Disha Patani | అందం, అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకున్నా ఆశించినంత ఫలితం అందుకోలేకపోతున్న భామ దిశా పటానీ. ఉత్తరాదితోపాటు దక్షిణాదినా వరుస అవకాశాలు వస్తున్నప్పటికీ.. స్టార్డమ్ సొంతం చేసుకోలేకపోతున్నది. ‘లోఫర్’ సినిమాతో టాలీవుడ్‌కి పరిచయమైన దిశ ‘ధోని ది అన్‌టోల్డ్ స్టోరీ’తో మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది. బాలీవుడ్లో హీరోయిన్గా రాణిస్తున్న దిశ మళ్లీ దక్షిణాదిపై దృష్టిపెట్టింది. ఇటీవల ‘ప్రాజెక్ట్ K’లో కెమియో రోల్లో పలకరించిన దిశ ‘కంగువా’లో పూర్తి నిడివిగల పాత్రతో ప్రేక్షకులను పలకరించనుంది. తనను ఆదరిస్తున్న అభిమానులే తన సర్వస్వం అంటూ దిశ పంచుకున్న కబుర్లు..
హిస్టారికల్, పీరియాడిక్ డ్రామాల్లో నటించాలని ఉంది. అలాంటి పాత్రల్లో నన్ను నేను చూసుకోవాలనుకుంటున్నా. ప్రస్తుతం ఒక రొమాంటిక్ మూవీ చేస్తున్నా. నటిగా ఎప్పటికప్పుడు భిన్నమైన పాత్రలను పోషించాలనుకుంటున్నా. అందుకే కథల ఎంపికలో జాగ్రత్తలు తీసుకుంటున్నా.
నా అభిమానులే నాకు సర్వస్వం. వారి ప్రేమ, మద్దతు వల్ల నేను ఈ స్థాయిలో ఉన్నాను. అందుకే తరచుగా సోషల్ మీడియా వేదికగా వారిని పలకరిస్తాను. నా సినిమాలకు సంబంధించిన విషయాలను పంచుకుంటాను. నేను నటించిన పాత్రలపై వారి స్పందన ఎలా ఉందనే విషయాన్ని గమనిస్తాను.
నేను చేసిన ప్రతి సినిమా నుంచి చాలా విషయాలు నేర్చుకున్నా. ప్రతి అవకాశాన్ని వినియోగించుకున్నా. పాత్రకు అనుగుణంగా నన్ను నేను మలుచుకోవడం నటిగా ఎదిగేందుకు చాలా దోహదపడింది. నా తొలి సినిమాకి ఇప్పటికీ నా నటనలో వచ్చిన మార్పు, వ్యక్తిగా నేను ఎదిగిన తీరును తలుచుకుంటే గర్వంగా ఉంటుంది.
చిన్నప్పటినుంచీ నటి అవ్వాలని అనుకోలేదుగానీ నటన అంటే ఆసక్తి ఉండేది. పెరిగేకొద్దీ సినిమా గురించి తెలిశాక నటననే కెరీర్‌గా ఎంచుకున్నా. నా మొదటి సినిమా రోజులు ఎప్పటికీ మరిచిపోలేనివి. కథలు చెప్పడం, భిన్నమైన పాత్రలను పోషించి ప్రేక్షకులకు వినోదం కలిగించడం నటిగా నాకు సంతృప్తి కలిగించే అంశాలు.
యాక్షన్ సినిమాలు చూడటం, అలాంటి పాత్రల్లో నటించడం చాలా ఇష్టం. అందుకు శారీరకంగా ఎంతో శ్రమించాల్సి ఉంటుంది. అందుకు నా శరీరాన్ని ఎప్పుడూ సిద్ధంగా ఉంచుకుంటా. ఫిట్‌నెస్‌పై ఎక్కువ దృష్టిపెడతా. ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచిన ఫైట్ మాస్టర్లతో పనిచేయాలని ఉంది. యాక్షన్ పాత్రల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నా.
నాకు పెంపుడు జంతువులంటే చాలా ఇష్టం. ఖాళీ సమయాల్లో వాటికే పూర్తి సమయాన్ని వెచ్చిస్తా. డాన్స్, వ్యాయామం నా దినచర్యలో తప్పకుండా ఉండే అంశాలు. వ్యాయామం శారీరకంగానే కాదు, మానసికంగానూ ఆరోగ్యాన్ని అందిస్తుంది.
వంట చేయడం, మొక్కల పెంపకం నా హాబీలు. ప్రియాంక చోప్రా అంకితభావం, అంతర్జాతీయ వేదికపై ఆమె రాణిస్తున్న తీరు ఎంతో స్ఫూర్తిదాయకం. దర్శకుల్లో సంజయ్ లీలా భన్సాలీ టేకింగ్ ఇష్టం. ఆయన సినిమాల్లోని ప్రతి పాత్ర చాలా శక్తిమంతంగా ఉంటుంది.