Jaya Krishna | సూపర్ స్టార్ కృష్ణ కుటుంబం నుంచి మరో తరం సినీ రంగంలోకి అడుగుపెడుతోంది. మహేష్ బాబు అన్నయ్య రమేష్ బాబు కుమారుడు జయకృష్ణ హీరోగా ఎంట్రీ ఇవ్వనున్న సంగతి తెలిసిందే. దర్శకుడు అజయ్ భూపతి దర్శకత్వంలో శ్రీనివాస మంగాపురం అనే చిత్రంతో జయకృష్ణ తన సినీ ప్రయాణాన్ని ప్రారంభిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉండగా, ఇటీవల విడుదలైన జయకృష్ణ ఫస్ట్ లుక్ ప్రేక్షకులు, అభిమానుల్లో ఆసక్తిని పెంచింది. ఇప్పటివరకు సినిమాపై ఎక్కువగా మాట్లాడని జయకృష్ణ, తాజాగా తొలిసారి పబ్లిక్ వేదికపై భావోద్వేగంగా మాట్లాడాడు. విజయవాడలో జరిగిన సూపర్ స్టార్ కృష్ణ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి జయకృష్ణ హాజరయ్యాడు. ఈ సందర్భంగా మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
వేదికపై జయకృష్ణ మాట్లాడుతూ… “నేను చేసే ప్రతి పనిలోనూ కృష్ణ గారు నా పక్కనే ఉండి నన్ను నడిపిస్తున్నట్టే అనిపిస్తుంది. చిన్నప్పటి నుంచే ఆయన దగ్గర చాలా విషయాలు నేర్చుకున్నాను. నా జీవిత లక్ష్యం ఒక్కటే… ఆయన గర్వపడేలా జీవించడం” అని చెప్పాడు. ఇంకా సినిమాల్లోకి అధికారికంగా అడుగుపెట్టకముందే అభిమానుల నుంచి వస్తున్న ప్రేమ, ప్రోత్సాహం తనకు ఎంతో బలాన్ని ఇస్తోందని వెల్లడించాడు. ఈ సందర్భంగా తన బాబాయ్ మహేష్ బాబు గురించి ప్రత్యేకంగా ప్రస్తావించాడు. “మహేష్ బాబు గారు నాకు ఎప్పుడూ మార్గదర్శకుడిలా ఉంటారు. నేను ఆయనకు పెద్ద అభిమానిని. చిన్నప్పటి నుంచి ఆయన సినిమాలు చూస్తూ పెరిగాను. నా మొదటి సినిమా ఫస్ట్ లుక్ను ఆయనే రిలీజ్ చేయడం నాకు చాలా గర్వంగా ఉంది. థ్యాంక్యూ బాబాయ్” అంటూ కృతజ్ఞతలు తెలిపాడు. అలాగే, తనపై నమ్మకం పెట్టుకున్న అభిమానులందరినీ గర్వపడేలా చేస్తానని హామీ ఇచ్చాడు.
సినిమా విడుదలకు ముందే జయకృష్ణ ఇచ్చిన ఈ తొలి ప్రసంగం, ఘట్టమనేని కుటుంబ వారసుడిగా ఆయన చూపిస్తున్న వినయం, ఆత్మవిశ్వాసాన్ని తెలియజేస్తోంది. శ్రీనివాస మంగాపురంతో జయకృష్ణ ఎలాంటి నటుడిగా నిలుస్తాడో చూడాలని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు