ఎకో
నెట్‌ఫ్లిక్స్: స్ట్రీమింగ్ అవుతున్నది
తారాగణం: సందీప్ ప్రదీప్, వినీత్, నరైన్, సౌరభ్ సచ్ దేవ్, బిను పప్పు, బియానా మోమిన్ తదితరులు
దర్శకత్వం: దింజిత్ అయ్యతన్
‘అడవి’ని అందంగా చూపించాలన్నా.. ‘కారడవి’గా భయపెట్టాలన్నా.. ‘రిజర్వ్ ఫారెస్ట్’ అంటూ ప్రేక్షకులను సీట్లకే రిజర్వ్ చేయించాలన్నా.. మలయాళ దర్శకులు సిద్ధహస్తులు. అడవి నేపథ్యంలోని కథలను ఉత్కంఠభరితంగా ఆవిష్కరించడంలో ముందుంటారు. అదే జానల్లో ‘ఎకో’ అంటూ మరో చిత్రాన్ని వదిలారు. మిస్టరీ థ్రిల్లర్‌గా గతేడాది థియేటర్లకు వచ్చిన ఈ సినిమా.. బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని నమోదు చేసుకున్నది. ఇటీవలే నెట్‌ఫ్లిక్స్ వేదికగా.. తెలుగులోనూ స్ట్రీమింగ్కు వచ్చింది. ఇక్కడా రికార్డ్ వ్యూస్‌తో దూసుకెళ్తున్నది. సినిమా కథ మొదలయ్యే మూడు రాష్ర్టాల సరిహద్దులోని అడవిలోకి అడుగు పెడితే.. కేరళ, తమిళనాడు, కర్ణాటక ప్రాంతాలు కలిసే దట్టమైన అడవీ ప్రాంతమది. అక్కడ కురియాచన్ (సౌరభ్ సచ్ దేవ్)కి 150 ఎకరాల ఎస్టేట్ ఉంటుంది. ప్రకృతి ప్రేమికుడైన కురియాచన్.. తన ఎస్టేట్‌ను ప్రాణానికి ప్రాణంగా చూసుకుంటూ ఉంటాడు. కురియాచన్కు అంతకుముందు మలేసియాలో కొంతకాలంపాటు పనిచేసిన అనుభవం ఉంటుంది. ఆ సమయంలోనే అక్కడి ప్రత్యేక బ్రీడ్ కుక్కల పనితీరుతో ఆకర్షితుడవుతాడు.
దాంతో, ఆ బ్రీడ్ కుక్కలను తన ఎస్టేట్‌లో పెంచుతుంటాడు. తాను లేకుండా ఆ ఎస్టేట్‌లోకి ఎవరినీ అడుగుపెట్టనీయకుండా.. ఆ కుక్కలకు కఠినమైన శిక్షణ ఇస్తాడు. ఒకానొక సమయంలో.. కురియాచన్ అకస్మాత్తుగా అదృశ్యమవుతాడు. ఒక క్రిమినల్ కేసుతో సంబంధం వల్లే అతను కనిపించడం లేదని అందరూ అనుకుంటారు. అలా కొన్నేళ్లు గడుస్తాయి. భర్త కోసం ఎదురుచూస్తూ.. అతని భార్య మిలాతియా (బియానా మోమిన్) ఎస్టేట్‌లోని కొండపై ఒంటరిగా జీవిస్తూ ఉంటుంది. ఆమె బాగోగులు చూసుకోవడానికి పీయూస్ (సందీప్ ప్రదీప్) ఉంటాడు. ఇలా ఉండగా.. కురియాచన్ గురించి తెలుసుకోవడానికి అతని స్నేహితుడైన మోహన్ పోతన్ (వినీత్).. ఆ అడవికి వస్తాడు. అయితే అతను అనూహ్యంగా హత్యకు గురవుతాడు. ఆ తరువాత ఓ నేవీ అధికారి కూడా కురియాచన్ గురించి ఆరా తీయడానికి వస్తాడు. ఈ క్రమంలో.. నేవి అధికారికి ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయి? అసలు కురియాచన్ ఎవరు? ఏమయ్యాడు? అతని కోసం వీళ్లంతా ఎందుకు గాలిస్తున్నారు? వారి అసలు నేపథ్యం ఏమిటి? అన్న ప్రశ్నలకు సమాధానాలు దొరకాలంటే.. ‘ఎకో’ను వీక్షించాల్సిందే!