అది 1917.ఎక్కడెక్కడి వలసదారులందరి కర్మభూమిగా మారుతున్నది అమెరికా. అలాంటి లక్షల మందిలో రష్యాకి చెందిన రోజ్ బ్లంకిన్ ఒకరు. పొట్ట చేతపట్టుకుని ఆ ఏడు అమెరికాకి వచ్చిందే కానీ, తను ఏం చేయాలో ఎలా నిలదొక్కుకోవాలో తోచలేదు. భర్తతో కలిసి వాడేసిన దుస్తుల్ని అమ్ముతూ పోషణ సాగించింది. ఇంకేదైనా చేయాలంటే రోజ్కి ఇంగ్లిష్ కూడా రాదాయే! అయినా సరే ఓ రిస్క్ తీసుకుంది. ఏళ్ల తరబడి కూడబెట్టిన ఓ అయిదు వందల డాలర్లతో సెకండ్ హ్యాండ్ ఫర్నిచర్ దుకాణం మొదలుపెట్టింది. అది పేరు తెచ్చుకోవడంతో ఫర్నిచర్ ఉత్పత్తులు మొదలుపెట్టింది. దళారీలను పక్కన పెట్టి… తక్కువ ధర, ఎక్కువ నాణ్యతతో అందించే తన ఉత్పత్తులకు విపరీతమైన గిరాకీ వచ్చేసింది.
చూస్తుండగానే రోజ్ కి 90 ఏళ్లు వచ్చేశాయి. తన వ్యాపారాన్ని ఎవరైనా సమర్థుల చేతుల్లో పెడదాం అనుకుంటూ ఉండగానే.. తన స్టోర్‌లోకి అడుగుపెట్టాడు ఓ నడివయసు మనిషి. ఆడిట్ చేయించలేదు, లెక్కాపత్రాలు చూడలేదు, బేరసారాలు లేవు. ‘నేను మీ వ్యాపారాన్ని ఇంతకు కొనాలి అనుకుంటున్నాను’ అంటూ కళ్లు చెదిరే అంకె చెప్పారు అంతే. ఒకే ఒక్క కరచాలనంతో ఆ వ్యాపారాన్ని సొంతం చేసుకున్నారు. ఆయనే వారెన్ బఫెట్. పెట్టుబడికి నమ్మకం, వ్యూహం, అంచనాలను జోడించిన విజేత. ప్రశాంతంగా బతికేందుకు, రోజువారీ ఖర్చులు భరించేందుకు కాస్తంత ధనార్జన కూడా ముఖ్యమైన ఈ రోజుల్లో… తన సంపద సూత్రాలను
తెలుసుకోవడం చాలా అవసరం.
ఈ జనవరిలో వారెన్ బఫెట్ తన బెర్క్‌షైర్ హాత్వే సంస్థ సీఈవో పదవి నుంచి దిగిపోయారు. 55 ఏళ్ల సుదీర్ఘకాలం ఆయన ఆ పదవిలో ఉన్నారు. ప్రస్తుతం బఫెట్ వయసు 95 ఏళ్లు. ఈ తొలగిపోవడం అనేది కేవలం పదవికి సంబంధించింది మాత్రమే కాదు. తన సుదీర్ఘ జీవనయానం చివరి దశకు చేరుకుందనే సూచన. అందుకే ఆయన రిటైర్మెంట్ సందర్భంగా అందరూ ఒకసారి ఆయన ప్రయాణాన్ని గుర్తుచేసుకున్నారు. వాటిలో విజయాలు ఉన్నాయి, వివాదాలూ ఉన్నాయి.
