తాగుబోతులు యమకింకరులుగా మారుతున్నారు. మత్తులో బండి నడపవద్దని ఎంత చెబుతున్నా..ఎన్ని డ్రంక్ అండ్ డ్రైవ్లు పెడుతున్నా…వారిలో కనువిప్పు కలగడం లేదు. తలకెక్కిన మైకంలో వాహనాలు నడిపి.. అనేక కుటుంబాలను రోడ్డున పడేస్తున్నారు. నగరంలో ఈ మధ్య జరిగిన ప్రమాదాలే ఇందుకు నిదర్శనం. ఓ మందుబాబు నిర్లక్ష్యం..ముగ్గురు చిన్నారులకు అమ్మానాన్నలను శాశ్వతంగా దూరం చేసింది..గండిపేట వద్ద జరిగిన ఈ ఘటనలో రాజు, మౌనిక దంపతులు అక్కడికక్కడే మృతిచెందారు. బంజారాహిల్స్లో మరొకరు చేసిన యాక్సిడెంట్లో ఇద్దరు చిరుద్యోగులు చనిపోయారు. మరోవైపు 2020లో రాష్ట్రవ్యాప్తంగా తాగుబోతుల వల్ల జరిగిన రోడ్డు ప్రమాదాల్లో 343 మంది చనిపోతే.. ఒక్క నగరంలోనే 189 మంది మరణించినట్లు ఎన్సీఆర్బీ గణాంకాలు చెబుతున్నాయి.
ఎన్సీఆర్బీ తాజా గణాంకాల ప్రకారం.. 2020లో రాష్ట్రవ్యాప్తంగా ‘నిషా’చరుల వల్ల 343 మంది మృత్యువాతపడ్డారు. అదే విధంగా మరో 1295 మంది గాయాలపాలయ్యారు. మొత్తం మృతుల్లో 189 మంది నగరంలోనే మృతిచెందినట్టు లెక్కలు చెబుతున్నాయి. ప్రధానంగా హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనరేట్ల పరిధిలోనే ఎక్కువ డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదవుతున్నాయని అధికారులు పేర్కొంటున్నారు.
వాస్తవానికి బ్లడ్ ఆల్కహాల్ కౌంట్(బీఏసీ) 30కి మించితే వాహనాలు నడపడం చట్టరీత్యా నేరం కానీ.. పోలీసులకు చిక్కుతున్న కొందరు మందుబాబుల బీఏసీలు వందల్లోనూ ఉండ టం ఆందోళన కలిగిస్తున్నది. నిబంధనలు అతిక్రమిస్తున్న వారిపై చలాన్లతోపాటు కొన్ని కేసు ల్లో జైలు శిక్ష వేస్తున్నారు. అయినా మారకపోతే లైసెన్స్లు సైతం రద్దు చేయిస్తున్నారు. హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఈ ఏడాదిలో జనవరి నుంచి నవంబర్ వరకు మొత్తం 25మంది మందుబాబుల లైసెన్స్లు రద్దు అయ్యాయి. ఇప్పటికే 206 మంది జైలు శిక్ష సైతం అనుభవించారు.