(ముస్లిం మహిళలు ధరించే తలగుడ్డ) ధారణపై కర్ణాటక హైకోర్టు ఇచ్చిన తీర్పుతో వివాదం ఇప్పట్లో సద్దుమణిగేలా కనిపించటం లేదు. మతం, సంస్కృతితో ముడిపడి ఉన్న సున్నితాంశమైన వస్త్రధారణపై కోర్టు తీర్పు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమవుతున్నది. హిజాబ్ ధరించటం అనేది తప్పనిసరి ఇస్లాం మతాచారంలోకి రాదని నిర్ధారించటంతో పాటు, విద్యాలయాల్లో సంప్రదాయ వస్త్రధారణపై రాష్ట్ర ప్రభుత్వం విధించిన నిషేధాన్ని సైతం కోర్టు సమర్థించింది. విద్యాసంస్థల యాజమాన్యాలు, పాలకమండళ్ల నియమ నిబంధనలు, స్వయం ప్రతిపత్తిని గుర్తించి గౌరవించటం వరకు మంచిదే. కానీ, ఆ పేరిట భవిష్యత్తులో తలెత్తబోయే విపరిణామాల గురించి ఆలోచించకపోవటం అవాంఛనీయం. తీర్పు వెలువడిన కొన్ని గంటల్లోనే సుప్రీంకోర్టులో అప్పీలు దాఖలు కావటం, హిజాబ్ తమ ప్రాథమిక హక్కు అని వాదిస్తున్న విద్యార్థినులు ఏకంగా హిజాబ్ ధరించే హక్కును సాధించేవరకు పాఠశాలలకు వెళ్లబోమని ప్రకటించటం విషయ తీవ్రతను చాటుతున్నది.
బాహిర మతచిహ్నాల ప్రదర్శన, ధారణ సమానత్వానికి భంగకరమన్నదే కర్ణాటక హైకోర్టు తీర్పు సారాంశమైతే… అది మరింత సంక్లిష్టతను సృష్టించే అవకాశం ఉన్నది. ఈ తీర్పు స్ఫూర్తితో విద్యాలయాల యాజమాన్యాలు నిర్దిష్ట వస్త్రధారణతోపాటు, నడవడికలు నిర్దేశించే వీలున్నది. ఇప్పటికే కొన్ని యాజమాన్యాలు ఒక మతచిహ్నం రంగును విద్యార్థుల యూనిఫారమ్గా నిర్ణయించటం చూస్తున్నాం. ఇది మరింత ముందుకుపోయి మత చిహ్నాల రంగులతో వివిధ పాఠశాలలు ఏకరీతి వస్త్రధారణగా మారిపోతే ఎలా? బొట్టు, గాజులు, సంప్రదాయ విద్యార్థులైతే నుదుటిపై నామాలు, తలపైన గౌశిక శిఖ లాంటి వాటిని కూడా మత చిహ్నాలని భావించి అభ్యంతరకరమైనవిగా పరిగణిస్తే పరిస్థితి ఏమిటి? ఇప్పటికే కొన్ని సంస్థల్లో బాలికల తలలోని పూలు, చేతిగాజులు, వాలుజడ విషయంలో వివాదాలు చెలరేగాయి. ఇలాంటి వాటన్నింటికీ తెరదించేలా హిజాబ్ వివాదంపై తీర్పు ఓ మార్గం చూపుతుందని ఆశించిన వారికి నిరాశే మిగిలింది.
మనిషి సాంస్కృతిక ఆచరణలు చాలా లోతైనవి, అంతకుమించి గంభీరమైనవి. భారతదేశం విభిన్న మతాలు, జాతుల వైవిధ్యమైన జీవితాచరణ, సంస్కృతుల సమ్మిళితం. ఈ విశిష్టత ఏకశిలా సదృశ్యంగా ఉండాలనుకోవటం సబబేనా? ఇన్నాళ్లూ దేశ సమైక్యత, సమగ్రతకు పునాదిగా ఉన్న భిన్నత్వంలో ఏకత్వానికి విఘాతం కాదా? తరతరాల సాంస్కృతిక జీవనంలోంచి దైనందిన కార్యకలా పంగా ఉండేవాటిని కోర్టులు, చట్టాల పరిధిలో బంధించి పరిష్కరించాలను కోవటం సుసాధ్యమేనా? మనిషి భౌతికజీవనాన్ని అమితంగా ప్రభావితం చేసే మత, సంస్కృతికాంశాలను యాంత్రికంగా నియంత్రించాలను కోవటం ప్రజాస్వామికమేనా? మనిషి మానవీయతకు జవం, జీవంగా ఉన్న సాంస్కృతిక జీవనాన్ని నియంత్రించటం అశాస్త్రీయం, అసంబద్ధం కాదా!? ఈ ప్రశ్నలకు సుప్రీం కోర్టయినా జవాబు చెప్తుందా చూడాలి.