వెలుగుల పండుగంటే ఇల్లంతా కాంతులు విరజిమ్మాల్సిందే. వాకిట్లో దీపాల (Diwali ) వరుసలు అలంకరించి బాణాసంచా కాల్చే రోజుల నుంచి ఇంటి లోపలా దివ్వెల ముస్తాబు చేసే దిశగా మార్పులు వచ్చాయి. దానికి తగ్గట్టుగా ప్రస్తుతం దొరుకుతున్న అలంకరణలు వాకిళ్లను నట్టింట్లోకి తెస్తున్నాయి. చూసేందుకు దర్వాజాలు, మంటపాలను పోలిన ఈ రంగుల వాకిళ్లు గోడలకు దీపావళి కాంతుల్ని అద్దుతున్నాయి.
Diwali | మామూలప్పుడు దేవుడి గూడుకే పరిమితమైన దీపపు చెమ్మె దీపావళి (Diwali) వేళ గడపదాటి బయటికి వస్తుంది. ఇంటినే కోవెల చేస్తూ వెలుగుల సంతకం పెడుతుంది. ఈ ఉత్తర్వు మరో నెల పాటు కొనసాగుతుంది. నరకుడు హతమైన ఆ మూడు రోజులూ మాత్రం ప్రతి ఇల్లూ విజయకాంతి పుంజంలా ధగధగలాడుతుంది. తరాల నుంచీ ఇదే తంతు కొనసాగుతున్నా ఎప్పటికప్పుడు పండుగను ప్రత్యేకంగా మలచుకోవడం మనకలవాటు. అందుకే దివ్వెల అలంకరణలో కొత్త కొత్త ప్రయోగాలు చేస్తుంటాం. వెరైటీలు ప్రయత్నిస్తుంటాం. దీపావళి సందర్భంగా ఇంటినీ దీపకాంతులతో నింపేందుకు మనవైన ప్రయత్నాలు కొనసాగిస్తుంటాం. ఆ ఆలోచనలను అందంగా ప్రదర్శించేందుకే దీవాళీ వాల్ డెకరేటివ్లు దొరుకుతున్నాయి. వీటిలో ఝరోఖా (రాజస్థానీ తరహా కిటికీ)లను పోలి వస్తున్న వాటితోపాటు ‘దీప ద్వారం’, ‘దీప మండపం’ లాంటివి ఆన్లైన్లో సందడి చేస్తున్నాయి.
ఇంట్లో దీపాలు అలంకరించాలంటే ప్రధానంగా గోడకే పెట్టుకుంటాం. అయితే మేకులు కొట్టడం, ఫ్రేములు అమర్చడం అన్నది శ్రమతో కూడుకున్న పని. ఇది గోడలకు కూడా ఇబ్బందే. అందుకే ఈ దీపద్వారాలు సులభంగా అతికించుకునేలాగా వస్తున్నాయి. కార్డ్‌బోర్డ్‌తో చేసిన వీటిని ప్యాకెట్లో వచ్చే గమ్ సాయంతో గోడకు అతికించవచ్చు. అదే సెట్లో ఎల్ఈడీ దివ్వెలూ ఉంటాయి. కాబట్టి ద్వారాన్ని చేసి గోడకు అతికించి, ఈ దీపాన్ని అందులో పెట్టుకోవడమే. కాస్త డిజైన్ తేడాతో దీపమంటపాలూ ఇలాగే దొరుకుతున్నాయి. గూళ్లలా ఉండే వీటి డిజైన్లు, రంగులు, వాటి మీద ఉండే బొమ్మలను మనం ఎంచుకోవచ్చు, లేదా నచ్చినవి తెప్పించుకోవచ్చు. నిండైన రంగుల్లో కనిపిస్తూ ఇంటికి రాజసాన్ని తెచ్చిపెట్టే వీటిలో ఎల్ఈడీ దివ్వెలు ఉండటం వల్ల అవి మలిగిపోయే సమస్య ఉండదు. కావలసినంత సేపూ వీటిని హాయిగా వెలిగించే ఉంచుకోవచ్చు. లేదూ నిజమైన దివ్వెలే పెట్టుకోవాలి అనుకుంటే ఇలాగే ఆర్చ్‌ల తరహాలో ఇత్తడి, చెక్క, మట్టితో చేసినవీ దొరుకుతున్నాయి. ఇవి కూడా ఇంటి అందాన్ని రెట్టింపు చేసేవే. ఇంకేం మీ లోగిలిలో ఏ వాకిళ్లు అందంగా ఉంటాయో ఎంచుకోవడమే తరువాయి… ఏమంటారు?!