ఇప్పుడు అమెరికా అగ్రరాజ్యమే కావచ్చు. కానీ, 1930ల నాటి ఆర్థిక మాంద్యం గుర్తుకొస్తే ఇప్పటికీ ఉలిక్కిపడుతుంది. ఒక్కసారిగా స్టాక్ మార్కెట్ల పతనం, దాన్ని సరిదిద్దేందుకు తీసుకున్న అనాలోచిత నిర్ణయాలతో ఆ దేశపు ఆర్థిక వ్యవస్థ ఒక్కసారిగా కుప్పకూలింది. పారిశ్రామిక ఉత్పత్తి సగానికి పడిపోయింది. ధరలు ఆకాశానికి ఎగిశాయి. నిరుద్యోగం ఆరు రెట్లు పెరిగింది. ఆ కాలం పీడకల. దాన్నుంచి కాస్త కోలుకుంటూ ఉండగానే.. రెండో ప్రపంచ యుద్ధం విరుచుకుపడింది. ఇలాంటి కాలంలో పుట్టడం దురదృష్టం అనే అనుకుంటాం. కానీ, ఎదుగుదలకు ఎలాంటి పరిస్థితులూ అడ్డం కావన్నది వారెన్ దృక్పథం.

లాభాల వేట.. ఆట!
వారెన్ తండ్రి హోవర్డ్ ఓ వ్యాపారస్తుడు. అందులో విజయం సాధించలేక, స్టాక్ మార్కెట్లో అడుగుపెట్టాడు. అందులో అద్భుతాలు చేయలేదు కానీ, తన కొడుకు వారెన్‌ను మాత్రం ప్రభావితం చేయగలిగాడు. పిల్లలకి స్ఫూర్తిగా నిలవడం కూడా ఓ విజయమే కదా. వారెన్కు షేర్ల గురించి చెప్పడమే కాదు, తనలోనూ ఆ ఆసక్తి ఉందని గ్రహించి పదేళ్ల వయసులోనే న్యూయార్క్ స్టాక్ ఎక్సేంజ్‌కి తీసుకెళ్లాడు. ఎలాగో అలా సంపాదించాలనే కసితో వారెన్ చాక్లెట్ల అమ్మకం నుంచి పేపర్లు వేయడం వరకూ అన్ని పనులూ చేసేవాడు. ఇక హైస్కూల్‌కి వచ్చేసరికి స్టాంపుల నుంచి కార్ల వరకూ అన్ని రకాల వ్యాపారాలూ చేశాడు. 14 ఏళ్లకే ఆదాయపు పన్ను రిటర్న్ ఫైల్ చేశాడు.
మిగతా కుర్రాళ్లలాగా వచ్చిన ఆదాయాన్ని తిండికి, షికార్లకి ఖర్చు చేయలేదు. సమయానికి పేపర్లు వేయడానికి ఉపయోగపడే సైకిల్, గడియారాలు కొనుక్కున్నాడు.
సంపాదన తనకు ఓ బతుకుదెరువును మించి ఆటగా మారిపోయింది. అందులో ఆరితేరడం మొదలుపెట్టాడు. వ్యాపారాలు మొదలుపెట్టడం.. అవి లాభసాటిగా ఉన్నప్పుడు మంచి ధరకు అమ్మడం ఓ దినచర్యగా మారిపోయింది. ఓ చిన్న ఉదాహరణ. పదిహేనేళ్ల వయసులో ఓ పాత పిన్ బాల్ ఆటల యంత్రాన్ని కొని స్థానిక సెలూన్లో ఉంచాడు. దాని మీద వచ్చిన లాభాలతో మరికొన్ని యంత్రాలు కొని మరిన్ని సెలూన్ల ముందు పెట్టాడు. రెండేళ్లు తిరిగేసరికల్లా ఆ యంత్రాలన్నింటినీ కలిపి విపరీతమైన లాభాలకు అమ్మాడు. ‘లాభాలతో వ్యాపారం చేయడం’ అన్నది వారెన్ జీవితంలో స్పష్టంగా కనిపించే విజయం.
గురి చూసి బరిలోకి!
