సక్సెస్… దీని రెసిపీ ఒక్కొక్కరికీ ఒక్కోలా ఉంటుంది. రుచీ అంతే ఎవరిది వారికే! వ్యక్తులు ప్రయాణించిన మార్గాలు, ఎదుర్కొన్న ఒడుదొడుకులు, ఎక్కిన మెట్లు పాకాన్ని పక్వానికి తెస్తాయి. నలుగురితోనూ ‘వారెవ్వా!’ అనిపిస్తాయి. విజయానికి కావలసిన ఈ దినుసులన్నీ దండిగా ఉన్న నిండు జీవితం రాధికా గుప్తది. పుట్టుకతోనే మెడ విరిగిన చిన్నారి ఆమె. కష్టపడి చదివినా ఉద్యోగాల్లో ఎన్నో తిరస్కారాలు. ఆత్మహత్య ఆలోచనల నుంచి అతి పిన్న వయసు సీఈఓల్లో ఒకరిగా అయ్యే దాకా సాహసోపేతంగా సాగిన జీవితం ఆమెది. ప్రస్తుతం ఎడెల్వీస్ మ్యూచువల్ ఫండ్ సంస్థ సీఈఓగా, షార్క్‌ట్యాంక్ కార్యక్రమానికి జడ్జిగా జనానికి సుపరిచితురాలైన రాధిక ప్రయాణం ఆద్యంతం స్ఫూర్తిమంతం!
సోషల్ మీడియా యుగంలో జనానికి చేరువైన వ్యాపారవేత్తల్లో ఎడెల్వీస్ సీఈఓ రాధికా గుప్త ఒకరు. మార్కెట్ ట్రెండ్స్‌ను గమనిస్తూ పెట్టుబడి పాఠాలు, ఆర్థిక సలహాలు, సూచనలు అందిస్తుంటారామె. అమెరికాలాంటి దేశాల్లో అధ్యక్ష మార్పు సహా రకరకాల కారణాల వల్ల తీవ్ర ఒత్తిడిలో కొనసాగుతున్న స్టాక్ మార్కెట్ గురించీ, అందులో సిప్‌లు చేసేవారికి సంబంధించీ ఇటీవల ఆమె చెప్పిన మాటలకు మంచి స్పందన వచ్చింది. ఇలా సందర్భానుసారంగా జనంలో ధైర్యాన్ని నింపడమే కాదు, తనకు తానూ జీవితంలో ఎంతో ధైర్యంగా ముందుకెళ్లారామె. అసలు ఉద్యోగానికే పనికిరాదన్న రంగంలోనే రాణించి నేడు 45 వేల కోట్ల రూపాయల విలువైన సంస్థకు మేనేజింగ్ డైరెక్టర్ కమ్ సీఈఓగా పనిచేస్తున్నారు. తిరస్కారాలు ఎదుర్కొన్న చోటే పురస్కారాలు అందుకున్నారు. అలాగని ఆమె ఏ వ్యాపారవేత్తల కుటుంబం నుంచో వచ్చారనుకుంటే మనం పొరబడ్డట్టే. మామూలు కుటుంబం నుంచి వచ్చిన ఆమె, స్వయంకృషితో ఏ స్థాయికైనా చేరొచ్చు అన్నదానికి ఉదాహరణగా నిలిచారు.
రాధికా గుప్త తండ్రి భారత విదేశాంగ శాఖలో ఉన్నత స్థాయి ఉద్యోగి. వృత్తి రీత్యా ఆయన రకరకాల దేశాలు తిరుగుతూ ఉండేవారు. రాధిక పుట్టే సమయానికి ఆయన పాకిస్థాన్‌లో ఉన్నారు. ప్రసవ సమయంలో సమస్యలు తలెత్తడంతో రాధిక మెడ విరిగిపోయి పుట్టారు. దీని కారణంగా ఆమె తల వంకరగా కనిపిస్తూ ఉంటుంది. కన్ను కూడా కాస్త మెల్లగానే ఉంటుంది. ఈ రూపురేఖల పరంగా చిన్ననాటి నుంచీ ఎన్నో వెక్కిరింతలు ఎదుర్కొన్నారామె. అయితే అవేమీ ఆమెను చదవకుండా ఆపలేకపోయాయి. ఎప్పుడూ తరగతిలో ఆమే ముందు. ఇక, ఆమె తండ్రికి పాకిస్థాన్ నుంచి న్యూయార్క్‌కి బదిలీ అవ్వడంతో అక్కడి పాఠశాలలో చేరారు. తర్వాత నైజీరియాలోని ఓ ఇంటర్నేషనల్ స్కూల్లో చదువుకున్నారు. ఈ బడిలో అపర కుబేరులు, వ్యాపారవేత్తల పిల్లలు చదివేవారు. వారికి గుర్రం సవారీ, ఈతలాంటి హాబీలుండేవి. దీంతో తనకంటూ ఓ హాబీ ఉండాలని రాధిక భావించేవారు. అయితే ఇలాంటి అభిరుచులు ఖరీదైన వ్యవహారం. మధ్యతరగతి కుటుంబాల్లో చదువుతో పాటు వీటికీ డబ్బులు కట్టడం కాస్త కష్టమే! కానీ తనకూ ఏదో ఒక హాబీ కావాలని ఇంట్లో వాళ్లను తరచూ అడగడంతో ‘ఎంచక్కా పేకాట ఆడుకుందాం..’ అన్నారు అమ్మానాన్న. దీంతో వాళ్లతో కూర్చుని ఆడుతూ అందులో నైపుణ్యం సాధించారు. అది ఓ సందర్భంలో ఆమె ఎదుగుదలకు సాయపడింది. ప్లస్ టూ తర్వాత అమెరికాలోని పెన్సిల్వేనియా యూనివర్సిటీ నుంచి కంప్యూటర్ సైన్స్ విభాగంలోనూ, ఆర్థిక శాస్త్రంలోనూ డిగ్రీ పట్టాలు అందుకున్నారు.
