శ్రీకృష్ణుడు అనగానే భగవద్గీతను బోధించి యుద్ధం చేయడమే ప్రధానమని, ఫలాన్ని ఆశించకుండా కర్మ చేయాలని అర్జునుడి వెన్నుతట్టిన సన్నివేశమే ఎక్కువగా గుర్తుకువస్తుంది. కానీ, అదే శ్రీకృష్ణుడు ఒకానొక సమయంలో యుద్ధం చేయకుండా వెనక్కి వెళ్లిన వృత్తాంతమూ భాగవతంలో కనిపిస్తుంది. కొన్నిసార్లు పోరాటం నుంచి పలాయనం కూడా అవసరమవుతుందని ఆ కథ వివరిస్తుంది. ప్రజలను అష్టకష్టాల పాలుచేసిన మేనమామ కంసుణ్ని వధించడంతో, అతని మామ అయిన మగధ పాలకుడు జరాసంధుడు మథురపై దండెత్తుతాడు. యాదవులందరినీ తుదముట్టించడానికి కంకణం కట్టుకుంటాడు. అలా పదిహేడు సార్లు మథురపై దాడిచేసి బలరామకృష్ణుల చేతిలో పరాజయం పాలవుతాడు.
పద్దెనిమిదోసారి గార్గ్య మహర్షి కుమారుడు కాలయవనుడి సహాయం తీసుకుంటాడు. కాలయవనుడికి యాదవుల చేతిలో ఓడిపోకుండా వరం ఉంటుంది. జరాసంధుడు, కాలయవనుడు ఇద్దరూ కలిసి మథురను నేలమట్టం చేయడం తప్పనిసరి అనిపించింది కృష్ణుడికి. దాంతో యాదవులందరినీ సమావేశపరచి మథురను వదిలిపెట్టి, ఎక్కడికైనా వెళ్లిపోదామని సూచిస్తాడు. ఆ మేరకు యాదవులు కుటుంబాలు, పశువులతో తమతమ ఇండ్లను విడిచిపెట్టి గుజరాత్లో పశ్చిమ సముద్ర తీరంలోని ద్వారకకు వలసవెళ్తారు.
మథురపై దాడికి వచ్చిన కాలయవనుడికి అక్కడ ఎవ్వరూ కనిపించరు. యాదవులను వెతుకుతూ ద్వారక వైపు వస్తాడు. దారిలో శ్రీకృష్ణుడు, బలరాములను చూస్తాడు. వారితో యుద్ధానికి దిగుతాడు. అయితే కాలయవనుణ్ని తాము ఏమీ చేయలేమనే విషయం తెలిసిన బలరామకృష్ణులు అతని నుంచి తప్పించుకోవడానికి ఓ కొండ గుహ లోపలికి చేరుకుంటారు. అందులో ముచుకుంద మహాముని నిద్రపోతుంటాడు.
ఒకవేళ నిద్రా భంగమై కండ్లు తెరిస్తే ముచుకుందుడికి ఎదురుపడిన తొలి వ్యక్తి కాలి బూడిదైపోతాడు. ఆ సంగతి కృష్ణుడికి తెలుసు కాబట్టే, ఆ గుహ లోపలికి వెళ్లాడు. కృష్ణుడిని తరుముతూ వెళ్లిన కాలయవనుడికి గుహలో చీకటిగా ఉండటంతో ఎవరూ కనపడరు. చివరికి ముచుకుంద మహర్షిని కృష్ణుడిగా పొరబడి, ఆయనను తంతాడు. నిద్రా భంగమైన మహర్షి కండ్లు తెరుస్తాడు. కాలయవనుడు కాలి బూడిదై పోతాడు. ఆ తర్వాత కృష్ణుడు ఆ మహర్షి దగ్గరికి వెళ్తాడు. ఆయన చూపులు కృష్ణుడిని ఏమీ చేయలేకపోతాయి. దాంతో ముచుకుందుడు తన ఎదురుగా ఉన్నది మామూలు మనిషి కాదనీ, భగవంతుడి స్వరూపమే అని గ్రహిస్తాడు. బలరామకృష్ణుల దగ్గర సెలవు తీసుకొని హిమాలయాల్లో బదరికాశ్రమానికి చేరుకుంటాడు ముచుకుందుడు.
కాలయవనుడిని ఉపాయంతో బలరామకృష్ణులు అడ్డు తొలగించుకున్న వార్త జరాసంధుడికి చేరుతుంది. అయితే సోదరులు ఇద్దరూ ఇంకా గుహలోనే ఉండి ఉంటారనుకున్న జరాసంధుడు కొండకు నిప్పుపెట్టిస్తాడు. బలరామకృష్ణులు అగ్నికి ఆహుతై ఉంటారని జరాసంధుడు అనుకుంటాడు. కానీ, వారు తప్పించుకుని ద్వారక చేరుకుంటారు. తమవారిని కలుసుకుంటారు. అక్కడే సముద్రం మధ్యలో ఓ దీవిలో దేవశిల్పి విశ్వకర్మ ఆధ్వర్యంలో సుందరమైన నగరాన్ని నిర్మించుకుంటారు. కాలయవనుడితో నేరుగా యుద్ధానికి దిగకుండా తిరోగమన వ్యూహాన్ని అనుసరించిన కారణంగా కృష్ణుడిని ఉత్తర భారతదేశంలో ‘రణ్ఛోడ్ రాయ్’ అని పిలుచుకుంటారు. గుజరాత్ రాష్ట్రం డాకోర్ పట్టణంలో ఉన్న ‘రణ్ఛోడ్ రాయ్’ ఆలయం ప్రసిద్ధిచెందింది. కాగా, స్వభావ రీత్యా యుద్ధప్రియులైన రాజపుత్రుల ఏలుబడిలో ఉన్న రాజస్థాన్, గుజరాత్ ప్రాంతాల్లో యుద్ధంలో వెనకడుగు వేసిన కృష్ణుడిని ‘రణ్ఛోడ్ రాయ్’ రూపంలో ఆరాధిస్తుండటం ఆసక్తికరమైన విషయం. అయితే ఎంతటి యోధానుయోధులు అయినప్పటికీ పరిస్థితులను అనుసరించి పోరాటం నుంచి ఒక అడుగు వెనక్కి వేయడం కూడా అనుసరణీయమే అనే సందేశాన్ని ఇస్తుంది కృష్ణుడు కాలయవనుడి కథ. యుద్ధంలో వెన్ను చూపవద్దు, అలా చేయడం పిరికివాళ్ల లక్షణం అంటుంటారు. కానీ, ముందుకు వెళ్లే మార్గం లేనప్పుడు వెనక్కి తగ్గి, ఆ తర్వాత పోరాటం కొనసాగించే వ్యూహం కూడా మంచిదేనని ఈ కథ తెలియజేస్తుంది.