వ్యాపారం మీద ఆసక్తి ఉన్న వారెన్ అదే రంగంలో చదువుకోవాలి అనుకున్నారు. కానీ, మధ్యలో తనను హార్వర్డ్ బిజినెస్ స్కూల్ తిరస్కరించింది. చదువు ఎలా ఉన్నా.. తన వ్యాపకం అయితే మానలేదు. నాన్న కంపెనీలో పనిచేస్తూనే తన డబ్బును పెట్టుబడిగా మార్చడం మొదలుపెట్టారు. వారెన్ పెట్టుబడి సూత్రాలు చాలా సరళం. ఒక కంపెనీ ఉత్పత్తులు, పనితీరు, మార్కెట్ అవసరాల ఆధారంగా దాని భవిష్యత్తును అంచనా వేయడం. అలాంటి సంస్థ కనిపిస్తే ఊరుకునేవారు కాదు. తన 21 ఏళ్ల వయసులోనే GEICO అనే ఓ బీమా కంపెనీకి మంచి రోజులు రానున్నాయని తెలిసి, ఆ ఆఫీసుకు వెళ్లారు వారెన్. ఆ కంపెనీ వైస్ ప్రెసిడెంట్‌తో గంటల తరబడి మాట్లాడి అతని మనసు గెలుచుకున్నారు. అందులో పెట్టుబడి పెట్టారు. ఇప్పుడా కంపెనీ విలువ కొన్ని లక్షల కోట్లు! అప్పటి నుంచి ఒకొక్కటిగా పెట్టుబడి భాగస్వామ్యాలు ఏర్పర్చుకుంటూ వస్తున్న వారెన్ 35 ఏళ్లు వచ్చేసరికే మిలియనీర్‌గా మారిపోయారు. అప్పుడూ తన పరుగు ఆపలేదు.
ఒక ఎత్తుకు చేరుకున్న తర్వాత సేదతీరుతూ, ఎక్కి వచ్చిన పాతాళాన్ని చూసి గర్వపడటం మనిషి నైజం. కానీ, తన విజయాన్ని సంస్థాగతం చేసుకుని.. తనంతట తానుగా ఎదిగే యంత్రంగా మారడం విజేతల నైజం. అదే చేశారు వారెన్. 1965 నాటికి బెర్క్‌షైర్ హాత్వే అనే వస్ర్తాల కంపెనీలో అధిక షేర్లతో ఆధిపత్యం సాధించారు. అప్పటికే వస్త్రరంగంలో పోటీతత్వం పెరుగుతూ, లాభాలు తగ్గడం గమనించి.. దాన్ని ఓ పెట్టుబడుల కంపెనీగా మార్చారు. కంపెనీలో ఎదుగుదలకీ, నిర్ణయాలకీ అడ్డుపడుతూ వచ్చినవాళ్లను తెలివిగా ఓడించారు. కోకోకోలా నుంచి వాషింగ్టన్ పోస్ట్ వరకూ ఎన్నో కంపెనీల్లో పెట్టుబడి పెట్టించారు. ఇప్పుడు బెర్క్‌షైర్ హాత్వే ప్రపంచంలోనే అతి విలువైన కంపెనీల్లో ఒకటి.

సంపద కోసం సహనం
ధ్యానం చేసినంత ఓర్పుగా కొంగ తన వేట కోసం ఎదురుచూస్తుంది. ఒక్క చేప కోసం ఒంటికాలు మీద తపస్సు చేస్తుంది. అనుకున్న ఫలితాలు రావాలంటే, నిరంతర శ్రమతో సహనంగా ఉండాల్సిందే. వారెన్ జీవితంలో కనిపించే అతి ముఖ్యమైన సూత్రమిది. ‘నువ్వు ఓ పెట్టుబడిని పదేళ్లపాటు ఉంచుకోలేకపోతే, దాన్ని పదినిమిషాల పాటు అట్టిపెట్టుకోవద్దు’ అన్నది తన సూచన. ‘నేను అప్పటికప్పుడు లాభాలను కోరుకోను. నేను పెట్టుబడి పెట్టిన మర్నాటి నుంచి స్టాక్ మార్కెట్ ఓ అయిదేళ్ల పాటు స్తబ్దుగా ఉండిపోతుందనే అంచనాతోనే షేర్లు కొంటాను’ అన్నది అతని దృక్పథం. షేర్ మార్కెట్లలో కేవలం ఒక్కశాతం మాత్రమే లాభాలు అర్జిస్తారని ఓ అంచనా. మన చేతిలో లేని ప్రభుత్వ నిర్ణయాలు, అంతర్జాతీయ పరిస్థితులు ఎలాగూ ఒడుదొడుకులు సృష్టిస్తాయి. అన్నింటికీ మించి తొందరపాటుతనం, తాత్కాలిక లాభాలు కోరుకోవడం, సంస్థ గురించి అవగాహన లేకుండానే పెట్టుబడి పెట్టడం, భవిష్యత్తులో దేని గిరాకీ ఎలా ఉంటుందో తెలియకపోవడం.. లాంటి ఎన్నో కారణాలు నష్టాలకు దారితీస్తాయి. ఇలాంటి తప్పులకు వారెన్ దూరంగా ఉన్నారు. ‘నువ్వు అర్థం చేసుకోలేని వ్యాపారంలోకి అడుగుపెట్టవద్దు’ అని చెప్పి ఆచరించారు. ప్రపంచ కుబేరుల్లో ఒకరుగా నిలిచారు.
