జారీచేయగా 1,33,942 ఖాళీలను భర్తీచేసింది. తెలంగాణ తొలి ప్రాధాన్య అంశమైన నీళ్లు, తద్వారా వ్యవసాయరంగంలో గణనీయమైన వృద్ధిరేటు, దానికి అనుగుణంగా క్షేత్రస్థాయి విస్తరణాధికారులను నియమించడం ద్వారా నూతన ఉద్యోగాలను సృష్టించింది. తాజాగా మరో 80,039 ఉద్యోగాల కల్పనకు నోటిఫికేషన్లు విడుదల చేసింది. ఇంతటి భారీ స్థాయిలో ఉద్యోగాలు ప్రకటించడం చరిత్రలో ఇదే మొదటిసారి.
ప్రభుత్వరంగంలో ఉద్యోగాల కల్పనలో రోస్టర్ విధానం అతి ప్రధానం. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలో 9వ షెడ్యూల్లో 89 సంస్థలు, 10వ షెడ్యూల్లో 142 సంస్థలు చేర్చబడ్డాయి. ఈ సంస్థల విభజన జరిగి, ఉద్యోగుల విభజన జరిగితే తప్ప ఖాళీలు గుర్తించి రోస్టర్ విధానం నిర్ణయించడం సాధ్యం కాదు. జనాభా ప్రాతిపదికన ఉద్యోగుల విభజన జరగాలని చట్టంలో పొందుపరిచినా విభజనలో న్యాయపరమైన సమస్యలు ఎదురయ్యాయి. ఈ విషయంలో రాష్ర్టాల మధ్య సయోధ్య కుదర్చాల్సిన కేంద్రం నిర్లక్ష్యంగా వ్యవహరించింది. కొన్ని కోర్టు కేసులతో, అవాంతరాలు సృష్టించడంతో మరికొన్ని ఉద్యోగాలు నిలిచిపోయాయి. ఆర్టికల్ 371 (డి) ప్రకారం స్థానికతను నిర్ణయించడం మరొక ప్రధాన అవరోధంగా నిలిచింది. ఉమ్మడి మహబూబ్‌నగర్, ఆదిలాబాద్ జిల్లాలు వెనుకబడిన జిల్లాలు. రాష్ట్ర ఆవిర్భావంతో వేగంగా అక్కడ విద్య, ఆరోగ్యం, ఉపాధి అవకాశాలు మెరుగుపడుతున్నాయి. గతంలో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన హైదరాబాద్ వాసులతో మారుమూల వెనుకబడిన ఆదివాసీ జిల్లాలు పోటీపడటం అసాధ్యమయ్యేది. ఇది అన్నిరంగాల్లో సమానావకాశాలు కల్పించాలన్న రాజ్యాంగస్ఫూర్తికి విరుద్ధమే. అందుకే సీఎం కేసీఆర్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా ప్రామాణికంగా, హేతుబద్ధంగా జిల్లాలను జోన్లు, మల్టీజోన్లు వారీగా విభజించారు. అన్నిస్థాయిల ఉద్యోగాల్లో స్థానికులకే 95 శాతం ఉద్యోగాలు లభించేలా తీసుకువచ్చిన తెలంగాణ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ (ఆర్గనైజేషన్ ఆఫ్ లోకల్ క్యాడర్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ డైరెక్ట్ రిక్రూట్మెంట్)- 2018 రాష్ట్రపతి ఆమోదం పొందడంలో కేసీఆర్ చేసిన కృషి చరిత్రాత్మకమైనది.
తెలంగాణ యువత అభివృద్ధి, సంక్షేమం పట్ల ప్రభుత్వం మొదటి నుంచి ఒక స్పష్టమైన ప్రణాళికతో ఉన్నది. ఏ దేశంలోనైనా, రాష్ట్రంలోనైనా సాంకేతికంగా ప్రభుత్వరంగంలో రెండు శాతానికి మించి ఉద్యోగాల కల్పన ఉండదు. కానీ పెరిగిన విద్యావకాశాల కారణంగా ఏటా దాదాపు రెండు లక్షల మంది మార్కెట్లోకి వస్తున్నారు. వీరందరి సంక్షేమం, ఉపాధి అవకాశాలను సృష్టించడంలో తెలంగాణ ప్రభుత్వం సఫలమైంది. అందుకు నిదర్శనం దేశంలో 6.5 శాతం నిరుద్యోగులు ఉండగా తెలంగాణ నిరుద్యోగిత శాతం (4.5), 2 శాతం తక్కువగా ఉన్నదనే విషయాన్ని గ్రహించాలి.
ఉద్యోగ, ఉపాధి అవకాశాల్లో మానవ వనరుల అభివృద్ధి అతి ప్రధానం. పేద, మధ్యతరగతి వర్గాలకు లక్షలు ఖర్చుపెట్టి కోచింగ్ సెంటర్లలో చదివించే స్తోమత ఉండదు. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ స్టడీ సర్కిల్ల అభివృద్ధి జరిగింది. వీటిద్వారా ప్రభుత్వరంగంలో ఉద్యోగాలకు మెరుగైన శిక్షణ అందిస్తున్నారు. తాజాగా మరింత ఎక్కువ సంఖ్యలో విద్యార్థులకు శిక్షణ అందించేందుకు మరో 5 స్టడీ సర్కిళ్లు, ప్రతీ నియోజకవర్గంలో ఒక స్టడీ సెంటర్ ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల కానున్న నేపథ్యంలో ప్రభుత్వ పక్షాన ఉచిత కోచింగ్ అందించనున్నట్లు ప్రకటించడం హర్షణీయం. అంతేకాకుండా రాష్ట్రంలో మన ఉద్యోగాలు మనం సాధించుకునే దిశగా చట్టం తేవడం తెలంగాణ పునర్నిర్మాణంలో ఒక కీలక మలుపు. నీళ్లు తెచ్చారు; నిధులు సాధించారు; ఇప్పుడు నియామకాల వేగిరం పెంచారు. కేసీఆర్ సుదీర్ఘ ఉద్యమ అనుభవ పాఠాలు, సునిశిత ప్రణాళికా, స్పష్టమైన అవగాహన, కార్యాచరణ కలిగిన నాయకత్వంతోనే అభివృద్ధి సాధ్యమైంది.-(వ్యాసకర్త: ఉపకులపతి, కేయూ)
రాష్ట్ర ప్రభుత్వం ప్రతి వర్సిటీలో ఉచిత కోచింగ్ సెంటర్ల ఏర్పాటుకు సూచనలివ్వడమే కాకుండా,ప్రాథమికంగా 5 లక్షల గ్రాంట్‌ను మంజూరు చేసింది. దానికి అనుకూలంగా రాష్ట్ర యూనివర్సిటీలు కార్యాచరణలో నిమగ్నమయ్యాయి. మరోవైపు పారిశ్రామికరంగంలో యువత మెరుగైన అవకాశాలు అందిపుచ్చుకునేలా తెలంగాణ అకాడమీ ఆఫ్ స్కిల్ అండ్ నాలెడ్జ్ (టాస్క్)ను ఏర్పాటు చేసి తద్వారా ఇప్పటికే మానవ వనరుల అభివృద్ధికి తోడ్పడింది.
-ప్రొఫెసర్ తాటికొండ రమేష్