పరిసరాలలో ఉండే దుమ్ము రేణువులు, వాతావరణ మార్పులు, కాలుష్య ప్రభావం, శరీరంలోని రోగ నిరోధక వ్యవస్థ అతిగా స్పందించడం వల్ల పిల్లలకు అలర్జీ కలుగుతుంది. రోగ నిరోధక వ్యవస్థ స్పందన వల్ల శరీరంలో రసాయనాలు విడుదల అవుతుంటాయి. ఇలాంటి సందర్భాల్లో పిల్లల్లో కొన్ని రోగ లక్షణాలు కనిపిస్తాయి. వీటినే అలర్జీ సింప్టమ్స్ అంటారు. ముక్కు కారడం, తుమ్ములు, చర్మంపై దద్దుర్లు రావడం, దురద, దగ్గు, వాంతులు, విరేచనాలు అలర్జీ లక్షణాలు. అలర్జీ వల్ల ఈ జలుబు, దగ్గు వస్తుందా? వైరస్, బ్యాక్టీరియాల వల్ల వస్తుందా? అనేది అర్థం చేసుకుని వైద్యులను సంప్రదించాలి.
బ్యాక్టీరియా వల్ల వచ్చే జలుబు, దగ్గు కొద్ది రోజులే ఉంటాయి. అలర్జీలో జలుబు, కంటి దురద, కంటి నుంచి, ముక్కు నుంచి నీరు కారడం ఉంటుంది. అదే వైరస్, బ్యాక్టీరియాల వల్ల సమస్య ఉంటే జలుబు, గొంతు సమస్యతోపాటు జాయింట్ పెయిన్స్, జ్వరం, చీముడు గట్టిగా ఉంటుంది. దగ్గు వచ్చినప్పుడు కళ్లె పడుతుంది. ఈ లక్షణాల ఆధారంగా అలర్జీ వల్ల సమస్య ఉందా? బ్యాక్టీరియా, వైరస్ల ప్రభావం వల్ల సమస్య వచ్చిందో అర్థం చేసుకోవచ్చు. వైద్యుల సహాయంతో అలర్జీ పరీక్షలతో నిర్ధారణ చేయించుకోవాలి. పిల్లల్లో అలర్జీ సాధారణమే. దీనికి కారణాలు చాలా ఉన్నాయి. వాతావరణ మార్పులు, కాలుష్యం, జన్యు మార్పులు, జీవన శైలి ముఖ్యమైన కారణాలు. చిన్న వయసులో ఎక్కువగా సూక్ష్మ జీవులకు ఎక్స్పోజ్ అవ్వకపోవడం కూడా కారణమే.
అలర్జీ తీవ్రంగా ఉంటే ఆస్తమా వస్తుంది. ఊపిరి తీసుకునే వాయునాళం పైభాగంలో ఇరిటేషన్ కలిగితే ఆస్తమా వస్తుంది. చెస్ట్ టైట్నెస్ కలుగుతుంది. ఈ స్థితిలో ఊపిరి తీసుకోలేకపోవడం, గొంతు వాపు, రక్త పీడనం తగ్గుతాయి. అనఫలాక్సిస్ అయితే సమస్య తీవ్రంగా ఉంటుంది. అప్పుడు అత్యవసర చికిత్స అవసరం. పిల్లలకు, మరెవరికైనా అలర్జీ ఉంటే జాగ్రత్తలు పాటించాలి. వారానికి ఒకసారి బెడ్ షీట్లను వేడినీళ్లతో ఉతకాలి. పాత పరుపులు మార్చాలి. డబుల్ బెడ్ షీట్ వాడి పరుపు నుంచి వచ్చే దుమ్ము, ధూళి కణాల నుంచి రక్షణ కల్పించాలి. ఇంట్లోని వస్తువులు, గోడలపై దుమ్ము పేరుకుపోకుండా శుభ్రత పాటించాలి. పెంపుడు జంతువులు ఉంటే బెడ్ రూమ్ బయటే ఉంచాలి. పొగ తాగేవాళ్లకు దూరంగా ఉంచాలి. పోషకాహారం ఇవ్వాలి.