‘తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో తాకట్టు పెట్టారా..?’ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ని యావత్ తెలంగాణ సమాజం సూటిగా అడుగుతున్నది. ‘ప్రభుత్వాన్ని మెడలు వంచి వడ్లు కొనిపిస్తా’నని బండి సంజయ్ ప్రకటనల మీద ప్రకటనలు చేశారు. ‘తెలంగాణ రైతులు వరి వేయాల’ని ప్రసంగాల మీద ప్రసంగాల చేశారు. వానకాలం వడ్ల కొనుగోళ్లకే కేంద్రం అతీగతీ లేని పరిస్థితిని అర్థం చేసుకొని రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యామ్నాయ పంటలపై ప్రచారం చేసింది. ముఖ్యమంత్రి, మంత్రులు, కలెక్టర్లు, అధికారులు సహా ప్రత్యామ్నాయ పంటలపై రైతులకు అవగాహన కల్పించారు.
బీజేపీ నేతలు మాత్రం తెలంగాణలో సస్యశ్యామలమైన భూములన్నీ సాగునీటి ప్రాజెక్టుల కిందే ఉన్నాయని, వారంతా వరి మాత్రమే వేయాలని రైతులను రెచ్చగొట్టా రు. తెలంగాణ రైతాంగానికి బీజేపీ నేతలు సమాధానం చెప్పాల్సిన సమయం ఆసన్నమైంది. ఏప్రిల్ మొదటివారం నుంచి వరి కోతలూ ప్రారంభం కానున్నాయి. దాదాపు 65 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం దిగుబడి వచ్చే అవకాశం ఉన్నదని అధికారులు అంచనా వేస్తున్నా రు. వానకాలం వడ్ల కొనుగోళ్లకే దిక్కులేని కేంద్రం ఇప్పు డు యాసంగి వడ్లెలా కొంటుందో అర్థం కావడం లేదు.
పంజాబ్ సహా మరో రెండు రాష్ర్టాల్లో రెండు పంటలను కొనుగోలు చేస్తున్నప్పుడు తెలంగాణలో మాత్రం యాసంగి వడ్లు ఎందుకు కొనుగోలు చేయరనే సహజమైన ప్రశ్న వేస్తున్నది తెలంగాణ సమాజం. అందుకే ఈ రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌లు కేంద్రం మెడలు వంచాల్సిన ఆవశ్యకతను తెలంగాణ రైతులు గుర్తుచేస్తున్నారు.
తెలంగాణ మంత్రులు ఇప్పటికే ఢిల్లీ వెళ్లారు. మా వడ్లను కొనాలంటూ కేంద్ర అధికారులకు దరఖాస్తులిస్తున్నారు. దండాలు పెడుతున్నారు. అయినా కేంద్రం స్పష్టత ఇవ్వకపోవడం ఈ ప్రాంత రైతాంగాన్ని అవమానించినట్లే. గతంలో కేసీఆర్ సహా మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు, గంగుల కమలాకర్, నిరంజన్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావు, ప్రశాంత్‌రెడ్డి, జగదీశ్‌రెడ్డి, ఎంపీలు సహా ఇతర నేతలు, అధికారులు ఢిల్లీలో అవమానాల పాలయ్యారు. ప్రధాని అపాయింట్మెంట్ దేవుడెరుగు, కనీసం కేంద్రమంత్రులు పీయూష్ గోయల్, నరేంద్రసింగ్ థోమర్‌లు పిలిచి అవమానించిన దాఖలాలెన్ని లేవు.
అందుకే మరోసారి ఆత్మగౌరవ నినాదం తెరపైకి వస్తున్నది. దేశమంతటా ఒక న్యాయం, తెలంగాణ రైతులకు మరో న్యాయమా అంటూ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. యాసంగిలో 65 లక్షల టన్నుల దాన్యం దిగుబడి ఉంటుందని ప్రభుత్వం అంచనా వేస్తున్న క్రమంలో ఆ వడ్లను కొనేదెవరని అడుగుతున్నారు. ప్రస్తుతం నిండుకున్న గోడైన్లను ఖాళీ చేసేదెవరన్న ప్రశ్నల్ని తెలంగాణ సమాజం వ్యక్తపరుస్తున్నది. ఈ కష్ట సమయంలో విపక్షాలు తెలంగాణ ప్రభుత్వంతో కలిసిరావాల్సిన అనివార్యతను తెలంగాణ మేధావి లోకం ఆశిస్తున్నది. కాంగ్రెస్ నేతలు సొంత ఎజెండా కాకుండా తెలంగాణ ప్రభుత్వంతో కలిసి కేంద్రంపై పోరు చేయాల్సిన అనివార్యతను రైతాంగం గుర్తుచేస్తున్నది. కేంద్రం, రాష్ర్టాల మధ్య సత్సంబంధాలు నెరపాలని రాష్ట్ర ప్రభుత్వం ఏడేండ్లు కేంద్రంతో సఖ్యతతో వ్యవహరించింది. ఏక్ అణా ఇవ్వకపోయినా, ప్రపంచం గర్వించదగ్గ కాళేశ్వరం సాగునీటి ప్రాజెక్టును పూర్తిచేసుకున్నది. పెద్ద రాష్ర్టాలతో పోటీపడుతూ అవార్టులు, రివార్డులు తెచ్చుకుంటున్న తెలంగాణ పట్ల కేంద్రం వివక్షపూరిత వైఖరిని యావత్తు దేశం తప్పుపడుతున్నది. ఇప్పుడు ఆత్మగౌరవ నినాదంతో దిక్కులు పికటిల్లేలా మరో పోరాటంతో కేంద్రం మెడలు వంచాల్సిన అవసరాన్ని గుర్తుచేస్తున్నది.
-వెంకట్ గుంటిపల్లి, 94949 41001