హిమాయత్‌నగర్,నవంబర్ 23: నగరంలో కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు వ్యాక్సినేషన్ ప్రక్రియ మరింత వేగవంతంగా కొనసాగుతుంది. మంగళవారం జీహెచ్ఎంసీ యంత్రాంగం హిమాయత్‌నగర్ డివిజన్లోని బస్తీలు, కాలనీలలో ఇంటింటికీ తిరిగి సర్వే చేసి దాని ఆధారంగా వచ్చిన వివరాల ప్రకారం టీకాలను వేస్తున్నారు. డివిజన్లోని 44 బస్తీలు,కాలనీల్లో ఇంటింటికీ తిరిగి మొదటి, రెండో డోస్ వేసుకున్న వారి వివరాలతో పాటు ఇప్పటివరకు వ్యాక్సిన్ వేసుకోని వారిని గుర్తించి వ్యాక్సిన్ కేంద్రాలకు పంపిస్తున్నారు.ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులందరూ కొవిడ్ వ్యాక్సిన్స్ తీసుకుంటే ఆ ఇంటికి స్టిక్కర్ అతికిస్తున్నారు. ఇప్పటికే పూర్తైన గాంధీ కుటీర్, ఆదర్శ బస్తీ, విఠల్వాడి, రాజమోహల్లా, వెంకటేశ్వరకాలనీ,ఓల్డ్ కమేలా, లక్ష్మీ కాలనీ, రాంకోఠి, బగ్గీఖాన,ముత్యాలబాగ్ బస్తీలకు ప్రశంసా పత్రాలను అందించారు. డివిజన్లో ఐదు వ్యాక్సినేషన్ కేంద్రాలను ఏర్పాటు చేసి రెండు రోజుల్లో 800 మందికి టీకాలు వేశారు.కరోనా టీకాపై ప్రజల్లో ఉన్న అనుమానాలను నివృత్తిచేసి అవగాహన కల్పించడంతో పాటు ప్రజల సహకారంతో అందరికీ వ్యాక్సినేషన్ పూర్తి చేసేందుకు కృషి చేస్తున్నామని అంబర్‌పేట సర్కిల్-16 డీసీ వేణుగోపాల్, ఏఎంహెచ్‌వో డాక్టర్ జ్యోతి బాయి,జీహెచ్ఎంసీ ఇంజినీరింగ్ విభాగం ఏఈ ఫరీద్ తెలిపారు.ఈ కార్య క్రమంలో ఎస్ఎఫ్ఏలు శ్రీనివాస్, సోమయ్య, సతీష్ చంద్ర,మధు,కామేష్ తదితరులు పాల్గొన్నారు.