పత్తి ధర పరుగులు పెడుతున్నది. రికార్డుస్థాయిలో రేట్లు నమోదవుతున్నాయి. చరిత్రలో లేని విధంగా ధరలు పలుకుతున్నాయి. ఆదిలాబాద్ పత్తికి అధిక డిమాండ్ ఉన్నది. నల్లరేగడి నేలలు అధికంగా ఉండడం, వాతావరణం అనుకూలించడం, అధిక వర్షపాతం నమోదవడం, పత్తి నాణ్యమైనదిగా ఉండడం, గింజ గట్టిగా, పొడువుగా ఉండడం.. దూది తెల్లగా ఉండి, దారం కూడా బాగుండడంతో విదేశాల్లో కూడా మంచి డిమాండ్ ఉంది. ఈ యేడాది ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా 10.02 లక్షల ఎకరాల్లో పత్తి సాగవగా.. కొనుగోళ్లు చివరి దశకు చేరుకున్నాయి. కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) మద్దతు ధర క్వింటాలుకు రూ.6,025 కాగా.. భైంసా మార్కెట్లో ప్రైవేట్ వ్యాపారులు రూ.10,800 పెట్టి కొనుగోలు చేస్తున్నారు. ప్రధానంగా సాగు విస్తీర్ణం తగ్గడం, అంతర్జాతీయంగా బేళ్లకు అధిక ధర పలుకడంతో వ్యాపారులు పోటీ పడి కొనుగోలు చేస్తున్నారు.
ఆదిలాబాద్, మార్చి 28(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా ఉన్న నేలలు పత్తి పంటకు అనుకూలంగా ఉంటాయి. నల్లరేగడి నేలలు అధికంగా ఉండడం, అధికంగా నీటిని నిల్వ చేసుకునే గుణం కలిగి ఉండడం వల్ల పంట ఎదుగుదలకు దోహదపడుతాయి. వానకాలంలో సగ టు వర్షపాతం 1,200 మిల్లీమీటర్లు కాగా.. నల్లరేగడి నేలలకు కొన్ని రోజులు వానలు కురియక పోయిన ప్రమాదం ఉండదు. వానలు సమృద్ధిగా ఉంటే పంట కూడా ఏపుగా పెరుగుతుంది. ఈ యేడాది ఉమ్మడి ఆదిలాబాద్ జి ల్లావ్యాప్తంగా 10.02 లక్షల ఎకరాల్లో పత్తి సా గవగా.. ఆదిలాబాద్లో 3.85 లక్షలు, నిర్మల్లో 1.60 లక్షలు, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో 2.95 లక్షలు, మంచిర్యాల జిల్లాలో 1.60 లక్షల ఎకరాల్లో పత్తి సాగైంది.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా గతేడాది వానకాలంలో సాగు చేసిన పత్తి విక్రయాలు అక్టోబర్ చివరి వారంలో ప్రారంభమయ్యా యి. ప్రభుత్వం క్వింటాలుకు రూ.6,025 మద్దతు ధర ప్రకటించింది. అంతర్జాతీయ మార్కెట్లో పత్తి బేళ్ల ధర ఎక్కువగా ఉండడంతో ప్రైవేట్ వ్యాపారులు సీజన్ ప్రారంభం నుంచి అధిక ధర చెల్లించి కొనుగోలు చేస్తున్నా రు. క్వింటాలుకు రూ.7 వేల నుంచి ప్రారంభమైన ధరలు క్రమంగా పెరుగుతూ వచ్చాయి. మహారాష్ట్రకు చెందిన వ్యాపారులు జిల్లాలోని గ్రామాలకు వచ్చి రైతుల నుంచి పంటను ఎక్కువ ధరలకు కొనుగోలు చేశారు. ధరలు క్రమంగా పెరుగగా ప్రస్తుతం భైంసా మార్కెట్ యార్డులో క్వింటాలుకు రూ.10,800 పలుకుతున్నది. గతంలో ఎన్నడూ లేని విధంగా పం టకు ధర రావడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
వరితో పోల్చితే పత్తి పంట లాభదాయకంగా ఉంటుంది. సాగు కూడా సులభదాయకం. వరికి ఎప్పుడూ నీటి సౌకర్యం ఉండాలి. పత్తి పంటకు 20 రోజుల వరకు వర్షం పడకపోయినా ఇబ్బందులు ఉండవు. వర్షాధారంపై పంట పండుతుంది. పత్తి సాగు చేసే రైతులకు బ్యాంకుల్లో స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ కింద ఎకరాకు రూ.36 వేల వరకు రుణం లభిస్తున్నది. పత్తిలో అంతర పంటలు వేసుకోవచ్చు. ఫలితంగా మిత్ర పురుగుల సంఖ్య పెరగడమే కా కుండా వాతావరణ ఒడిదొడుగుల నుంచి రక్షణ కలుగుతుంది. అంతర్జాతీయ మార్కెట్లో యేటా పత్తి బేళ్ల ధరలు పెరుగుతుండడంతో పంటకు ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది. ప్రైవేట్ వ్యాపారులు సైతం పోటీ పడి కొనుగోలు చేస్తారు.
నాకు ఊహ తెలిసినప్పటి నుంచి పత్తి ధరలు ఇంతగానం ఎన్నడూ పెరగలేదు. మాకు తరతరాలుగా వస్తున్న 20 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. ఇందులో పదెకరాలు పత్తి వేసినం. ఈ సారి క్వింటాలుకు రూ.9500 సొప్పున అమ్మిన ఇగ, భైంసా మార్కెట్లో రూ.10800 పలకడంతో ధైర్యం వచ్చింది. ఇగముందు పత్తే ఏస్త. సర్కారు చెప్పినట్టుగానే అవసరమైన వాణి జ్య, ఆహార దినుసులు పండిస్తా
– పెండెపు కృష్ణయాదవ్, రైతు, అందర్బంద్, భీంపూర్