మాంసాహారులు ‘లివర్’ను ఇష్టంగా తింటుంటారు. చికెన్, మటన్ కొనేటప్పుడు అడిగి మరీ వేయించుకుంటారు. మరి, అంత ఇష్టంగా తినే ‘లివర్’తో శరీరానికి ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో తెలుసా?
చికెన్, మటన్ లివర్‌లో అద్భుతమైన పోషక విలువలు ఉంటాయి. ఇవి శరీరానికి ఎంతో మేలుచేస్తాయి. రక్తహీనతను నివారించడంతోపాటు మెదడు ఆరోగ్యానికి భరోసా ఇస్తాయి. రోగ నిరోధక శక్తిని పెంచడంలో సాయపడతాయి. అయితే, అధికంగా తీసుకుంటే.. ఆరోగ్య సమస్యలూ తెచ్చి పెడతాయి.
మటన్ లివర్ : విటమిన్ ఎ, డి, బి 12, ఐరన్, జింక్, పొటాషియం, రాగి వంటి పోషకాలతో మటన్ లివర్ నిండి ఉంటుంది. ఇందులోని ఖనిజాలు.. శరీరంలో వివిధ ఎంజైమ్‌ల పనితీరును మెరుగుపరుస్తాయి. మటన్ లివర్‌ను తగినంతగా తీసుకుంటే.. రక్తహీనత దూరమవుతుంది. శరీరంలో ఆక్సిజన్ సరఫరా మెరుగుపడుతుంది. ఇందులోని విటమిన్ బి12.. రోగ నిరోధక శక్తిని పెంచుతుంది.
చికెన్ లివర్ : ఇందులో ప్రొటీన్, ఐరన్, సెలీనియం, విటమిన్ బి12, ఫోలేట్, విటమిన్ ఎ అధికంగా ఉంటాయి. చికెన్ లివర్‌లోని విటమిన్ బి12.. మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించడంలో.. సెలీనియం సహాయపడుతుంది. రక్తంలో చెక్కర స్థాయులను నియంత్రించడంలోనూ ముందుంటుంది. చికెన్ లివర్.. డయాబెటిస్ రోగులకు ప్రయోజనం కలిగిస్తుంది. చికెన్ లివర్‌లో కొవ్వుశాతం తక్కువగా ఉంటుంది. దీన్ని ఉడికించి తింటే.. బరువు నియంత్రణలో ఉంటుంది.
ఇన్ని ప్రయోజనాలు అందించే లివర్‌ను.. మాంసంతో కలిపి తీసుకుంటేనే మంచిది. అలాకాకుండా.. కేవలం లివర్‌ను మాత్రమే అధికంగా తీసుకుంటే.. ఆరోగ్యానికి కీడు చేస్తుంది. కొలెస్ట్రాల్ స్థాయులతోపాటు గుండె జబ్బుల ముప్పు పెంచుతుంది. ముఖ్యంగా.. ఫ్యాటీ లివర్ సమస్యతో బాధపడేవారు లివర్‌కు దూరం ఉండటమే మంచిది. అలాగే, కిడ్నీ వ్యాధిగ్రస్తులు కూడా డాక్టర్ సలహా మేరకే తీసుకోవాలి. అంతేకాకుండా.. లివర్‌ను డీప్ ఫ్రై చేయడం కూడా మంచిదికాదు. మాంసంతోపాటు కూరగాయలతో కలిపి ఉడికించి తినాలి. అదికూడా వారానికి ఒకటి లేదా రెండుసార్లు మాత్రమే!