బంట్వారం, సెప్టెంబర్ 16 : బంట్వారం ప్రభుత్వ మాడల్ స్కూల్లో తాగునీటి ఎద్దడి ఏర్పడింది. గత రెండు రోజులుగా మిషన్ భగీరథ నీటి సరఫరా నిలిచిపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నా రు. మధ్యాహ్న భోజన సమయంలో చేతులు కడుకునేందుకు, తాగేందుకు నీళ్లు లేకపోవడంతో సమీపంలో ఉన్న హోటళ్లు, రోడ్డుపైకెళ్లి విద్యార్థులు నీటిని తాగుతున్నారు.
మరికొందరు హోటళ్లు, ఇతర ప్రాంతాలకెళ్లి భోజనాలు చేస్తున్నారు. అయితే, సాంకేతిక కారణాలతో నీటి సరఫరాలో అంతరాయం ఉంటుందని.. నాలుగైదు రోజుల వరకు ఏర్పాట్లు చేసుకోవాలని గత వారం రోజుల కిందటే మిషన్ భగీరథ అధికారులు స్థానిక పాఠశాల ప్రిన్సిపాల్‌కు చెప్పినా ఆయన పట్టించుకోకపోవడంపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై ప్రిన్సిపాల్‌ను వివరణ కోరగా.. మంగళవారం నాటికి మిషన్ భగీరథ నీళ్లు వస్తాయని అనుకున్నామన్నారు. పంచాయతీ కార్యదర్శికి చెప్పినా నీటిని సరఫరా చేయలేదన్నారు.