డల్లాస్: బీఆర్ఎస్ పార్టీ 25 ఏళ్ల విజయవంతమైన ప్రస్థానాన్ని పురస్కరించుకొని, జూన్ 1, 2025 న అమెరికాలోని డల్లాస్ నగరంలోని డీఆర్ పెప్పర్ ఎరినా వేదికగా బీఆర్ఎస్ రజతోత్సవ వేడుకలు(BRS Dallas Event) ఘనంగా నిర్వహించబోతున్నట్లు బీఆర్ఎస్ గ్లోబల్ ఎన్ఆర్ఐ కోఆర్డినేటర్ శ్రీ మహేష్ బిగాల తెలిపారు.
ఈ సందర్భంగా డల్లాస్ నగరాన్ని సందర్శించిన బీఆర్ఎస్ గ్లోబల్ ఎన్ఆర్ఐ కోఆర్డినేటర్ మహేష్ బిగాల,యూఎస్ఏ అడ్వైజరీ బోర్డు చైర్మన్ శ్రీ తన్నీరు మహేష్, స్థానిక బీఆర్ఎస్ నేతలు, అభిమానులతో సమావేశమై, రాబోయే కార్యక్రమాల DR Pepper ఏరిన సెంటర్ లో ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఈ వేడుకలో ముఖ్య అతిథిగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంటల తారక రామారావు హాజరుకానున్నారని మహేష్ బిగాల తెలిపారు.
డల్లాస్ భేటీ ఓ వేడుకే కాకుండా, తెలంగాణ ఉద్యమ ఆత్మను ప్రపంచానికి వినిపించే గొప్ప వేదికగా మారనుందన్నారు. రజతోత్సవాల్లో భాగంగా తెలంగాణ సాంస్కృతిక కళాపరిషత్ ఆధ్వర్యంలో ఆకట్టుకునే సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఆట పాటలతో కళాకారుల ప్రదర్శనలు జరగనున్నాయి. ఈ మహాసభకు యూఎస్ఏలోని తెలంగాణ , తెలుగు ప్రజలు, బీఆర్ఎస్ మద్దతుదారులు, ఇతర తెలంగాణ సంఘాలు పెద్ద సంఖ్యలో హాజరవుతాయన్నారు. అన్ని సంఘాలు మద్దతు తెలిపాయన్నారు.
బీఆర్ఎస్ యూఎస్ఏ అడ్వైజరీ బోర్డు చైర్మన్ శ్రీ తన్నీరు మహేష్ గారు మాట్లాడుతూ అమెరికాలోని వివిధ రాష్ట్రాల బీఆర్ఎస్ మద్దతుదారులు, అనుబంధ సంఘాలు ఈ కార్యక్రమాన్ని సమన్వయపూర్వకంగా నిర్వహించనున్నట్లు చెప్పారు. బీఆర్ఎస్ వేడుక అమెరికా చరిత్రలో మైలురాయిగా నిలిచే వేడుక అవుతుందని తెలిపారు.
ఎల్కతుర్తిలో జరిగిన బీఆర్ఎస్ రజతోత్సవ సభ తరహాలోనే, డల్లాస్లోని ఈ వేడుక కూడా చరిత్రలో నిలిచిపోయేలా చేయడం లక్ష్యంగా ఏర్పాట్లు జరుగుతున్నాయన్నారు. అమెరికాలోని బీఆర్ఎస్ నాయకులూ, శ్రీనివాస్ శురభి, హరీష్ రెడ్డి, శ్రీనివాస్ సురకంటి మిగితా సభ్యులు కూడా సభా వేదిక పర్యవేక్షణలో పాల్గొన్నారు.