
పీర్జాదిగూడ, జనవరి 1: తెలంగాణ రాష్ట్రంలో నిరుపేదలు ఆత్మగౌరవంతో బతకాలని సీఎం కేసీఆర్ గూడులేని పేదలకు పైసా ఖర్చు లేకుండా డబుల్ బెడ్రూం ఇండ్లు నిర్మించి ఇస్తున్నారు. దేశంలో మరెక్కడా లేని విధంగా సకల వసతులతో రెండు పడకల గృహాలను కట్టిస్తూ పేదల జీవితాల్లో సీఎం కేసీఆర్ వెలుగులు నింపుతున్నారు. తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి రాగానే నిరుపేదలకు డబుల్ బెడ్రూం ఇండ్లు నిర్మించి ఇవ్వాలనే యోచనతో ప్రతిష్టాత్మక నిర్ణయం తీసుకున్నారు. అందులో భాగంగానే పీర్జాదిగూడ పరిధిలో పలు ప్రాంతాల్లో చేపట్టిన డబుల్‌బెడ్ రూం ఇండ్ల నిర్మాణాలు దాదాపు పూర్తయ్యాయి. త్వరలో పేదలకు ఇండ్లు అందించేందుకు అధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. దీంతో పేదలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
202 డబుల్ ఇండ్ల నిర్మాణాలు పూర్తి..
పీర్జాదిగూడ నగరపాలక సంస్థలో పర్వతాపూర్, పీర్జాదిగూడ ప్రాంతాల్లో ఇండ్ల నిర్మాణాలు పూర్తయ్యాయి. ఇప్పటి వరకు నగరపాలక సంస్థ నరిధిలో 387 మంది లబ్ధిదారులను గుర్తించామని రెవెన్యూ అధికారులు తెలిపారు. వీటిలో డ్రా సిస్టమ్ ఎంపిక జరుగుతుందన్నారు. త్వరలో లబ్ధిదారులను గుర్తించి వారికి ఇండ్లు అందజేసేలా అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే పీర్జాదిగూడ కార్పొరేషన్ పరిధిలో 202 ఇండ్ల నిర్మాణాలు పూర్తయ్యాయి. పర్వతాపూర్‌లోని సర్వే నంబర్ 10/1 లో రెండెకరాల స్థలంలో నిర్మించిన ఇండ్లు….మేడిపల్లి, పర్వతాపూర్ ప్రాంతాలకు చెందిన వారికి గ్రౌండ్ ఫ్లోర్లో 48 కాగా జీ+1, జీ +2లో 4బ్ల్లాక్లలో 80 ఇండ్లు కట్టించారు. పీర్జాదిగూడ సర్వే నంబర్ 199లో రెండెకరాల స్థలంలో సకల వసతులతో 74 డబుల్ బెడ్రూం ఇండ్లు కట్టించారు. దాదాపు తుదిదశకు చేరుకున్నాయి. ఇందులో విద్యుత్ సరఫరా పనులతోపాటు సుందరీకరణ పూర్తి చేసుకుని త్వరలోనే లబ్ధిదారులకు అందజేయనున్నారు.
పేదల జీవితాల్లో వెలుగులు..
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణం దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయి.సీఎం కేసీఆర్ సంక్షేమ పథకాలను అమలు చేసి పేదల జీవితాల్లో వెలుగులు నింపుతున్నారు. డబుల్ బెడ్రూం ఇండ్లు 100 శాతం పూర్తయ్యాయి. లబ్ధిదారులకు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నాం.పేదల సంక్షేమానికి అహర్నిశలు శ్రమిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఈ ప్రాంతాల ప్రజలు రుణపడి ఉంటారు.
-జక్క వెంకట్‌రెడ్డి, మేయర్ , పీర్జాదిగూడ నగరపాలక సంస్థ