తెలంగాణలో మంచి నీటి చేపల చెరువులే ఆధారం. అయితే, మంచి నీళ్లలో పెరిగే చేపలకు వివిధ రకాల వ్యాధులు సోకే అవకాశం ఉన్నది. ఆ వ్యాధి లక్షణాలు, నివారణ పద్ధతులు తెలుసుకొంటే, చేపల సాగులో ఉత్తమ ఫలితాలు పొందవచ్చు.
చేప పేను వ్యాధి (ఆర్గులోసిస్) :
తెలుపు రంగులో బల్లపరుపుగా ఉండే ఆర్గులస్ అనే పరాన్నజీవి చేప శరీరంపై చేరి రక్తాన్ని పీల్చుతుంది. ముందుగా సున్నితమైన ప్రదేశాలైన రెక్కల కుదుళ్లపైకి చేరి, క్రమంగా మిగతా శరీర భాగాలకు విస్తరిస్తుంది.
ఈ వ్యాధి నివారణ కోసం ఎకరం చేపల చెరువులో 100 మి.లీ. డెల్టా మెత్రిన్ (1.75%) వాడుకోవాలి లేదా అర కిలో పసుపు, 21 కిలోల సున్నం, 18.5 కిలోల రాళ్ల ఉప్పుతో మిశ్రమాన్ని తయారుచేసి, చెరువులో చల్లుకోవాలి. అయినప్పటికీ చేప పేను తీవ్రత తగ్గకుంటే ఇదే మిశ్రమాన్ని 14వ రోజున చల్లుకోవాలి.
రెడ్ డిసీజ్ (హేమరేజిక్ సెప్టిసీమియా)
ఏరొమోనాస్ హైడ్రోఫిలా అనే బ్యాక్టీరియా వల్ల చేపల్లో రెడ్ డిసీజ్ వస్తుంది. ఈ బ్యాక్టీరియా చేప రక్తంతోపాటు ఇతర అవయవాల్లోకి చేరుతుంది. ఫలితంగా చేపల్లో గుండె, కాలేయం, మూత్రపిండాలు ఉబ్బిపోతాయి. రక్తనాళాలు చిట్లి చేప శరీరంలో రక్తపు చారలు, రక్తపు గడ్డలు కనిపిస్తాయి. కాలేయం పసుపు రంగులోకి మారుతుంది. వ్యాధి వల్ల చేప ఆహారం తీసుకోక బలహీనపడుతుంది. చివరికి చనిపోతుంది.
నివారణ కోసం ఎకరం చేపల చెరువులో 100 గ్రా. ఎనోరోప్లాక్సిన్ లేదా ఆక్సీటెట్రాసైక్లిన్ లాంటి యాంటీబయోటిక్స్ చల్లుకోవాలి.