ఆధునిక తెలుగు సాహిత్యంలో విశేషమైన కృషి చేసి, తనకంటూ ఒక ప్రత్యేకమైన ముద్రను ఏర్పరచుకొని, రసవంతమైన పద్యాలతో, వినసొంపైన గేయాలతో, అద్భుతమైన ప్రసంగాలతో, కమ్మని కంఠస్వరంతో ఎంతోమంది అభిమానుల్ని సంపాదించుకున్న విద్వత్కవి శ్రీగాదె శంకర కవి.
శంకర కవి 1948 మార్చి 9న జగిత్యాల జిల్లా కోరుట్ల సమీపంలోని మోహన్రావు పేట గ్రామంలో భీమయ్య, గంగ దంపతులకు జన్మించారు. వరంగల్ ఓరియంటల్ కళాశాలలో బి.వో.ఎల్లో పట్టభద్రుడై తెలుగు భాషోపాధ్యాయునిగా ఉద్యోగ బాధ్యతను నిర్వర్తించారు. తెలుగు, ఉర్దూ, హిందీ, ఆంగ్ల భాషల్లో చక్కని పాండిత్యం కలిగిన శంకర కవి చిన్నతనంలోనే మహాకవుల కావ్యాలను, ప్రబంధాలను, వ్యాకరణ, అలంకార, కావ్య శాస్ర్తాలను అధ్యయనం చేశారు. ఆయన గేయ రచనలో చేయి తిరిగిన వారు. కొత్త కొత్త ప్రయోగాలతో, ప్రత్యేకమైన విన్యాసాలతో, చక్కని శిల్ప సౌందర్యంతో, ఆకర్షణీయమైన శబ్ద సౌకుమార్యంతో గేయం రాయడంలో ఆయనకు ఆయనే సాటి. గేయం ఎంత అద్భుతంగా రాస్తారో, అంతకంటే అద్భుతంగా పద్యం కూడా రాయగలిగే ప్రతిభాశాలి శంకర కవి. ఆయన ప్రసంగం చేసినా, కవితాగానం చేసినా, స్పష్టమైన ఉచ్ఛారణతో, ఆకర్షణీయమైన గొంతుతో సినారెను తలపించేలా ఉంటుంది.
ఆయన సంధ్యా సుందరి, ఆత్మావిష్కరణం, పరశురామ ప్రతీక్షణం, సరస్వతీ సంకీర్తనం వంటి ఎన్నో కావ్యాలు రాశారు. ఆయన విద్యార్థి దశలోనే రాసిన ‘సంధ్యా సుందరి‘ ఖండ కావ్యాన్ని రాశారు. ఇందులో పద్యాలు, గేయాలు ఉన్నాయి. దీనికి మహాకవి డాక్టర్.సి. నారాయణరెడ్డి, వానమామలై వరదాచార్యులు, గణపతి రామచంద్రారావు ముందు మాటలు ఉన్నాయి. ఆయన ‘ఆత్మావిష్కరణం‘కావ్యానికి 1989లో రాష్ట్రస్థాయిలో దేవులపల్లి కృష్ణశాస్త్రి స్మారక పురస్కారం లభించింది.
‘హలము పూని గుండె కండ బలముతోని గుట్ట మెట్ట పొలము దున్ని రవ్వలు పుష్కలముగ పండించి పంచి కన్నుల ప్రాణాలు నిలుపుకున్న చిన్న రైతా! నిన్ను మించు మొనగాడెవడన్న అన్నదాతా!’