గొప్ప విద్యాలయాల నుంచి పెద్ద చదువులు పూర్తిచేసినా ఉద్యోగాల విషయంలో కంపెనీలు రాధికకు ప్రాధాన్యం ఇవ్వలేదు. చదువు పూర్తవుతూనే క్యాంపస్‌కి వచ్చిన ఒకటీ రెండూ కాదు 7 కంపెనీలు ఆమెను తిరస్కరించాయి. అసలే చిన్నప్పటినుంచి వెక్కిరింతలు ఎదుర్కొని సున్నితంగా మారిన ఆమె మనసు ఈ పరిణామంతో కుంగుబాటుకు గురైంది. 19వ అంతస్తులో ఉన్న ఆమె ఈ కిటికీ నుంచి దూకేస్తా అంటూ అరవడంతో స్నేహితురాలు కాపాడింది. తర్వాత మానసిక చికిత్సకూ వెళ్లారు రాధిక. ఆ తర్వాత హాజరైన ఓ ఇంటర్వ్యూ ఆమె జీవితాన్ని మలుపు తిప్పింది. ప్రముఖ ఆర్థిక సేవల సంస్థ మెకెన్జీలో ఇంటర్వ్యూ అది. చదువు కాకుండా మీకేం వచ్చు అన్న ప్రశ్న ఎదురైందక్కడ. నిజానికి ఆమెకు డిగ్రీలో చేరేప్పుడూ ఇదే సమస్య ఎదురైంది. దీంతో రాధిక తనకొచ్చిన పేకాట గురించే ఉన్నది ఉన్నట్టు చెప్పారు. ఆ ఉన్నతాధికారి ఈ ఆటలో అమెరికా టోర్నమెంట్ స్థాయి క్రీడాకారిణి కావడంతో ఇంటర్వ్యూ మొత్తం దాని గురించే సాగింది. రాధిక ఆ ఉద్యోగానికి ఎంపికయ్యారు. తర్వాత వాల్స్ట్రీట్లోనూ కొంత కాలం పనిచేశారు.
మాంద్యం సమయంలో రాధిక భారత్‌కి వచ్చి, తన ఇద్దరు స్నేహితులతో కలిసి 2009లో ‘ఫోర్‌ఫ్రంట్ క్యాపిటల్ మేనేజ్మెంట్’ అనే సంస్థను ప్రారంభించారు. ఆ స్నేహితుల్లో ఒకరైన నళిన్ మనోజ్ ఆ తర్వాతి కాలంలో ఆమె జీవిత భాగస్వామి అయ్యారు. వీళ్లు స్థాపించిన సంస్థకు మంచి పేరు రావడంతో ఎడెల్వీస్ సంస్థ దీన్ని కొనుగోలు చేసింది. రాధికకు కీలక పదవిని కట్టబెట్టింది. కొద్ది రోజుల్లోనే మంచి పనితీరుతో ఆమె ఆ సంస్థకు సీఈవో స్థాయికి చేరుకున్నారు. అప్పటికి ఆమె వయసు 33 ఏండ్లు మాత్రమే. భారత్‌లో చిన్న వయసులో సీఈవోలైన కొద్దిమందిలో ఒకరామె. తాను ఎదుర్కొన్న ఎత్తుపల్లాల ఆధారంగా ఔత్సాహిక వ్యాపారవేత్తలకు సలహాలు ఇవ్వడం అంటే ఆమెకు ఇష్టం. దాంతోనే స్టార్టప్‌లకు ఫండింగ్ చేసే ప్రముఖ టీవీ షో
న్యాయనిర్ణేతగానూ చేరారు. ఉద్యోగం- వ్యక్తిగత జీవితం, పొదుపు-మదుపుల గురించి సోషల్ మీడియా వేదికగా అభిప్రాయాలు పంచుకుంటూ వార్తల్లో నిలుస్తుంటారు. అంతేకాదు, వైకల్యం కారణంగా న్యూనతకు గురయ్యే వారిలో ఆత్మవిశ్వాసాన్ని నింపేందుకు ‘లిమిట్లెస్’ పేరిట తన జీవిత విశేషాలతో ఓ పుస్తకాన్ని తీసుకొచ్చారు. నిజమైన జీవితాలకు మించిన స్ఫూర్తి పాఠాలు ఇంకేం ఉంటాయి చెప్పండి!