హైదరాబాద్ సిటీబ్యూరో, మే 23 (నమస్తే తెలంగాణ): శరీరంలోని ప్రధాన అవయవాల్లో కిడ్నీలు ప్రధానమైనవి. వీటి సమస్యలతో బాధపడే వ్యాధిగ్రస్తుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతున్నది. చాలామందికి కిడ్నీలు పనిచేయక మార్చాల్సిన అవసరం ఏర్పడుతున్నది. గతంలో 50 ఏండ్లు దాటిన వారిలో మాత్రమే కనిపించే కిడ్నీ సమస్యలు ఇప్పుడు యుక్తవయస్సులోనే వస్తున్నాయని నిమ్స్ యూరాలజీ విభాగాధిపతి డాక్టర్ రాహుల్ దేవరాజ్ చెప్తున్నారు. కిడ్నీ సమస్యలు రెండు రకాలుగా వస్తుంటాయని తెలిపారు. పుట్టుకతో వచ్చే లోపాల కారణంగా కొందరికి కిడ్నీ సమస్యలు వస్తుండగా, రెండోది వయస్సురీత్యా వచ్చే బీపీ, షుగర్ తదితర కారణాలతో వ్యాధి బారిన పడుతుంటారని వివరించారు. అసలు కిడ్నీ రోగుల సంఖ్య పెరగడానికి కారణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సకాలంలో కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స జరగాలంటే రోగులు పాటించాల్సిన నియమ, నిబంధనలను ‘నమస్తే తెలంగాణ’ ఇంటర్వ్యూలో వెల్లడించారు.
ఈ మధ్యకాలంలో యుక్త వయస్సువారిలోనే ఎక్కువగా కిడ్నీ సమస్యలు వస్తున్నాయి. ఎక్కువగా 40 ఏండ్లలోపు వారికే కిడ్నీ మార్పిడి ఆపరేషన్లు జరుగుతున్నాయి. సాధారణంగా కిడ్నీ సమస్యలు రెండురకాలుగా వస్తాయి. ఒకటి ఆటోఇమ్యూన్ అంటే.. పుట్టుకతో ఉన్న కిడ్నీ సమస్యల కారణంగా వచ్చేది. రెండోది వ యస్సురీత్యా బీపీ, షుగర్ కారణంగా కిడ్నీ సమస్యలు తలెత్తుతాయి. ఈ మధ్య 30 ఏండ్ల వయస్సులోనే బీపీ, షుగర్ వచ్చేస్తున్నాయి. జీవనశైలి, ఆహారపు అలవాట్లు, శారీరక వ్యాయామం లేకపోవడం వంటి కారణాలు కావచ్చు.
ప్రతి సంవత్సరం రాష్ట్రవ్యాప్తంగా సుమారు రెండున్నర వేలమంది రోగులు కొత్తగా డయాలసిస్, కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ కోసం వస్తున్నారు. కిడ్నీ మార్పిడులు ఏటా కేవలం 500 నుంచి 600 మాత్రమే జరుగుతున్నాయి. దీంతో కిడ్నీ మార్పిడి కోసం సంవత్సరాల తరబడి నిరీక్షణ తప్పడం లేదు. రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సల్లో దాదాపు 35శాతం నిమ్స్‌లోనే చేస్తున్నాం. గతం కంటే ఇప్పుడు అవయవదానంపై ప్రజల్లో కొంత అవగాహన పెరిగింది. ఇంకా పెరగాల్సిన అవసరం ఉంది. రోజురోజుకు అవయవాల అవసరం పెరుగుతున్నది. కానీ అందుకు తగ్గట్లు దాతల సంఖ్య పెరగడం లేదు. ఇప్పటికీ చాలామందిలో అవయవదానంపై మూఢనమ్మకాలు ఉంటున్నాయి.
సకాలంలో కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స జరగాలంటే రోగికి సమస్య నిర్ధారణ జరిగి, డయాలసిస్ ప్రారంభించిన వెంటనే జీవన్‌దాన్‌లో రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. అవగాహన లోపమో, లేక సరైన మార్గదర్శకం లేకనో చాలామంది పరిస్థితి తీవ్రమైన తరువాత జీవన్‌దాన్‌లో రిజిస్ట్రేషన్ చేయించుకుంటున్నారు. జీవన్‌దాన్‌లో వాళ్ల సీరియల్ నంబర్ వచ్చేలోపే దురదృష్టవశాత్తు కొందరు మృతిచెందుతున్నారు. ప్రస్తుతం కడావర్ కిడ్నీ కోసం కనీసం 2 నుంచి 3 సంవత్సరాల సమయం పడుతుంది. డయాలసిస్ ప్రారంభమైన వెంటనే జీవన్‌దాన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకుంటే సీరియల్ నంబర్ ప్రకారం సకాలంలో వారికి కిడ్నీ లభించే అవకాశం ఉంటుంది.
ప్రస్తుతం నిమ్స్‌లో ప్రతిరోజు జీవన్‌దాన్‌లో అవయవాల కోసం 5 నుంచి 6 రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. రోగులు జీవన్‌దాన్‌లో దరఖాస్తు ఫారాన్ని తీసుకుని యూరాలజీ, నెఫ్రాలజీ విభాగాల నుంచి సంతకాలు తీసుకోవాలి. అం దులో సంబంధిత వైద్యులు రోగి ఆరోగ్యానికి సంబంధించిన పూర్తి వివరాలు, వైద్య పరీక్షల వివరాలను నమోదు చేసి, జీవన్‌దాన్‌కు సిఫారసు చేస్తారు. అప్పుడు జీవన్‌దాన్‌లో సదరు రోగికి సంబంధించిన రిజిస్ట్రేషన్ పూర్తవుతుంది. రిజిస్ట్రేషన్ పూర్తైన తరువాతనే కిడ్నీకి సంబంధించిన నిరీక్షణ సంఖ్య మొదలవుతుంది.
