సృష్టి సమస్థితిలో ఉండటానికి ప్రధాన కారణం పంచభూతాలే! భూ మండలాన్ని ఆవరించి ఉన్న పంచభూతాలు మనిషి జీవితం సజావుగా సాగేందుకు దోహదం చేస్తున్నాయి. శరీరం లోపల, బయట (ప్రకృతి రూపంలో) కూడా పంచభూతాలు తమ కర్తవ్యాన్ని నిర్వహిస్తుంటాయి. అందువల్లనే మానవ జీవన వ్యవస్థతోపాటు మొత్తం ప్రాణివ్యవస్థ పంచభూతాల చుట్టూనే నడుస్తున్నది. ఈ సత్యాన్ని మనిషి గ్రహించాలి. ఈ జీవన చక్రం సవ్యంగా ఉండాలంటే ప్రకృతితో సహకరించాలి. ప్రకృతిని ఆశ్రయించాలే కానీ, ఆక్రమించే ప్రయత్నం చేయకూడదు. పంచభూతాలను ఆరాధించాలే కానీ, వాటికి కీడు తలపెట్టకూడదు. ప్రకృతిని పరమేశ్వరిగా, ప్రకృతిని పరివేష్టించి ఉన్న పంచభూతాలను పరమేశ్వర రూపాలుగా అభివర్ణించాయి మన శాస్ర్తాలు. ప్రకృతి ఆరాధనను అమ్మవారి సేవగా, పంచభూతాల పరిరక్షణను పరమేశ్వర ఆరాధనగా విశ్లేషించాయి.
సృష్టికి ఆధారమైన పంచభూతాలు మానవ శరీరాన్ని కూడా ఆవహించి ఉంటాయి. మానవ శరీర నిర్మాణాన్ని పరిశీలిస్తే ఈ విషయం అర్థమవుతుంది. మనిషి స్థూల, సూక్ష్మ శరీరాల్లోనూ పంచభూతశక్తి అంతర్లీనంగా కనిపిస్తుంది. వాక్కు, పాణి, పాదం, పాయువు, ఉపస్థ ఈ ఐదు కర్మేంద్రియాలు పృథ్వీ తత్వానికి ప్రతీకగా చెప్తారు. శబ్దం, స్పర్శ, రూపం, రసం, గంధం పంచతన్మాత్రలు. ఇవి జలతత్వానికి ప్రతీకలు. జఠరాగ్ని రూపంలో అగ్నితత్వం శరీరాన్ని ఆవహించి ఉంటుంది. చర్మం, ముక్కు, కండ్లు, చెవులు, నాలుక ఈ ఐదు జ్ఞానేంద్రియాలను అగ్నితత్వంగా భావిస్తారు. శరీరంలోని ప్రాణం వాయురూపంగా వాయుతత్వాన్ని సూచిస్తుంది. ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన అనే పంచప్రాణాలు వాయుతత్వం కిందికి వస్తాయి. మనసు, బుద్ధి, చిత్తం, జ్ఞానం, అహంకారం ఈ ఐదు అంతర ఇంద్రియాలు ఆకాశతత్వం ద్వారా ఏర్పడ్డాయి. ఇలా మనిషి స్థూల శరీరం పంచభూతాత్మకమై కనిపిస్తుంది.
సూక్ష్మ శరీరంలో ఐదు కోశాలుంటాయి. వీటినే పంచకోశాలంటారు. అవి అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ కోశాలు. వీటిలో అన్నమయ కోశం భూ తత్వానికి, ప్రాణమయ కోశం జలతత్వానికి, మనోమయ కోశం అగ్నితత్వానికి, విజ్ఞానమయ కోశం వాయుతత్వానికి ఆనందమయ కోశం ఆకాశతత్వానికి సంబంధించినవి. అంతేకాదు పంచభూతాలకు ప్రతీకలుగా మానవ శరీరంలో ఐదు నాడీకేంద్రాలుంటాయి. వీటిని శక్తి చక్రాలంటారు. మూలాధార చక్రం భూతత్వాన్ని సూచిస్తుంది. స్వాధిష్టాన చక్రం జలతత్వానికి, మణిపూరక చక్రం అగ్నితత్వానికి, అనాహత చక్రం వాయుతత్వానికి, విశుద్ధిచక్రం ఆకాశతత్వానికి ప్రతీకలుగా ఉంటాయి. ఈ ఐదు చక్రాలు కాకుండా శరీరంలో ఉండే ఆజ్ఞాచక్రం, సహస్రారచక్రం తత్వాలకు అతీతంగా ఉంటాయి. మనిషి ఆలోచనలు, నడవడిక, సంస్కారం, ప్రారబ్ధకర్మ వల్ల ఇవి ప్రభావితం అవుతుంటాయి.
యజ్ఞయాగాది క్రతువులు కూడా పంచభూత తత్వాలు నిండి ఉంటాయి. అందుకే, పంచభూతాలకు ప్రతీక అయిన ప్రకృతిని పూజించాలని శాస్ర్తాలు చెప్తున్నాయి. మనం చేసే పూజలు భూ తత్వానికి, అభిషేకాదులు జలతత్వానికి, యజ్ఞయాగాది క్రతువులు అగ్నితత్వానికి, మంత్రోచ్చారణ వాయు తత్వానికి, ధ్యానం మొదలైన సాధనలు ఆకాశతత్వానికి ప్రతీకలు. మొత్తంగా మనిషి మనిషిగా మారడానికి, ప్రకృతితో అనుబంధం పెంచుకోవటానికి, అంతిమంగా మోక్షాన్ని సాధించటానికి పంచభూతాత్మకమైన ప్రకృతిని కాపాడుకోవటం, ఆరాధించటం అవసరమనే సందేశం ఇందులో దాగి ఉన్నది.