పొరపాటు నిర్ణయాలు
షేర్లు కొనేటప్పుడు వారెన్ చాలా జాగ్రత్తగా ఉండేవారు. ‘సమాజంలో ఓ కంపెనీ స్థానమో, దాని ఎదుగుదలో కాదు… దీర్ఘకాలికంగా అది నిలదొక్కునే సత్తానే ముఖ్యం’ అనేవారు పెట్టుబడి కోసం. అలాగే కంపెనీ నికర విలువకీ, దాని షేర్లకీ మధ్య ఎంత వ్యత్యాసం ఉంటే అది అంత సురక్షితం (Margin of Safety) అంటారు వారెన్. ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా షేర్ మార్కెట్ ఓ జూదరంగాన్నే తలపిస్తుంది. అందుకే వారెన్ సైతం కొన్ని సందర్భాల్లో తల బొప్పి కట్టించుకున్నారు. ఉదాహరణకు తన జీవితంలో అతి పెద్ద తప్పిదంగా భావించే Dexter Shoe Companyనే తీసుకుందాం. 1993లో ఈ కంపెనీలో వేల కోట్ల పెట్టుబడులు పెట్టే సమయంలో.. చైనా నుంచి చవక సరుకులు మొదలవుతున్న విషయాన్ని పట్టించుకోలేదు వారెన్. పైగా ఆ పెట్టుబడిని కూడా డాలర్ల రూపంలో కాకుండా తన కంపెనీ షేర్ల రూపంలో పెట్టడం వల్ల ఆ నష్టం రెట్టింపైంది. అలాగే అమెజాన్, గూగుల్ లాంటి కంపెనీల్లో చవకగా పెట్టుబడి పెట్టే అవకాశం వచ్చినా కూడా వదులుకున్నారు. కానీ ఇవన్నీ కూడా పెట్టుబడుల జూదంలో సహజమే అని తనకు తెలుసు. అలాంటి పరిస్థితుల్లో కంగారుపడవద్దు అంటారు వారెన్. ‘ఒకవేళ నువ్వు గుంతలో ఉన్నావని గ్రహిస్తే.. దాన్ని మరింతగా తవ్వుకోకు’ అన్నది తన మాట. ఇలాంటి ఎత్తుపల్లాలు సహజమే అని.. ‘అసలు ఏం చేస్తున్నామో తెలియనితనమే అసలైన రిస్క్’ అనీ అంటారు.
సంపద వేరు సౌకర్యం వేరు!
