హైదరాబాద్, నవంబర్ 5 (నమస్తే తెలంగాణ): ఉద్యోగ పదవీ విరమణ వయస్సును 58 నుంచి 61 ఏండ్లకు పొడిగిస్తూ రాష్ట్ర ప్రభు త్వం జారీచేసిన ఉత్తర్వులను ఏ తేదీ నుంచి వర్తింపజేయాలనే అంశంపై తాము జోక్యం చేసుకోలేమని హైకోర్టు స్పష్టం చేసింది. రిటైర్మెంట్ పొడగింపు ఉత్తర్వులను ఈ ఏడాది మార్చి 30 నుంచి వర్తింపజేయడాన్ని సవాలు చేస్తూ పలువురు రిటైర్డ్ ఉద్యోగులు దాఖలు చేసిన 31 రిట్ పిటిషన్లను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీశ్‌చంద్రశర్మ, జస్టిస్ ఏ రాజశేఖర్‌రెడ్డితో కూడిన ధర్మాసనం కొట్టివేసింది. ముఖ్యమంత్రి ఇచ్చే హామీలు, గణతంత్ర వేడుకల్లో గవర్నర్ ప్రసంగంలో పేరొనే అంశాలు చట్టాలు కాబోవని స్పష్టం చేస్తూ, తీర్పు వెలువరించింది. గవర్నర్, ముఖ్యమంత్రి, పాలకపక్షాలు ఇచ్చే హామీలపై ఉత్తర్వులు జారీ చేయలేమని స్పష్టంచేసింది. ఉద్యోగుల పదవీ విరమణ వయసు పెంపుదలపై టీఆర్ఎస్ 2018 ఎన్నికల్లో హామీ ఇచ్చిందని, ఈ ఏడాది రిపబ్లిక్ డే ప్రసంగంలో గవర్నర్ ప్రస్తావించారని, పీఆర్సీ నివేదికను 2020 డిసెంబర్ 31 ప్రభుత్వానికి సమర్పించిందని కాబట్టి పదవీ విరమణ అమలుకు ఆయా తేదీలను ప్రామాణికంగా తీసుకోవాలని కోరుతూ పలువురు పిటిషనర్లు వ్యాజ్యాలు దాఖలుచేశారు. వీటిపై తీర్పు వెలువరించిన ధర్మాసనం ఆయా వాదనలను తోసిపుచ్చింది. పాలకపక్ష పెద్దల హామీలు చట్టాలు కాబోవని, చట్టాల రూపకల్పనకు శాసనసభలు ఉన్నాయని గుర్తుచేసింది. ఉద్యోగ పదవీ విరమణ అంశంపై చట్టసభలోనే చట్ట సవరణ చేశారని, ఏ తేదీ నుంచి దానిని అమలు చేయాలనే అంశంలో జోక్యం చేసుకోబోమని తేల్చి చెప్పింది. గవర్నర్, ముఖ్యమంత్రి, పాలకపక్ష నేతలు ఇచ్చే హామీలకు చట్టబద్ధత లేదని తెలిపింది. అమలు తేదీ విషయంలో పలువురిలో అసంతృప్తి ఉండవచ్చునని, అయితే చట్టబద్ధంగా అభ్యంతరాలు లేవని స్పష్టంచేసింది. పిటిషనర్లు ఉటంకించిన సుప్రీంకోర్టు తీర్పులు ఈ కేసుకు వర్తించవని చెప్పింది.