హుస్నాబాద్, సెప్టెంబర్ 5: ప్రభుత్వ వైద్యుడిగా పనిచేస్తున్న కొడుకు అనారోగ్యంతో బాధపడుతున్న తనను రోడ్డుపై వదిలేసి వెళ్లాడని సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌కు చెందిన సన్నీల్ల వెంకన్న శుక్రవారం హుస్నాబాద్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. తన భార్య, కొడుకు తనను కొంత కాలంగా వేధింపులకు గురిచేస్తున్నారని, అనారోగ్యంతో ఉన్న తనను పట్టించుకోకుండా కరీంనగర్ బస్టాండ్‌లో వదిలి వెళ్లారని, తనకు న్యాయం చేయాలని పోలీసులను ఆశ్రయించాడు.
ఆస్తులు అమ్మి కొడుకు, కూతురిని డాక్టర్లను చేశానని, అనారోగ్యం పాలైన తనను వాళ్లెవరూ పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశా డు. తన కొడుకు కరీంనగర్ జిల్లా చిగురుమామిడి ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో ప్రభుత్వ వైద్యుడిగా పనిచేస్తున్నాడని తెలిపాడు. తనకు వైద్యం అందించకుండా కరీంనగర్ సర్కారు దవాఖానలో వేసి వెళ్లారని, ఇదేమిటని ప్రశ్నిస్తే దవాఖాన నుంచి డిశ్చార్జి చేసి కరీంనగర్ బస్టాండ్‌లో వదిలేసి వెళ్లారని వాపోయాడు. బంధువుల సాయంతో హుస్నాబాద్‌కు చేరుకున్నానని తెలిపాడు. భార్య, పిల్లలు మానసికంగా, శారీరకంగా వేధిస్తున్నారని, వారి నుంచి రక్షణ కల్పించి ఆదుకోవాలని వేడుకున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.