వారెన్ తెలివితేటలు, వాటితో సంపాదించిన సంపద గురించి తెలిసిందే. కానీ, అంతటి సంపన్నుడు ఎలా ఉంటాడనే విషయం కాస్త ఆశ్చర్యం కలిగించక మానదు. ఇప్పటికీ తను 1958లో కొన్న ఓ అయిదు బెడ్రూమ్ల ఇంట్లోనే ఉంటున్నారు. ధనవంతులు అందరూ పోగుచేసుకునే సంపన్నమైన వాచీలు, పడవలు లాంటి వస్తువులకు తను ఆమడ దూరం. ఆ మాటకు వస్తే అసలు క్రెడిట్ కార్డు వాడకం కూడా మంచిది కాదని ఆయన అభిప్రాయం. భోజనానికి కూడా హాంబర్గర్లు, కోక్ లాంటి ఆహారమే తనకు ఇష్టం. సాధారణంగా బిలియనీర్లు పెళ్లిళ్ల సమయంలోనే ధన ప్రదర్శన అంతా చేస్తారు. ఇందుకు పూర్తి విరుద్ధంగా 20 ఏళ్ల క్రితం తన రెండో పెళ్లిని అత్యంత సాదాసీదాగా చేసుకుని పదిహేను నిమిషాల్లోనే తంతు ముగించేశారు. తనకు ఇష్టమైన కారు కూడా 2014 క్యాడిలాక్ ఎక్స్టీఎస్ అనే పాత సాధారణ కారు. అదేంటి అంటే వాహనాలు విలాసం కంటే కూడా సురక్షితంగా, సౌకర్యంగా ఉండాలి అంటారు. ‘నువ్వు ఇచ్చేది ఖర్చు, పొందేది విలువ.. ఆ విలువకే ప్రాధాన్యం ఉండాలి’ అన్నది తన మాట. అన్ని సందర్భాల్లోనూ అదే సూత్రాన్ని పాటిస్తారు.
ఇప్పటిదాకా వారెన్ గురించి అంతా గొప్పగానే చెప్పుకొన్నాం. అలాగని ఆయన చుట్టూ వివాదాలు లేవా అంటే సవాలక్ష ఉన్నాయి. ఏదన్నా ఉత్పత్తి మీద నియంతృత్వం ఉన్న సంస్థల్లో పెట్టుబడి పెట్టి వాటి పోకడలను ప్రోత్సహిస్తారనీ, మంచి కంపెనీల షేర్లు బలహీనంగా ఉన్న సమయంలో తనకు అనుకూలమైన ఒప్పందాలతో లాభపడతారనీ, తన అజాగ్రత్త వల్ల కొన్ని భారీ మోసాలు జరిగాయనీ.. చాలా పెద్ద జాబితానే ఉంది. కాకపోతే మార్కెట్ ఆటకంటే భిన్నంగా, నేరుగా తను అనైతికంగా ప్రవర్తించారు అనే ఆరోపణలు తక్కువ. అందుకే తగినంత సంపాదించాలి అనుకునేవారికి తన సూచనలు ఉపయోగం, అంతులేనంత పోగేసుకోవాలి అనుకునేవారికి అతని తప్పులు ఓ గుణపాఠం.

దాతృత్వం ఘనం
డబ్బును సరైన మార్గాల్లో పెట్టిన తర్వాత దానంతట అది పెరుగుతూనే ఉంటుంది. తరతరాలకు కావల్సినంతగా పోగవుతుంది. అయినా చాలామందికి అది సంతృప్తినివ్వదు. విలాసాల కోసం ఖర్చు చేయడం, ధన ప్రదర్శన చేయడం, సంపాదన గురించి గొప్పలు చెప్పుకోవడంతోనే కాలం గడిపేస్తారు. కానీ, 2010లో బిల్ గేట్స్ దంపతులతో కలిసి వారెన్”గివింగ్ ప్లెడ్జ్’ అనే ఉద్యమం మొదలుపెట్టారు. సంపన్నులు తమ సంపదలో కనీసం 50 శాతాన్ని సమాజానికి తిరిగి ఇవ్వాలన్న పిలుపే ఈ గివింగ్ ప్లెడ్జ్. ఇందుకోసం వారెన్ ఏకంగా 99 శాతాన్ని క్రమక్రమంగా రాసిచ్చేస్తున్నారు. ఈ చర్య అతనితోనే ఆగలేదు. ఇప్పటి వరకూ దాదాపు 250 మంది బిలియనీర్లు ఈ ఉద్యమంలో పాల్గొన్నారు. ఎలన్ మస్క్, జుకర్‌బర్గ్, అజీం ప్రేమ్ జీ లాంటి ఎంతో మంది ప్రముఖులు ఈ వాగ్దానం మీద సంతకం చేశారు.