అని రైతన్న పడే కష్టాలను కళ్ళకు కట్టినట్లు ఈ గేయంలో చిత్రించారు శంకర కవి.సుప్రసిద్ధ హిందీ మహాకవి రామ్ధారీ సింహ్ దినకర్ రాసిన ‘పరశురాం కీ ప్రతీక్షా‘ అనే కావ్యాన్ని తెలుగులోకి ‘పరశురామ ప్రతీ క్షణం‘ అనే పేరుతో అనువదించారు శంకర కవి. ఇందులో ఆయన అనువాదశైలి ఎంతో రమణీయంగా ఉంది. ‘ఇది అనువాదం అనడం కన్నా పునఃసృష్టి అంటే ఎంతో బాగుంటుంది’ అని ఈ కావ్యానికి పీఠిక రాస్తూ ప్రసిద్ధ హిందీ కవి భీంసేన్ నిర్మల్ అన్న మాటలు అక్షర సత్యాలు. ఇంకా ఈ కావ్యానికి భారతీయ జ్ఞానపీర్ అకాడమీ డైరెక్టర్ పాండురంగా రావు సమకూర్చిన సుదీర్ఘమైన పీఠిక ఆయన అనువాద పటిమను, ప్రతిభా పాటవాలను తెలియజేస్తుంది.
‘నారియన విలాసడోల
నటల్లసత్తటిన్మాల
ఆమె కామ లతయే
కాదతులిత ప్రతాపశీల
ఆ యమ కటు హాలహాల అంతె కాదు మధురహాల
కానివేళ వచ్చిన హుంకార ఘోర సమరకీల’
సంస్కృత పద ప్రయోగాలతో, సుదీర్ఘ సమాసాలతో ఆయన రాసిన ఈ గేయం వినగానే ఎవ్వరిలోనైనా ఒక ఉత్సాహం, ఒక ఉత్తేజం ఉరకలు వేస్తుందనడంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు.
ప్రముఖ కవి, అష్టావధాని డాక్టర్.అందె వేంకటరాజం కోరుట్లలో స్థాపించిన భారతీ సాహిత్య సమితికి ప్రధాన కార్యదర్శిగా వ్యవహరించారు శంకర కవి. అందులో జరిగే సాహిత్య కార్యక్రమాల్లో ప్రధాన పాత్ర పోషించారు. ఆయన రూపురేఖల్లో, వేష భాషల్లో, కవితా రచనలో, కవితా గానంలో, ప్రసంగాల్లోనే కాదు, మామూలుగా ఆయన మాట్లాడే విధానంలో కూడా సినారె పోలికలు ప్రస్ఫుటంగా కనిపించేవి. అందుకే అందరూ ఆయనను ‘జూనారె’ (జూనియర్ నారాయణ రెడ్డి) అని పిలిచేవారు. ఆయనది ఒక విచిత్రమైన వ్యక్తిత్వం. ఎవ్వరు ఏమనుకున్నా సరే ఉన్నది ఉన్నట్లుగా మొహం ముందరే కుండ బద్దలు కొట్టినట్లు మాట్లాడేవారు. ‘నేను ఇలా ముక్కుసూటిగా మాట్లాడతాను కాబట్టే నాకు శత్రువులు ఎక్కువ’ అని అంటుండేవారు. ‘ముక్కు సూటిగ బోవు/మొండితనమున్న నను/గనిన కొందరు గర్వి/యనియె భావించెదరు‘..అని స్వయంగా చెప్పుకున్న నిర్మలమైన, నిష్కల్మషమైన హృదయం ఉన్న కవి శ్రీ గాదె శంకర కవి.
ఇక ‘సరస్వతీ సంకీర్తనం‘లోని పాటలు బాసర సరస్వతీ దేవిని కీర్తిస్తూ రాసిన అమృత రస గుళికలు. ఆయన సాహిత్య కృషిని గుర్తించిన నాగ్పూర్ సాహిత్య సంస్థ ‘ఆంధ్ర దినకర్ ‘అనే బిరుదునిచ్చి సత్కరించింది. ‘మునుముందు నా పున/ర్జన్మము కలదేని/అప్పుడును తెలుగు కవి/నై కలము పట్టెదను‘..ఏ పూర్వజన్మ పుణ్యం వల్లనో ఇప్పుడు కవినై పుట్టానని, మళ్ళీ కవిగానే పుడతానని సగర్వంగా చెప్పుకున్న శ్రీగాదె శంకర కవి 2011 అక్టోబర్ 28న పరమపదించారు.
-తిరునగరి శ్రీనివాస స్వామి