హైదరాబాద్, జనవరి 12 (నమస్తే తెలంగాణ): సరైన అనుమతులు లేకుండా ప్రాజెక్టులు నిర్మించి, ఇప్పుడు నీటిని వాడుకోనివ్వాలంటూ కేసులు వేయడం ఏమిటని కర్ణాటక రాష్ర్టాన్ని తెలంగాణ నిలదీసింది. బ్రిజేష్కుమార్ ట్రిబ్యునల్ అవార్డును పాక్షికంగా అమలు చేసేందుకు ఆస్కారమే లేదని తేల్చిచెప్పింది. అవార్డులోని అంశాలను ఆధారాలతో సహా కూలంకషంగా సుప్రీంకోర్టుకు వివరించింది. కృష్ణా వాటర్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్-2 (కేడబ్ల్యూడీటీ) ప్రకటించిన అవార్డును పాక్షికంగా అమలు చేసేలా గెజిట్ నోటిఫికేషన్ జారీకి ఉత్తర్వులు జారీ చేయాలని కోరుతూ కర్ణాటక సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై రెండోరోజు గురువారం జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ రామసుబ్రహ్మణ్యం బెంచ్ విచారణ చేపట్టింది. తెలంగాణ తరపున సీనియర్ న్యాయవాది వైద్యనాథన్ వాదనలు వినిపించారు.
అప్పర్ కృష్ణా ప్రాజెక్టు (యూకేపీ)లో కేడబ్ల్యూడీటీ 2 తమకు కేటాయించిన 130 టీఎంసీల అదనపు జలాలు వినియోగించుకొనేందుకు ఇప్పటికే రూ.13,321 కోట్లు వెచ్చించామని, పాక్షికంగానైనా అవార్డును అమలు చేయాలన్న కర్ణాటక వాదనలను తప్పుబట్టారు. అన్ని అనుమతులు తీసుకొన్న తర్వాతే ప్రాజెక్టులు నిర్మించాలని 1997లో ఏపీ వర్సెస్ కర్ణాటక కేసులో సుప్రీం స్పష్టమైన ఆదేశాలను కర్ణాటకకు జారీ చేసిందని, కేడబ్ల్యూడీటీ 2 కూడా తన అవార్డులో ఇదే విషయాన్ని స్పష్టం చేసిందని గుర్తుచేశారు. అయినప్పటికీ కేడబ్ల్యూడీటీ-2 2011లో అవార్డు ప్రకటించగానే అనుమతులు తీసుకోకుండా, సుప్రీంకోర్టు ఉత్తర్వులను తుంగలో తొక్కి కర్ణాటక ప్రాజెక్టు పనులు చేపట్టిందని వివరించారు. అవార్డుపై 2011లో సుప్రీంకోర్టు స్టే విధించగా, ఆ విషయాన్ని దాచిపెట్టి ప్రాజెక్టుకు పర్యావరణ ఇతరత్రా అనుమతులు పొందిందని తప్పుబట్టారు.
పాక్షికంగా అమలుకు ఆస్కారమే లేదు
కర్ణాటక కోరినట్టు అవార్డును పాక్షికంగా అమలు చేసేందుకు ఆస్కారమే లేదని సుప్రీంకోర్టుకు తెలంగాణ ప్రభుత్వం తేల్చిచెప్పింది. ఉమ్మడి ఏపీకి మొత్తంగా 811 టీఎంసీలు కేటాయించిందని, ఇందులో 442 టీఎంసీలను కర్ణాటక విడుదల చేయాల్సి ఉన్నదని, మిగిలిన 369 టీఎంసీలు పరీవాహాక ప్రాంతం నుంచి జనరేట్ అయ్యేవని తెలిపింది. ఉమ్మడి ఏపీ పరీవాహక ప్రాంతంలో కేటాయించిన జలాలు ఉత్పన్నం కాకపోతే ఆ మేరకు నీటిని కర్ణాటక విడుదల చేయాల్సి ఉన్నదని వివరించింది. అవార్డును పాక్షికంగా అమలు చేస్తే ఎగువన కర్ణాటక నీటిని వినియోగించుకోవడం వల్ల దిగువన కొరత ఏర్పడే అవకాశముందని వాదించింది. మొత్తంగా అవార్డుపై దాఖలైన పిటిషన్లను విచారించాలని సుప్రీం ధర్మాసనానికి విజ్ఞప్తి చేసింది. ఇప్పటికే దిగువకు వరద జలాలు తప్ప సాధారణ ప్రవాహాలు రావడం లేదని గుర్తుచేసింది. తెలంగాణ వాదనలపై సుప్రీంకోర్టు ధర్మాసనం సంతృప్తి వ్యక్తం చేసింది. రాష్ర్టాలన్నీ కోరితే అవార్డుపై దాఖలైన పూర్తి పిటిషన్ను విచారించే విషయం ఆలోచిస్తామని సుముఖత వ్యక్తం చేసింది.