
హైదరాబాద్, అక్టోబర్ 29 (నమస్తే తెలంగాణ): పర్యాటక రంగానికి పరిశ్రమ హోదా కల్పించాలనే పెండింగ్ ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా పరిశీలించాలని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతికశాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ కోరారు. రాష్ట్రంలో 11వ శతాబ్దపు కాకతీయుల నృత్యం పేరిణికి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు ‘పేరిణి కళాక్షేత్రం’ ఏర్పాటుచేయాలని విజ్ఞప్తి చేశారు. బెంగళూరులో జరుగుతున్న దక్షిణాది రాష్ర్టాల పర్యాటక, సాంస్కృతికశాఖ మంత్రుల సమావేశంలో రెండోరోజు శుక్రవారం శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ.. హైదరాబాద్‌లో సైన్స్ మ్యూజియం ఏర్పాటుకు తమవంతుగా పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. దేశంలోని పర్యాటక ప్రదేశాల విశిష్టత, ప్రాముఖ్యతలను వివరిస్తూ అన్ని భాషల్లో డిజిటల్ యాప్‌ను రూపొందించాలని కేంద్రాన్ని కోరారు. టూరిస్ట్ గైడ్లకు నైపుణ్యాభివృద్ధిపై శిక్షణ ఇచ్చి గుర్తింపు కార్డులు జారీచేయాలని, గౌరవ వేతనాన్ని ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. దక్షిణ తెలంగాణలోని మన్యంకొండ లక్ష్మీ వేంకటేశ్వరస్వామి దేవాలయ అభివృద్ధికి రూ.50 కోట్ల కేటాయింపు ప్రతిపాదనలను పరిశీలించాలని కోరారు. దీనిపై సానుకూలంగా స్పందించిన కేంద్ర పర్యాటకశాఖ ఉన్నతాధికారులు.. త్వరలోనే కేంద్ర బృందం ఆలయాన్ని సందర్శించి తగిన ప్రణాళికలు రూపొందిస్తుందని చెప్పారు.