
సిటీబ్యూరో, డిసెంబర్ 16 (నమస్తే తెలంగాణ): అసలే ఇరుకు వీధులు. ఆపై అగ్గిపెట్టెల్లాంటి ఇండ్లు. వానకు తడుస్తూ ఎండ వేడిని భరిస్తూనే ఆ ఇండ్లల్లో..పేదలైన నిత్యశ్రామికులు తమ దైనందిన జీవితాలను కొనసాగిస్తూ ఉంటారు. బంధువులో స్నేహితులో ఇంటికి వస్తే ఎంత ఆనందమో..వారిని ఆ రోజంతా ఇంట్లో బస చేయించడం కూడా చాలా భారంగా మారే పరిస్థితి. అటువంటి కష్టాలన్నింటికీ చరమగీతం పాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేస్తున్న పేదలకు డబుల్ బెడ్రూం ఇండ్ల పథకం అప్రతిహతంగా కొనసాగుతూనే ఉన్నది.
నిరుపేదలందరూ ఆత్మగౌరవంతో బతకాలన్న సంకల్పంతో నగరవ్యాప్తంగా 111 ప్రాంతాల్లో చేపట్టిన లక్ష డబుల్ బెడ్రూం ఇండ్లను జీహెచ్ఎంసీ విడతల వారీగా లబ్ధిదారులకు అందిస్తున్నది. ఇందులో భాగంగానే సనత్‌నగర్ నియోజకవర్గంలోని బన్సీలాల్‌పేట సీసీ నగర్లో రూ.20.64 కోట్లతో చేపట్టిన 264 డబుల్ బెడ్ రూం ఇండ్లను మంత్రులు వేముల ప్రశాంత్‌రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్‌లతో కలిసి మంత్రి కేటీఆర్ శుక్రవారం ప్రారంభించనున్నారు.
లబ్ధిదారులకు ఇండ్ల పట్టాలను అందజేయనున్నారు. అగ్గిపెట్టెల్లాంటి ఇండ్ల స్థానంలోనే కండ్లు చెదిరే రీతిలో అందమైన ఈ ఫ్లాట్ల నిర్మాణం జరిగి చూపరులను ఆకట్టుకుంటున్నాయి. పూలమొక్కల వరుసలు, చుట్టూ ఫెన్సింగ్, ఎల్ఈడీ వంటి ప్రత్యేకతలతో ఆ ఇండ్లు కాలనీకే అందాలు తెస్తున్నాయి.
పేద ప్రజలు ఎంతో గొప్పగా బతకాలనేదే సీఎం కేసీఆర్ లక్ష్యం. నిరుపేదలకు లక్ష డబుల్ బెడ్రూంలు అందించడమే లక్ష్యంగా ఈ పథకం చేపట్టాం. బన్సీలాల్‌పేట్ డివిజన్లో ఇప్పటికే ఐడీహెచ్ కాలనీలో 396, జీవై రెడ్డి కాలనీలో 180, పీఎస్ నగర్లో 162, జీకే కాలనీలో 12 ఇండ్లు నిర్మాణం పూర్తయ్యాయి. వాటిని లబ్ధిదారులకు కూడా అందించాం. ప్రస్తుతం బండమైసమ్మ నగర్లో 310 ఇండ్లు సిద్ధమయ్యాయి. చాచానెహ్రూనగర్‌లో గురువారం 264 ఇండ్లను అందించనున్నారు. లబ్ధిదారులపై ఒక్క పైసా భారం పడకుండా పూర్తిగా ప్రభుత్వమే వెచ్చించి ఇండ్లు కట్టిస్తున్నందుకు సీఎంకు కృతజ్ఞతలు తెలుపుతున్నాం. – మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్
కాయకష్టం చేసుకుని బతికే వారికి నిలయం చాచా నెహ్రూ నగర్. కాస్తంత స్థలంలో రేకులతో ఇరుకైన గదులు వేసుకొని వారంతా జీవితాలను వెళ్లదీసేవారు. వాన పడితే ఇండ్లలోకి నీరు చేరేది. డ్రైనేజీ లీకైతే పైపులైను పొంగి ఇండ్లలోకి మురుగు నీరొచ్చేది. ఎండాకాలంలో రేకుల వేడికి తట్టుకోలేకపోయేవారు. ఏదైనా పెద్ద వాహనం వచ్చిపోయేందుకు దారి కూడా ఉండేది కాదు. మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ వారి బాధలను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. మంత్రి కేటీఆర్ ఆదేశాలకు అనుగుణంగా ఆ ఇండ్ల స్థానంలో ఆత్మగౌరవ భవనాలను నిర్మించి ఇవ్వాలని నిర్ణయంచారు. మొత్తం 18 బ్లాకుల్లో 264 ఇండ్లను సిద్ధం చేశారు.