దేశ సరిహద్దులను రక్షించటమే కాదు, ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు ప్రజలను కాపాడటానికి కూడా మన సైనికులు ముందుంటారు. అందుకే సైన్యం సేవాస్ఫూర్తిని చూసి గర్విస్తాం. కానీ మారుతున్న సామాజిక పరిస్థితుల నేపథ్యంలో పౌర సమాజానికి, సైన్యానికి మధ్య ఒక అగాథం ఉందనేది కాదనలేని నిజం.
సైన్యానికి, సమాజానికి మధ్య వైవిధ్యం ఉన్న మాట వాస్తవం. అది కాదనలేం. వైవిధ్యం ఉన్నంతమాత్రాన అది వివక్షకు దారి తీయకూడదు. ఈ వివక్ష కంటోన్మెంట్లలో బాగా కనిపిస్తుంది. కంటోన్మెంట్ల నియంత్రణకు బోర్డులుంటాయి. వాటికి ఎన్నికలు జరుగుతాయి. కంటోన్మెంట్ పరిధిలో సాధారణ పౌరులు కూడా నివసిస్తుంటారు. చాలాచోట్ల కంటోన్మెంట్లు నగరాల నడిబొడ్డున వెలిశాయి. వాటి చుట్టూ నగరాలు విస్తరించాయి. కాబట్టి ప్రధాన రహదారులు కంటోన్మెంట్ల గుండా ఉన్నాయి. ఉదాహరణకు సికింద్రాబాద్ కంటోన్మెంట్. ఒకప్పుడు సికింద్రాబాద్ సైనిక స్థావరంగా ఉన్నప్పటికీ, నేడు అది హైదరాబాద్, సికింద్రాబాద్ జంటనగరాల్లో అంతర్భాగమైంది. కంటోన్మెంట్ల గుండా వెళ్లే రహదారులను సాధారణ పౌరులు వాడటం సైన్యానికి ఇబ్బంది అని భావిస్తున్నారు. కాబట్టి సాధారణ పౌరులు కంటోన్మెంట్లలోకి రాకుండా ఆటంకాలు కల్పిస్తున్నారు. ఇది పౌరుల ప్రాథమిక హక్కులను కాదనటమే. ప్రధాన రోడ్లను రాత్రివేళ మూసివేయటం, పగటిపూట బారికేడ్లు వేయటం, ప్రజా రవాణా వ్యవస్థకు ఆటంకాలు కలిగించటం వంటివి తరచూ కంటోన్మెంట్లో జరుగుతున్నాయి. సైన్యానికి పౌర సమాజమంటే ఎందుకు ఈ వివక్ష? సైన్యం గానీ స్థానిక సంస్థలు గానీ ప్రజల శ్రేయస్సునే కోరుకుంటాయి. అటువంటప్పుడు సంయమనంతో పరస్పర సహకారం తో వ్యవహరించటం అవసరం.
ఒక్క హైదరాబాద్‌లోనే కాదు. దేశంలోని నగరాలన్నింటిలో ఇదే సమస్యే. ఒకవేళ ఏదైనా అభిప్రాయ భేదం ఉంటే దాన్ని ఒక ‘సివిల్ డిస్ప్యూట్’గా చూడాలే గాని, అంతకుమించి వెళ్లరాదు. హైదరాబాద్ నగరంలో చాలా నాలాలున్నాయి. వాటి నిర్వహణ బాధ్యత మున్సిపల్, కార్పొరేషన్‌కు ఉంటుంది. వానలు కురిసినప్పుడు, నాలాలు పొంగి ఒడ్డున నివసిస్తున్న వారికి తీవ్ర నష్టం కలిగిస్తున్నాయి. ఈ నాలాల మీద మిలిటరీ అధికారులు రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించకుండా తమంతట తామే చెక్‌డ్యాంలు గానీ మరే ఇతర నిర్మాణాలు గానీ చేయడం సమర్థనీయం కాదు. మిలిటరీ అధికారులు చేసేదంతా ఒప్పనుకోవడం తప్పు. మిలిటరీ స్థానిక ప్రభుత్వాలకు జవాబుదారీ కాదు గనుక ఇష్టం వచ్చినట్లు వ్యవహరించటం సరైనది కాదు. ఇరుపక్షాలు కలిసి కూర్చొని సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకోవాలి. అంతేకానీ అనవసరపు రాద్ధాంతం చేయడం సరికాదు. ఇది వ్యవస్థలకు మంచిది గాదు.
కంటోన్మెంట్ కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉంటుంది. ఇది రక్షణశాఖకు సంబంధించిన అంశం. కనుక కేంద్రమే కంటోన్మెంట్లకు కార్పొరేషన్లకు మధ్య ఉండవలసిన సం బంధాల మీద ఒక విధానపరమైన ప్రోటోకాల్‌ను రూపొందించవలసిన అవసరం ఉన్నది. అంతేగానీ, ఏకపక్ష ధోరణితో వెళ్తే ప్రజలకు ఇబ్బంది కలుగుతుంది. నగర కార్పొరేషన్లు ప్రజలకు జవాబుదారీ. ప్రజల సమస్యలను పరిష్కరించవ లసిన బాధ్యత స్థానిక సంస్థలది. సైన్యానికి ఉండే ప్రత్యేక అవసరాలను కూడా స్థానిక సంస్థలు విస్మరించరాదు. ఇదే పరస్పర అవగాహన. కంటోన్మెంట్లు- కార్పొరేషన్లకు మధ్య సయోధ్య కుదర్చటానికి గవర్నర్ చొరవ చూపటం మంచి సంప్రదాయం. సికింద్రాబాద్ కంటోన్మెంట్ సమస్య కూడా సామరస్య పూర్వకంగా పరిష్కారం చేయాల్సిన బాధ్యత కేంద్రానిదే.
–గుమ్మడిదల రంగారావు