ఎదుగుదల కోసం
‘నాకు పుస్తకాలతో పని లేదు.. లోకమే నా పుస్తకం’ అంటారు కొందరు. ‘ఒకరు నాకు చెప్పేదేంటి.. నాకే చాలా అనుభవాలున్నాయి’ అని భావిస్తారు ఇంకొందరు. వ్యక్తిగతంగా మనం ప్రతిదీ అనుభవించి తెలుసుకోలేం అని వారెన్కు తెలుసు. అందుకే పుస్తకాలను విపరీతంగా ప్రేమిస్తారు. ఏడేళ్ల వయసులోనే తను చదివిన ‘One Thousand Ways to Make $1000’ వారెన్కు సంపాదన మీద ఆసక్తి కలిగించింది. ద ఇంటలిజెంట్ ఇన్వెస్టర్, సెక్యూరిటీ అనాలసిస్ లాంటి పుస్తకాలతో ఆయన ప్రభావితం అవ్వడమే కాకుండా, వాటిని చదవమని తరచూ రికమెండ్ చేసేవారు. ఇలాంటి పుస్తకాలు మీరు రోజుకు 500 పేజీలు చదవాలని విద్యార్థులకు చెబుతుండేవారు. షేర్ హోల్డర్స్‌కు రాసే ఉత్తరాల్లో సైతం కొన్ని పుస్తకాలు చదవమని సూచించేవారు. వ్యక్తిత్వ వికాసానికి కూడా వారెన్ ప్రాధాన్యం ఇస్తారు. నలుగురిలో మాట్లాడేందుకు ఉన్న బెరుకును పోగొట్టేందుకు డేల్ కార్నిగె దగ్గర శిక్షణ తీసుకున్నారు.
సీఈఓగా వీడ్కోలు పలుకుతూ ఇన్వెస్టర్లకు బఫెట్ ఓ లేఖ రాశారు. అందులో తాను 95 ఏండ్ల పాటు జీవించడం అదృష్టమని, అదే సమయంలో ఒకింత ఆశ్చర్యం కూడా కలుగుతున్నదని పేర్కొన్నారు. 1938లో తనకు 8 ఏండ్ల వయసులో అపెండిసైటిస్ వచ్చిందని, అప్పట్లో చావు అంచుల వరకు వెళ్లి తిరిగొచ్చానని లేఖలో రాసుకొచ్చారు. ఇక ఇన్వెస్టర్లకు సూచన చేస్తూ.. ‘పెట్టుబడులు పెట్టడానికి ముందు తొలుత మన నైపుణ్యాలను మనం గుర్తు పెట్టుకోవాలి. స్వీయ అవగాహన, వాస్తవికతతో వ్యవహరించాలి. అర్థం చేసుకున్నదానిపై స్పష్టత ఉండాలి. దాంతో పాటు తెలియని దాని గురించి తెలుసుకోవాలి. ఆ క్రమంలో ఎలాంటి ప్రలోభాలకు గురికాకూడద’ని తన అనుభవసారాన్ని అందరితో పంచుకున్నారు.
అన్నిటా స్థిరత్వం!
చాలామంది సంపన్నులకి సంపద, వ్యాపారం, మార్కెటింగ్, మానవ వనరులు లాంటి రంగాల మీద మంచి పట్టు ఉంటుంది. వాళ్ల భౌతిక ఎదుగుదలకు అవే కారణం అవుతాయి. కానీ వారెన్ చాలా అంశాల మీద స్పష్టతతో కనిపిస్తారు. వారెన్ ఓ స్పష్టమైన దేవుడిని నమ్మరు. కానీ, ఏదో అత్యున్నత శక్తి ఈ లోకాన్ని నడిపిస్తోందని నమ్మే అజ్ఞేయవాది (అగ్నోస్ట్) తను.
…? కె.ఎల్.సూర్య