కిడ్నీ వ్యాధిగ్రస్తులు క్రమం తప్పకుండా డయాలసిస్ చేయించుకోవాలి. రోగి ఆరోగ్యపరిస్థితిని బట్టి వారంలో రెండు నుంచి మూడు సార్లు డయాలసిస్ చేయించుకోవాలి. కొంత మంది రోగులు కొన్ని సార్లు డయాలసిస్‌ను స్కిప్ చేస్తుంటారు. దీనివల్ల మలినాలు పెరిగిపోయి, వారి ఆరోగ్య పరిస్థితి విషమించే ప్రమాదం ఏర్పడుతుంది.
శరీరంలో క్రియాటిన్ స్థాయి 1.5 ఎంజీ/డీఎల్ దాటితో తీవ్రమైన వ్యాధిగా పరిగణిస్తారు. వీరికి అప్పుడే డయాలసిస్ అవసరం ఉండదు. సకాలంలో సరైన మందులతో చికిత్స చేయవచ్చు. వైద్యుల సూచనలు పాటిస్తూ చికిత్స తీసుకుంటే పరిస్థితి డయాలసిస్, ట్రాన్స్‌ప్లాంట్ వరకు వెళ్లకుండా జాగ్రత్తపడవచ్చు.
కిడ్నీ సమస్యల బారిన పడకుండా ఉండాలంటే ఆరోగ్యకర నియమాలు పాటించాలి. ప్రతిరోజు వ్యాయామం చేయాలి. ముఖ్యంగా బీపీ, షుగర్‌ను నియంత్రించుకోవాలి. 30 ఏండ్లు దాటినవారు క్రమం తప్పకుండా బీపీ, షుగర్ పరీక్షలు చేయించుకోవాలి. వేసవిలో సరిపడా నీరు తాగాలి. జిమ్, కఠిన వ్యాయామం చేసే యువత అవగాహన లేకుండా హైప్రొటీన్ తీసుకోవద్దు. అది కిడ్నీలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఆటోఇమ్యూన్, పుట్టుకతో కిడ్నీ సమస్యలున్నవారు నిరంతరం వైద్యులు పర్యవేక్షణలో ఉంటూ సూచనలు కచ్చితంగా పాటించాలి.
సాధారణంగా యుక్తవయస్సులోని రోగులకు కిడ్నీ ఇచ్చేందుకు వారి కుటుంబసభ్యులే ముందుకొస్తుంటారు. దీంతో లైవ్ ట్రాన్స్‌ప్లాంట్స్ చేయగలుగుతున్నాం. గతంలో లైవ్ ట్రాన్స్‌ప్లాంట్స్‌లో డోనర్ నుంచి ఓపెన్ సర్జరీ ద్వారా కిడ్నీ సేకరించేవాళ్లం. దీనివల్ల డోనర్‌కు విపరీతమైన నొప్పి ఉండేది. కోలుకోవడానికి కూడా కొంత సమయం పట్టేది. కానీ గత మూడేండ్ల నుంచి నిమ్స్‌లో కీహోల్ ల్యాపరోస్కోపీ ద్వారా డోనర్ నుంచి కిడ్నీ సేకరిస్తున్నాం. దీనివల్ల దాతకు నొప్పి పెద్దగా ఉండదు. కేవలం రెండుమూడు కుట్లు మాత్రమే వేస్తారు. త్వరగా కోలుకుంటున్నారు. 50-60 ఏండ్లు దాటిన రోగులకు మాత్రం దాదాపు కడావర్(మరణించిన వారి నుంచి సేకరించిన కిడ్నీ) ట్రాన్స్ప్లాంట్నే రెఫర్ చేస్తాం.
నిమ్స్‌లో ఇప్పటివరకు 2,000 కిడ్నీ మార్పిడులు చేశాం. ఇందులో 5 రోబోటిక్ ట్రాన్స్‌ప్లాంట్స్ ఉన్నాయి. ఇవి కాకుండా సంవత్సరానికి 11 వేలకు పైగా స్టోన్స్, ప్రోస్టేట్ సర్జరీ, పీడియాట్రిక్, యూరో ఆంకాలజీ, రీకన్స్ట్రక్టివ్ యూరాలజీ వంటి సాధారణ శస్త్రచికిత్సలు చేస్తున్నాం. కిడ్నీ ట్రాన్స్ప్లాంట్స్కు సమయపాలన అంటూ ఏమీ లేదు. అర్ధరాత్రి కూడా చేస్తుంటాం. చాలా సార్లు అర్ధరాత్రి సమయంలో బ్రెయిన్‌డెడ్ డిక్లేర్ అవుతుంది. అప్పుడు వెంటనే మా టీమ్ అప్రమత్తమై, జీవన్‌దాన్ నుంచి సమాచారం వచ్చిన వెంటనే ట్రాన్స్‌ప్లాంట్‌కు సన్నాహాలు చేస్తాం. నిమ్స్‌లో 90శాతం నిరుపేద రోగులకు ఆరోగ్యశ్రీ, సీఎంఆర్ఎఫ్ ద్వారా పూర్తి ఉచితంగానే కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్స్ చేస్తున్నాం.