‘యుజ్యతే ఇతి యోగః’- కూర్చబడునదని యోగ శబ్దానికి అర్థం. పరమాత్మతో జీవాత్మ ఐక్యం చెందడమే యోగం. యోగ సాధన పరమలక్ష్యం కూడా ఇదే. పతంజలి మహర్షి యోగ సాధనకు యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధ్యాన, ధారణ, సమాధి అనే ఎనిమిది అంగాలతో కూడిన అష్టాంగ యోగ మార్గాన్ని రూపొందించాడు. ఈ ఎనిమిదిట్లో మొదటి రెండు అంటే యమ, నియమాలు మనిషిని మనీషిగా మార్చి చిత్తశుద్ధిని కలిగించడానికి ఉపయోగపడుతాయి. ‘శరీర సాధనాపేక్షం నిత్యం యత్కర్మతద్యమః’- శరీరాన్ని ఒక సాధనంగా కోరుతూ జీవిత పర్యంతం ఆచరించదగిన సత్యం, అహింస మొదలైనవాటిని యమాలు అంటారు. అహింస, సత్యం, అస్తేయం, బ్రహ్మచర్యం, అపరిగ్రహం ఈ ఐదింటిని పతంజలి మహర్షి యమాలుగా పేర్కొన్నాడు.
‘అహింసా పరమోధర్మః’- అహింస పరమోన్నత ధర్మం అని శాస్త్ర వచనం. మనసుతో గానీ, వాక్కుతో గానీ, శారీరకంగా గానీ ఎవరికీ ఎలాంటి బాధను, కష్టాన్ని కలిగించకుండా ఉండటమే అహింస. హింసకు స్వార్థం ప్రధాన కారణం. స్వార్థపరుడు తన సుఖం కోసం ఇతరులను ఏదో రూపంలో బాధిస్తాడు. అందువల్ల స్వార్థాన్ని త్యజించాలి. ప్రతీ జీవి పట్ల ప్రేమ, కరుణ, దయ ఉన్నప్పుడే అహింస సాధ్యమవుతుంది. అహింస మనల్ని, మన చుట్టూ ఉన్న పరిసరాలను, వాతావరణాన్ని సంతోషంగా ఉంచడానికి దోహదం చేస్తుంది.
ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండటం, అబద్ధం ఆడకపోవడం, సత్యం పలకడం, మనపట్ల ఇతరులకు కలిగే నమ్మకం, అంకితభావం.. మన సత్య ప్రవర్తనపైనే ఆధారపడి ఉంటాయి. ఇంకా లోతుగా చెప్పాలంటే వికారాలకు లోనుకానిది, ఎప్పుడూ ఉండేది, నాశనం లేనిది, దేశ కాలమాన పరిస్థితులకు అతీతమైనది ఏదో.. అదే పరమ సత్యం. అంటే పరమాత్మే పరమ సత్యం.
అస్తేయం అంటే దొంగతనం చేయకపోవడం. మనది కానిదాన్ని ఆశించకపోవడం, ఆశ, దురాశలను వదిలివేయడాన్ని అస్తేయంగా చెప్పవచ్చు. మనలోని లేమితనం, విపరీతమైన కోరికలు, అభద్రతాభావం, అసంతృప్తి దొంగతనాన్ని ప్రేరేపిస్తాయి. కష్టపడి సంపాదించుకోవాలి. అవసరానికి మించి ఎక్కువ సంపదను పోగు చేసుకోకూడదు. ఇతరుల ప్రయోజనాలకు భంగం కలిగించొద్దు. దానం వల్ల, త్యాగం వల్ల అస్తేయాన్ని సాధించవచ్చు. కామానికి దూరంగా ఉండటమే బ్రహ్మచర్యం. నియమబద్ధమైన వైవాహిక జీవితం కూడా బ్రహ్మచర్యమే. ఇది సాధారణ అర్థం. వాస్తవానికి బ్రహ్మంలో సంచరించడమే బ్రహ్మచర్యం. నిరంతరం బ్రహ్మం గురించి చింతించడం, ఇంద్రియ శక్తులను భౌతికసుఖాల కోసం కాకుండా వాటిని స్వాధీనం చేసుకొని పరమాత్మను తెలుసుకోవడానికి వినియోగించడం నిజమైన బ్రహ్మచర్యం. దీనివల్ల శక్తి జాగృతమై ఓజస్సు పెరుగుతుంది. అపరిగ్రహం అంటే ఇతరుల నుంచి ఏదీ ఆశించకుండా ఉండటం. అపరిగ్రహం వల్ల మనిషికి స్వేచ్ఛ లభిస్తుంది. కర్మ చేయడంలో దృష్టి నిలిపి ఫలితాన్ని ఆశించకపోవడం కూడా అపరిగ్రహమే! ఒకవేళ ఆశించినా అత్యాశకు పోకుండా అవసరం మేరకే ఉండాలి. ఇది అసంగత్వానికి దోహదం చేస్తుంది. దీన్నే ‘కర్మణ్యే వాధికారస్తే మా ఫలేషు కదాచన’ అని భగవద్గీత పేర్కొన్నది. ఈ ఐదు యమాలు సామాజిక జీవనానికి, సుఖశాంతులకు దోహదం చేస్తాయి. ఇతరులతో సత్సంబంధాలను ఏర్పరుస్తాయి.
‘నియమస్తు యత్కర్మ అనిత్యమాగన్తు సాధనమ్’- శరీరం కన్నా బాహ్యమైన మృజ్జలాదులు సాధనంగా కలిగి నిత్యం చేయాలనే నిర్బంధం లేనివి నియమాలు. శౌచం, సంతోషం, తపస్సు, స్వాధ్యాయం, ఈశ్వర ప్రణిధానం (ఈశ్వరుడిపై మనసు లగ్నం చేయడం) ఈ ఐదింటిని పతంజలి మహర్షి నియమాలుగా పేర్కొన్నాడు. పక్షికి రెక్కల్లా యమ, నియమాలు రెండూ వ్యక్తిగత క్రమశిక్షణకు, మానసిక శాంతికి, ఆధ్యాత్మిక ఉన్నతికి దోహదం చేస్తాయి. వీటి సాధనే నిజమైన యోగ జీవనం.