ముంబై, మే 15: దేశీయ స్టాక్ మార్కెట్లు మళ్లీ నష్టాల్లోకి జారుకున్నాయి. అంతకుముందు రెండు రోజులు లాభాల్లో ముగిసిన సూచీలు.. శుక్రవారం నిరాశపర్చాయి. తీవ్ర ఊగిసలాటల నడుమ బీఎస్ఈ ప్రధాన సూచీ సెన్సెక్స్ 160.73 పాయింట్లు లేదా 0.21 శాతం క్షీణించి 75,237.99 వద్ద స్థిరపడింది. ఒకానొక దశలో దాదాపు 470 పాయింట్లు పుంజుకున్నా నిలబడలేకపోయింది.
ఎన్ఎస్ఈ సూచీ నిఫ్టీ 46.10 పాయింట్లు లేదా 0.19 శాతం కోల్పోయి 23,643.50 వద్ద నిలిచింది. పెట్రోల్, డీజిల్, సీఎన్జీ రేట్లు పెరుగడంతో మదుపర్లను ద్రవ్యోల్బణం భయాలు వెంటాడాయి. మరోవైపు డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ మరింత నష్టపోయి తొలిసారి 96 మార్కును దాటేయడం కూడా మార్కెట్ సెంటిమెంట్‌ను బలహీనపర్చింది. ఈ క్రమంలోనే ఆయిల్, గ్యాస్, మెటల్, ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ షేర్లు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. అమెరికా-ఇరాన్ వార్తో గల్ఫ్ దేశాల్లో ముడి చమురు, సహజ వాయువు ఉత్పత్తికి తీవ్ర ఆటంకం ఏర్పడింది. డిమాండ్‌కు తగ్గ సరఫరా లేక గ్లోబల్ మార్కెట్లో ముడి చమురు ధరలు విజృంభిస్తున్నాయి. దీంతో మదుపర్లు పెట్టుబడులకు దూరంగా ఉంటున్నారని తాజా మార్కెట్ సరళిని నిపుణులు విశ్లేషిస్తున్నారు.
మెటల్ షేర్లు అత్యధికంగా 1.98 శాతం నష్టాలను చూశాయి. రియల్టీ (1.82 శాతం), ప్రభుత్వ బ్యాంకులు (1.80 శాతం), చమురు-గ్యాస్ (1.79 శాతం), కమోడిటీస్ (1.31 శాతం), ఎనర్జీ (1.13 శాతం), క్యాపిటల్ గూడ్స్ (1 శాతం) షేర్లూ చతికిలపడ్డాయి. టాటా స్టీల్, ఎస్బీఐ, ఎటర్నల్, రిలయన్స్ ఇండస్ట్రీస్, అల్ట్రాటెక్ సిమెంట్, మహీంద్రా అండ్ మహీంద్రా, భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, ఎల్అండ్టీ, ట్రెంట్, యాక్సిస్ బ్యాంక్, ఏషియన్ పెయింట్స్ షేర్ల విలువ భారీగా పతనమైంది. బీఎస్ఈ మిడ్‌క్యాప్ సూచీ 0.78 శాతం, స్మాల్‌క్యాప్ సూచీ 0.06 శాతం పడిపోయాయి. బీఎస్ఈ నమోదిత సంస్థల మార్కెట్ విలువ రూ.4,60, 59,270.46 కోట్లకు పరిమితమైంది.