వాజేడు/ ఏటూరునాగారం, జూలై 21 : ములుగు జిల్లా వాజేడు మండలంలోని ఇసుకవాగు, ఏటూరునాగారం మండలం దొడ్ల వాగుపై నిర్మించిన తాత్కాలిక రోడ్డు వరద ఉధృతికి తెగిపోయింది. జగన్నాథపురం నుంచి చెరుకురు గ్రామం వరకు 11 కిలోమీటర్లు జాతీయ రహదారి నాలుగు లేన్ల రోడ్డు విస్తరణ పనులు చేపడుతున్నారు. ఈ క్రమంలో కాంట్రాక్టర్ చీకుపల్లి గ్రామ శివారులోని ఇసుక వాగు పాత బ్రిడ్జిని కూల్చి నూతన బ్రిడ్జి నిర్మాణాన్ని ఏడు నెలల క్రితం ప్రారంభించారు. హైదరాబాద్ టు భూపాలపట్నం వెళ్లే 163 జాతీయ రహదారి మార్గంలో తాత్కాలిక రోడ్డు నిర్మించారు.
కాగా, సోమవారం రాత్రి కురిసిన వర్షానికి మంగళవారం ఉదయం వరద పోటెత్తి తాత్కాలికంగా ఏర్పాటు చేసిన రోడ్డు కొట్టుకుపోయింది. దీంతో మండలకేంద్రం నుంచి చెరుకురు, పెద్దగొల్లగూడెం, టేకులగూడెం వైపు ఉన్న 26 గ్రామలతోపాటు ఛత్తీస్‌గఢ్ రాష్ర్టానికి రాకపోకలు నిలిచిపోయాయి. ఎస్సై జక్కుల సతీశ్ పోలీస్ సిబ్బందితో చేరుకొని భద్రతా ఏర్పాట్లు చేశారు. ఏటూరునాగారం ఏఎస్పీ మనన్‌భట్ డైవర్షన్ రోడ్డును సందర్శించారు. రాకపోకలకు తాత్కాలికంగా రోడ్డు నిర్మాణ పనులు చేపట్టాలని రహదారి నిర్మాణ సంస్థ సూపర్వైజర్ నవీన్‌తో పాటు సైట్ ఇన్చార్జికి సూచించారు. ఎంపీడీవో కృపాకర్, తహసీల్దార్ శ్రీనివాస్, ఆర్ఐ కుమారస్వామితో పాటు చర్ల (వెంకటాపురం నూగూరు) మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పూనెం రాంబాబు సంఘటనా ప్రదేశాన్ని పరిశీలించి నిర్మాణదారులతో మాట్లాడారు.
దీంతో సిమెంట్ తూములు వేసి ప్రజలు నడిచివెళ్లేలా తాత్కాలిక రహదారిని రాత్రిలోగా పూర్తిచేశారు. వాహనాలు వెళ్లేందుకు వీలులేకపోవడంతో ఛత్తీస్‌గఢ్ రాష్ర్టంతో పాటు మండలంలోని ఇతర గ్రామాలకు వెళ్లే వాహనదారులు తీవ్రమైన ఇబ్బందులు పడ్డారు. సూదూర ప్రాంతాలకు వెళ్లే వారు జాతీయ రహదారిపై వాహనాలు నిలిపి ఉంచారు. ఏటూరునాగారం మండలంలో కురిసన భారీ వర్షాలకు దొడ్ల సమీపంలోని జంపన్న వాగుకు వరద పోటెత్తింది. దీంతో వాగుపై నిర్మించిన తాత్కాలిక మట్టి రోడ్డు రెండు రోజుల క్రితం కొద్దిగా కొట్టుకుపోగా సోమవారం నుంచి కురిసన వర్షానికి మంగళవారం మధ్యాహ్నం వాగుకు వరద తీవత్ర పెరగడంతో తాత్కాలిక రోడ్డు పూర్తిగా కొట్టుకుపోయింది. దీంతో పూర్తి స్థాయిలో రాకపోకలు నిలిచిపోయాయి. అదేవిధంగా బానాజీబంధం-ఎలిశెట్టిపల్లి మధ్యలోని జంపన్నవాగు కూడా ఉధృతంగా ప్రవహిస్తుంది. దీంతో ఇక్కడ కూడా రాకపోకలు నిలిచిపోయాయి.