Star Anise | భారతీయ వంటకాల్లో సుగంధ ద్రవ్యాలకు ఎంతో ప్రాధాన్యత ఉంది. వీటిని అనేక రకాల వంటకాల్లో మనం విరివిగా ఉపయోగిస్తూ ఉంటాం. మనం వంటల్లో వాడే ఈ సుగంధ ద్రవ్యాలన్నీ కూడా మన ఆరోగ్యానికి మేలు చేసేవే. మనం వాడే సుగంద ద్రవ్యాల్లో అనాస పువ్వు కూడా ఒకటి. ఇది చూడడానికి స్టార్ ఆకారంలో చూడగానే ఆకట్టుకునే విధంగా ఉంటుంది. వంటల్లో దీనిని వేయడం వల్ల వాటి వాసనతో పాటు రుచి కూడా పెరుగుతుంది. వంటల్లో వాడడంతో పాటు ఈ అనాస పువ్వు నీటిని తీసుకోవడం వల్ల కూడా మన ఆరోగ్యానికి మేలు కలుగుతుంది. ముఖ్యంగా చలికాలంలో ఈ నీటిని తీసుకోవడం వల్ల మనం అధిక ప్రయోజనాలను పొందవచ్చు. శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచడంలో, బరువు తగ్గడంలో, జీర్ణక్రియను మెరుగుపరచడంలో ఇలా అనేక రకాలుగా అనాస పువ్వు నీరు మనకు సహాయపడుతుంది.
అనాస పువ్వు నీటిని తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాల గురించి, అలాగే ఈ నీటిని ఎలా తయారు చేసుకోవాలి.. అన్న వివరాలను వైద్యులు వివరిస్తున్నారు. అనాస పువ్వు నీటిని తీసుకోవడం వల్ల మన శరీర బరువు అదుపులో ఉంటుంది. వీటిలో ఉండే పాలీఫినాల్స్, టెర్పెనాయిడ్లు శరీర జీవక్రియలను మెరుగుపరచడంలో సహాయపడతాయి. తద్వారా శరీర బరువు నియంత్రణలో ఉంటుంది. అనాస పువ్వులో అనెథోల్ అనే రసాయన సమ్మేళనం ఉంటుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. అనాస పువ్వులతో నీటిని తయారు చేసి తీసుకోవడం వల్ల గ్యాస్, ఉబ్బరం వంటి జీర్ణ సంబంధిత సమస్యలు కూడా తగ్గుతాయి. ఈ పువ్వులలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. వీటితో నీటిని తయారు చేసి తీసుకోవడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ముఖ్యంగా చలికాలంలో ఇన్పెక్షన్ లు ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఇటువంటి సమయంలో ఈ నీరు మనకు ఎంతో ఉపయోగపడుతుంది.
ఈ నీటిని తరచూ తీసుకోవడం వల్ల జలుబు, దగ్గు, ఫ్లూ వంటి ఇన్పెక్షన్ లు తగ్గుతాయి. అంతేకాకుండా ఈ నీటిని తీసుకోవడం వల్ల చర్మానికి మేలు కలుగుతుంది. వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీరాడికల్స్ వల్ల కలిగే నష్టం నుండి చర్మాన్ని కాపాడుతాయి. కనుక ఈ నీటిని తాగడం వల్ల చర్మం పొడిబారడం, మొటిమలు వంటి సమస్యలు తగ్గుతాయి. అనాస పువ్వు శోథ నిరోధక లక్షణాలను కలిగి ఉంటుంది. వీటితో చేసిన నీటిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల శరీరంలో మంట, వాపు వంటి సమస్యలు తగ్గుతాయి. ఇలా అనేక విధాలుగా అనాస పువ్వు నీరు మనకు మేలు చేస్తుంది. ఇక ఈ నీటిని తయారు చేసుకోవడం కూడా చాలా సులభం.
ఒక గిన్నెలో రెండు కప్పుల నీటిని తీసుకుని అందులో 3 లేదా 4 అనాస పువ్వులను వేసి నీరు రంగు మారే వరకు బాగా మరిగించాలి. తరువాత ఈ నీటిని వడకట్టి అందులో రుచి కోసం తేనె లేదా నిమ్మరసం కలిపి తీసుకోవచ్చు. ఈ విధంగా అనాస పువ్వు నీటిని తీసుకోవడం వల్ల మనం అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు.