‘ఆడనేర్చిన కాలు, బొంకనేర్చిన నోరు తీరుమారద’నే నానుడి ఉన్నది. అబద్ధాల పునాదుల మీద బతుకనేర్చిన బీజేపీ అయినదానికీ, కానిదానికీ అదేరీతిన వ్యవహరిస్తున్నది. తెలంగాణలో గిరిజన రిజర్వేషన్లు పెంచాలని రాష్ట్ర శాసనసభ ఏకగ్రీవ తీర్మానం చేసి పంపితే, అటువంటిదేమీ తమ వద్దకు రాలేదని కేంద్రప్రభుత్వం నిర్లజ్జగా అబద్ధమాడింది. రిజర్వేషన్ పెంపుపై 2017 ఏప్రిల్ 15న రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం మొదలు.. ఐదేండ్లుగా సుదీర్ఘ ప్రక్రియ కొనసాగింది. కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల మధ్య అనేక ఉత్తర, ప్రత్యుత్తరాలు నడిచాయి. కేంద్రం కోరిన వివరణలన్నింటికీ తెలంగాణ ప్రభుత్వం సమాధానం ఇచ్చింది. సుప్రీంకోర్టు తీర్పు రాగానే బిల్లును ముందుకు తీసుకెళ్తామని హామీ ఇచ్చారు. ఇంత జరిగినా రిజర్వేషన్ పెంపు విషయం తమకేం తెలువదని పార్లమెంటు సాక్షిగా మాట మళ్లేయటం ఆత్మవంచన.
కేంద్రంలో మోదీ అధికారం చేపట్టిన నాటినుంచి అబద్ధాలను బీజేపీ ఒక కళగా మార్చి ఆచరిస్తున్నది. ఇంటా బయటా అబద్ధాలలోనే మనుగడ వెతుక్కుంటున్న బీజేపీ ఇప్పుడు వాటిని చట్టసభలదాకా తీసుకొచ్చింది. ఇప్పటికే సోషల్ మీడియాను అబద్ధాలతో భ్రష్టు పట్టించిన బీజేపీ ఇప్పుడు ఆ అసత్యాలను ఏకంగా పార్లమెంటు దాకా తీసుకొచ్చింది. అక్కడ మాట్లాడే ప్రతి మాటా రికార్డు అవుతుంది.ఆ సోయి కూడా లేకుండా బీజేపీ మంత్రులు అడ్డగోలుగా వ్యవహరించటం క్షమించరాని విషయం. నాలుక మర్లేసినతనం ప్రజల ముందు బట్టబయలైన తర్వాతనైనా కనీస పశ్చాత్తాపం ప్రకటించకపోవడం ఇంకా దారుణం. మోదీ సర్కారు పనితీరు ఎంత గొప్పగా ఉందో చెప్పడానికి ఇది నిలువెత్తు నిదర్శనం.
ఆదివాసుల రిజర్వేషన్ పెంపు విషయంలో బీజేపీది వికృత ధోరణి అయితే, కిషన్‌రెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తీరు అంతకన్నా బాధ్యతారహితం. రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం చేసినప్పుడు పీసీసీ నేతగా ఉత్తమ్ ఉన్నారు. నాడు ఎమ్మెల్యేగా, నేడు మన రాష్ట్ర ప్రతినిధిగా కేంద్రంలో మంత్రిగా ఉన్న కిషన్‌రెడ్డికి ఆది నుంచీ అంతా తెలుసు. కేంద్రం అడ్డంగా అబద్ధాలాడుతున్నా వీరిద్దరూ నోరుమెదపకపోవటం ద్రోహపూరితం. టీఆర్ఎస్ను అపఖ్యాతి పాలుచేయాలనే దుగ్ధ తప్ప, తెలంగాణ శాసనసభ ఔన్నత్యానికి భంగం వాటిల్లుతున్నదన్న స్పృహ వీరికి లేకుండా పోయింది. ఎవరెలా ఉన్నా సీఎం కేసీఆర్ గిరిజనుల అభ్యున్నతి కోసం 2015లోనే చెల్లప్ప కమిషన్ ఏర్పాటు చేశారు. ఈ కమిషన్ ఏడాదిలోనే నివేదిక సమర్పిస్తూ పెరిగిన గిరిజనుల జనాభాకు తగినట్లుగా రిజర్వేషన్లను 6 నుంచి 10 శాతానికి పెంచాలని సిఫారసు చేసింది. దీనికి అనుగుణంగానే రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో ముందుకుపోతున్నది. దేశవ్యాప్తంగా 25 కోట్ల మంది ఆదివాసుల కోసం కేంద్రం రూ.8 వేల కోట్లు కేటాయిస్తే, రాష్ట్రం- 30 లక్షల గిరిజనుల కోసం రూ.12,500 కోట్లు కేటాయించటం గమనార్హం. ఆదివాసుల అభివృద్ధి సమాజ వికాసంలో తొలిమెట్టుగా భావించి, అన్ని పార్టీలు కట్టుబడి ఉండాలి.