చర్లపల్లి, జనవరి 4 : మాదకద్రవ్యాల వాడకం విడనాడి సమాజ అభివృద్ధికి యువత నడుంబిగించాలని కుషాయిగూడ ఎస్సై వేణు మాధవ్ పేర్కొన్నారు. ఏఎస్‌రావునగర్ డివిజన్, కమలానగర్లో నీలం రాజశేఖర్‌రెడ్డి భవనంలో ఏఐవైఎఫ్ 16వ జాతీయ మహాసభలను పురస్కరించుకొని మేడ్చల్ జిల్లా ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో ‘మాదక ద్రవ్యాల నిర్మూలన-యువతపై ప్రభావం’ అనే అంశంపై సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన ఎస్ఐ మాట్లాడుతూ.. నేటి సమాజంలో యువత చెడు వ్యసనాలకు బానిసై తమ జీవితాలను నాశనం చేసుకుంటుందని, సామాజిక అంశాలపై యువత, విద్యార్థులకు అవగాహన కల్పించాలని సూచించారు. గంజాయి, కొకైన్ వంటి నిషేధిత డ్రగ్స్‌కు యువత ఆకర్షితులవుతున్నారని, అవగాహన సదస్సుల ద్వార వారిని చైతన్యపరచాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. కార్యక్రమంలో మేడ్చల్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు సత్యప్రసాద్, ధర్మేంద్ర, జిల్లా నాయకులు నవీన్, నాగరాజు, రాకేశ్, నదీమ్, కృతి, సుప్రీయ, నళిని, సుభద్ర, రమ్య, విద్యార్థులు పాల్గొన్నారు.