ఇక గతంలో కాంగ్రెస్ నుంచి గెలిచి ప్రస్తుతం బీజేపీ నుంచి తాజా మాజీ రాజగోపాల్‌రెడ్డి పోటీలో ఉన్నాడు. అధికార పార్టీ నుంచి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి పోటీ చేస్తున్నారు. అయితే ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్న కాంగ్రెస్, బీజేపీలు నియోజకవర్గానికి ఏం చేశాయని ప్రజలు నిలదీస్తున్నారు.
మునుగోడు నియోజకవర్గం ఉపఎన్నిక ఇప్పుడు రాష్ట్రంలో హాట్‌టాపిక్‌గా మారింది. ఎన్నికలు దగ్గర పడుతున్నాయి, నియోజకవర్గంలో ప్రచార తీవ్రత పెరిగింది. ఈ ఎన్నికలు టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీల మధ్య పోటీగా సాగుతున్నాయి. అయితే ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ నుంచి పాల్వాయి గోవర్ధన్ రెడ్డి ఎక్కువసార్లు ఎన్నికయ్యాడు. ప్రస్తుతం ఆయన కుమార్తె పాల్వాయి స్రవంతి అభ్యర్థిగా ఉన్నారు.
నియోజకవర్గాన్ని ఎక్కువకాలం పాలించింది కాంగ్రెస్. గతంలో పాల్వాయి గోవర్ధన్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నారు. కానీ నియోజకవర్గానికి ఆయన చేసిందేమీ లేదన్నది వాస్త వం. ఆ తర్వాత రాజగోపాల్‌రెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన అంతే. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న సమయంలో ఎక్కువకాలం అధికారంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీనే. ఆ పార్టీ పాలనలో కరెంట్ ఉంటే అదో విచిత్రం. ఉదయం ఉంటే రాత్రి, రాత్రి ఉంటే ఉదయం కరెంట్ కోతలు తప్పనిసరి. అది కూడా ఎప్పుడు ఉంటుందో తెలియని పరిస్థితి. రాత్రి పూట వచ్చే కరెంట్‌కోసం అన్నదాతలు బాయికాడనే నిద్రచేయాల్సిన పరిస్థితి. అలాంటిది టీఆర్ఎస్ పాలనలో ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఇప్పుడు ప్రభుత్వం నిరంతర విద్యుత్ ఇస్తున్నది.
ఇక మునుగోడు అంటే గుర్తుకువచ్చేది ఫ్ల్లోరోసిస్ సమస్య. మునుగోడులోని మర్రిగూడ. చండూరు, నారాయణపురం మండలాల్లో విపరీతంగా ఫ్లోరోసిస్ సమస్య ఉండేది. అనేక వందలమంది ఈ సమస్యతో కాళ్లు, చేతులు వంకర్లు పోయి అవస్తలు పడ్డారు. దీని నివారణకు ఏ ప్రభుత్వం చర్యలు తీసుకున్న పాపాన పోలేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన వెంటనే ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో ఫ్లోరైడ్ నిర్మూలనకు నడుం బిగించి మిషన్ భగీరథ నీటిని ఇంటి ంటికి అందించారు. ఇది కేసీఆర్ సర్కార్ సాధించిన విజయాల్లో అతి ముఖ్యమైనది.
గత ప్రభుత్వాల కాలంలో అభివృద్ధి పనులు కూడా అంతంత మాత్రమే. ఒకప్పుడు సింగిల్ లైన్ రోడ్లు అవి కూడా గతుకులతో కూడుకున్నవి దర్శనమిచ్చేవి. ఇప్పుడు ప్రధాన పట్టణాలకు రెండు లైన్ల రోడ్ల నిర్మా ణం, లింక్ రోడ్లు వేసిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానిది. ఇవ్వేకాదు మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, పల్లెప్రగతి, పింఛన్లు ఇలా వందలాది పథకాలు ప్రవేశ పెట్టిన చరిత్ర టీఆర్ఎస్ ప్రభుత్వానిది. ఇవ్వన్నీ మునుగోడు ప్రజలు గమనిస్తున్నారు. గమనించాలి కూడా.
గతంలో ఇక్కడ ఉనికిలోలేని బీజేపీ రాజగోపాల్ రెడ్డి రూపంలో ఎన్నికల బరిలో నిలిచింది. దేశంలో అన్ని రకాల హక్కులను కాలరాస్తున్న ప్రభుత్వం ఏదన్నా ఉందీ అంటే అది కేంద్రంలోని బీజేపీ సర్కారే. ఆ పార్టీ దేశానికి ఎంత ప్రమాదకరమో పాపం రాజగోపాల్‌రెడ్డికి కూడా తెలియదనుకుంటా. కాంట్రాక్టుల కోసం మతతత్వ బీజేపీలో చేరిన ఆయనకు అది ముందుముందు తెలియకపోదు.
మోదీ పాలనలో గ్యాస్, పెట్రోల్, నిత్యవసర ధరలు చుక్కలనంటాయి. నల్లధనం తీసుకొస్తా, ప్రజల ఖాతాల్లో జమచేస్తా అని నోట్లు రద్దు చేసి మోసం చేసిన సంగతి దేశ ప్రజలందరికీ తెలిసిందే. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటుపరం చేస్తూ దేశాన్ని ఆర్థికంగా వెనుకకు నెట్టిన ఘనత మోదీదే. వ్యవసాయ చట్టాల రూపంలో రైతులను ఇబ్బంది పెట్టిన విషయాన్ని మునుగోడు ప్రజలు గమనించాలి. దేశా న్ని కార్పొరేట్ శక్తులకు తాక ట్టు పెడుతున్న మోదీ బీజేపీ కి మునుగోడులో చోటివ్వ ద్దు. ప్రజా సంక్షేమం కోసం నిరంతరం పాటుపడుతూ అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న టీఆర్ఎస్ ను గెలిపించుకుందాం.
(వ్యాసకర్త : న్యాయవాది. సీనియర్ ఫ్రీలాన్స్ జర్నలిస్ట్)
బి. కిరణ్ ముదిరాజ్
79893 81219