బయ్యారం, మార్చి 13: ఆమె పేదింట్లో పుట్టిన చదువుల తల్లి. చిన్నతనం నుంచే చదువులో రాణించేది. ఎంబీబీఎస్ చదివి పేదలకు సేవ చేయాలనే లక్ష్యం నిర్దేశించుకొని పట్టుదలతో చదివి నీట్లో మంచి ర్యాంక్ సాధించింది. కన్వీనర్ కోటాలో సీటు దక్కించుకున్నప్పటికీ ఫీజు కట్టేందుకు స్థోమత లేక ఆపన్నహస్తం కోసం ఎదురుచూస్తున్నది. మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం సంత్రాలపోడుకు చెందిన డోలి ధర్మయ్య-సుమలత దంపతులకు ఇద్దరు కూతుర్లు ప్రవళిక, పావని ఉన్నారు. నిరుపేద కుటుంబానికి చెందిన ధర్మయ్య సుతారి పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. వీరి కూతురు పావని చిన్నప్పటి నుంచే చదువులో ముందుండేది. పదోతరగతి వరకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చదివిన పావని.. ఇంటర్మీడియట్ రంగారెడ్డి జిల్లా గౌలిదొడ్డిలోని సోషల్ వెల్ఫేర్ వసతి గృహంలో చదివి 98 శాతంతో ఉత్తీర్ణత సాధించింది. చిన్ననాటి నుంచే వైద్య విద్య అభ్యసించాలన్న ఆకాంక్షతో ఉన్న పావని నీట్ పరీక్ష రాసింది. ఫలితాల్లో 446 మార్కులతో రాష్ట్రంలో జనరల్ కేటగిరీలో 3,822, ఎస్సీ కేటగిరీలో 321వ ర్యాంక్ సాధించింది. కౌన్సెలింగ్లో కరీంనగర్లోని ప్రతిమ మెడికల్ కళాశాలలో సీట్ సాధించింది. ట్యూషన్ ఫీజు, హాస్టల్, లైబ్రరీ, ఇతర ఖర్చులకు ఏడాదికి రూ.3 లక్షల ఖర్చు అవుతున్నది. నిరుపేద కుటుంబం కావడంతో అంత ఫీజు చెల్లించలేని స్థితిలో తల్లిదండ్రులు తల్లడిల్లుతున్నారు. ఈ నెల 16 వరకు రూ.2 లక్షలు చెల్లించాలని కళాశాల యాజమాన్యం సూచించడంతో ఆందోళన చెందుతున్నారు. దాతలు ఆదుకోవాలని కోరుతున్నారు. సాయం చేయాలనుకొనేవారు అకౌంట్ నంబర్ 40788634454, ఐఎఫ్ఎస్సీ కోడ్ SBIN0020554, ఎస్బీఐ గంధంపల్లి శాఖలో జమ చేయాలని వేడుకొన్నారు. వివరాలకు 6305527850 నంబర్లో సంప్రదించాలని వారు విజ్ఞప్తిచేశారు.