హైదరాబాద్ సిటీబ్యూరో, ఫిబ్రవరి 7 (నమస్తే తెలంగాణ): ఇంగ్లిష్ భాష ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన భాష అని, ఆ భాషతో అన్ని రంగాల్లో రాణించవచ్చని హైదరాబాద్‌లోని ఇంగ్లిష్ అండ్ ఫారిన్ లాంగ్వేజీ యూనివర్సిటీ (ఇఫ్లూ) వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ సురేశ్‌కుమార్ తెలిపారు. ప్రాంతీయ భాషలో చదువుకొన్నవారికంటే ఇంగ్లిష్ మీడియంలో చదువుకొన్నవారే మెరుగైన ఉద్యోగ, ఉపాధి అవకాశాలను పొందారని, ఆ భాషతో ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుందని వెల్లడించారు. అభివృద్ధి చెందిన అమెరికా, జపాన్, ఫ్రాన్స్ వంటి అనేక దేశాలలో ఇంగ్లిష్‌లో బోధనకే ప్రాధాన్యం ఇస్తున్నారని, ఆ దిశగా తెలంగాణ సర్కారు, ముఖ్యమంత్రి కేసీఆర్ చర్యలు చేపట్టడం గొప్ప విషయమని వివరించారు. ఇంగ్లిష్ మీడియంతో కలిగే ప్రయోజనాలపై ‘నమస్తే తెలంగాణ’తో ప్రత్యేకంగా మాట్లాడారు.
ఆ వివరాలు ఆయన మాటల్లోనే.. మాతృభాషను గౌరవిస్తూనే ఇంగ్లిష్ చదువు
ప్రపంచ దేశాలతో పోటీపడాలన్నా, ఐటీ, మార్కెటింగ్, బ్యాంకింగ్, ఫార్మా, ఉత్పాదక వంటి అనేక రంగాల్లో ఉన్నత స్థాయి ఉద్యోగాలు కావాలన్నా ఇంగ్లిష్ కచ్చితం. ఏ దేశమైనా, ఏ రాష్ర్టానికి చెందిన విద్యార్థులు/యువతైనా ఇంగ్లిష్‌లో చదువుకోవడం మంచి నిర్ణయం. ఒక సర్వే ప్రకారం ఇంగ్లిష్ భాషే మాతృభాషగా ఉన్న దేశాలతో పోల్చితే ఇతర దేశాల్లోని ప్రజలే ఇంగ్లిష్‌ను నేర్చుకొని ఎక్కువగా మాట్లాడుతున్నారు. వారే అన్ని రంగాలలో రాణిస్తున్నారు. అయితే, ఇంగ్లిష్ పేరుతో మాతృభాషను విస్మరించవద్దు.
ఏ దేశానికైనా ధీమాగా వెళ్లొచ్చు
ప్రపంచంలోని ఏ దేశానికైనా ధీమాగా వెళ్లే ఆత్మవిశ్వాసం ఇంగ్లిష్‌తోనే వస్తుంది. సమృద్ధిగా పాలన నైపుణ్యాలు మెరుగుపడి, పరిపాలన విభాగాలలో రాణించేందుకు వీలవుతుంది. ఇప్పటికైనా ఇంగ్లిష్ భాషపై పట్టు సాధించేందుకు యువత కృషి చేయాలి. ప్రభుత్వాలు కూడా చేదోడువాదోడుగా నిలవాలి. ఇక, పరిశోధనలు లోతుగా అధ్యయనం చేయడంలో, పూర్తి చేయటంలో ఇంగ్లిష్ పాత్ర ఎనలేనిది. పరిశోధన సాధనాలు, పరిశోధనా పద్ధతులు, అందుకు కావాల్సిన సమీక్ష పుస్తకాలు, గూగుల్ సెర్చ్, వికీపీడియా వంటి వాటిలో తెలుగులో కంటే ఇంగ్లిష్‌లోనే ఎక్కువ సమాచారం దొరుకుతుంది. తెలుగు మీడియం చదివేవారికి అది సాధ్యం కావటం లేదు. దీంతో చాలా పరిశోధనలు మధ్యలోనే నిలిచిపోతున్నాయి. ఇంగ్లిష్ మీడియం చదివినవారు తొందరగా పరిశోధనలు పూర్తి చేసి, పీహెచ్‌డీలు సాధిస్తున్నారు. యూనివర్సిటీలు, ఐఐటీలు, ఎన్ఐటీలు, సెంట్రల్ యూనివర్సిటీల్లో మంచి స్థానాలను కైవసం చేసుకొంటున్నారు.
సీఈవోలంతా ఇంగ్లిష్ మీడియం వారే
మైక్రోసాఫ్ట్, గూగుల్, ట్విట్టర్, అడోబ్ లాంటి ప్రపంచస్థాయి కార్పొరేట్ కంపెనీలకు సత్య నాదెళ్ల, సుందర్ పిచాయ్, పరాగ్ అగర్వాల్, శంతను నారాయణ్ లాంటి భారతీయులు సీఈవోలుగా ఉన్నారంటే విషయ పరిజ్ఞానంతో పాటు ఇంగ్లిష్‌లో గొప్పగా భావవ్యక్తీకరణ వారు కలిగి ఉండటమే. విదేశాలకు వెళ్లాలంటే టోఫెల్, జీఆర్ఈ, ఐఈఎల్టీఎస్, జీమ్యాట్, శాట్ లాంటి పరీక్షలలో ఉత్తీర్ణులు కావాలి. అందుకు ఇంగ్లీష్ నేర్చుకోవాలి. అందుకే ఈ తరం విద్యార్థులు ఇంగ్లిష్ మీడియాన్నే అభ్యసిస్తున్నారు.