హైదరాబాద్ : దేశ చరిత్రలో బీసీ(BC)లకు నిర్ధిష్టమైన పథకాలు, సంక్షేమ నిధులు కేటాయించిన సీఎం కేసీఆర్ బీసీ బాంధవుడిగా బీసీ కులాల హృదయాల్లో నిలిచిపోతారని రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్(BC Commission Chairman) డాక్టర్ వకుళాభరణం కృష్ణ మోహన్ రావు అన్నారు. తెలంగాణ బీసీ కులాల ఫెడరేషన్ సమితి ఆధ్వర్యంలో సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో మంగళవారం వృత్తికులాల, ఎంబీసీ కులాల ప్రతినిధుల అభినందన ఆత్మీయ సమ్మేళనాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన వకుళాభరణం మాట్లాడుతూ రాష్ట్రాభివృద్ధి పది సంవత్సరాల ముందు, తర్వాత చూడాలని కోరారు. ఉమ్మడి రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాల్లో ఒక్క గంట సేపు విద్యుత్ ఉన్న పరిస్థితులు లేవని, పేర్కొన్నారు. నేడు తాగు, సాగు నీరు, వైద్యం, విద్యవసతులు పెరిగాయని వెల్లడించారు. ప్రైవేట్, కార్పొరేట్‌కు దీటుగా రెసిడెన్షియల్, ప్రభుత్వ పాఠశాలల(Government Schools)ను ప్రభుత్వం తీర్చిదిద్దిందని పేర్కొన్నారు. బీసీలోని వృత్తులన్నింటిని ఆధునీకరించే దిశగా ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదని వెల్లడించారు.
వృత్తులు మాత్రమే చేసుకునే వారికి ఆర్థిక చేయూతనందించేందుకు గొర్రెలు, పించన్లు, రుణాలు అందిస్తున్నదని తెలిపారు. ప్రస్తుతం ప్రభుత్వం వెనుకబడి కులాల సంక్షేమమే లక్ష్యంగా ముందుకు సాగుతుందని అన్నారు. గత పాలకులు చేపట్టిన పథకాలు బడుగుల జీవితాలను మార్చలేకపోయన్నారు. సీఎం కేసీఆర్(CM KCR) ఒక విజన్‌తో శాశ్వత ప్రాతిపదికన వారి జీవన ప్రమాణాలు మెరుగుపర్చే దిశగా పథకాలు ప్రవేశపెట్టి ఆయా వర్గాల జీవితాల్లో వెలుగులు నింపుతున్నారన్నారు.
దేశ చరిత్రలోనే బీసీల సాధికారిత కోసం మొత్తం బడ్జెట్లో 40 శాతం కేటాయించిన ఘనత తెలంగాణ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఫెడరేషన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బెల్లాపు దుర్గారావు, కీర్తి యుగంధర్, రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యులు కె. కిశోర్ గౌడ్, సీహెచ్ ఉపేందర్, తెలంగాణ బీసీ కులాల ఫెడరేషన్ అధికార ప్రతినిధి భాస్కరుడు, జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి, తదితరులు పాల్గొన్నారు.