న్యూఢిల్లీ, నవంబర్ 26: కర్ణాటకలో ముఖ్యమంత్రి సీటుపై హైడ్రామా కొనసాగుతున్నది. తాజా పరిణామాలను పరిశీలిస్తే ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తన పదవి నుంచి వైదొలగడం ఖాయమని జోరుగా ప్రచారం జరుగుతున్నది. ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్‌ను నియమించే అవకాశం ఉందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. డిసెంబర్ 1న ప్రారంభమయ్యే పార్లమెంట్ సమావేశాలకు ముందే ముఖ్యమంత్రి మార్పుపై కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాగా, తనతో మాట్లాడేందుకు గడిచిన వారం రోజులుగా ప్రయత్నిస్తున్న ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌కు రాహుల్ గాంధీ నుంచి జవాబు వచ్చింది. ప్లీజ్ వెయిట్.. నేను మీకు కాల్ చేస్తా అంటూ రాహుల్ గాంధీ నుంచి డీకేకు వాట్సాప్ మెసేజ్ వచ్చినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.
రాష్ట్ర నాయకత్వంలో మార్పులు జరగవచ్చని ఊహాగానాలు సాగుతున్న వేళ డీకేకు రాహుల్ నుంచి ఈ మెసేజ్ రావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. నవంబర్ 29న ఢిల్లీ వెళ్లేందుకు డీకే సన్నద్ధమవుతున్నారు. సోనియా గాంధీని కలుసుకునేందుకు అపాయింట్మెంట్ కోరిన డీకే అదే రోజు బెంగళూరుకు తిరిగి వస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. కాగా, ఢిల్లీకి వచ్చిన కర్ణాటక కాంగ్రెస్ నాయకులు ప్రియాంక్ ఖర్గే, బచ్చేగౌడతో రాహుల్ గాంధీ భేటీ అయినట్లు తెలుస్తోంది. ఓట్ చోరీ, సర్ ప్రక్రియ, కర్ణాటకలో రాజకీయ పరిస్థితుల గురించి వారితో రాహుల్ చర్చించినట్లు తెలిసింది. కర్ణాటక టెక్ సదస్సులో రాహుల్ ఆవిష్కరించవలసి ఉన్న కేఈవో ఏఐ పీసీ పరికరం గురించి కూడా వారు చర్చించారు. దాదాపు పావుగంటపాటు వారు ఓట్ చోరీ, తదితర అంశాల గురించి మాట్లాడారు. అయితే తర్వాత ప్రియాంక్ ఖర్గేతో విడిగా దాదాపు 20 నిమిషాల సేపు రాహుల్ సమావేశమయ్యారు.
సిద్ధూపై రాహుల్ అసహనం
కర్ణాటకలో అధికార మార్పిడి, క్యాబినెట్లో మార్పుల గురించి ప్రియాంక్ ఖర్గేతో రాహుల్ సవివరంగా చర్చించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నాయకులు ఇటీవల చేసిన బహిరంగ వ్యాఖ్యలు కూడా వారి మధ్య చర్చకు వచ్చినట్లు తెలిసింది. అధికార పంపకం ఒప్పందం ఏదీ లేదని బహిరంగంగా ఖండించడంతోపాటు పూర్తిగా ఐదేళ్ల పదవీకాలం తానే కొనసాగుతానని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య చేసిన వ్యాఖ్యలపై రాహుల్ గాంధీ అసహనం వ్యక్తం చేసినట్లు సంబంధిత వర్గాలు చెప్పాయి. అధికార పంపకం ఒప్పందాన్ని బహిరంగంగా తిరస్కరించాల్సిన అవసరం లేదని, త్వరలోనే వారిద్దరితో తాను మాట్లాడుతానని ప్రియాంక్ ఖర్గేకు రాహుల్ చెప్పినట్లు తెలిసింది. కాగా, ఢిల్లీలోని తాజా పరిణామాలు సిద్ధరామయ్యకు ఎదురుదెబ్బగా పార్టీలో చర్చ జరుగుతోంది. రాహుల్ ప్రవేశంతో డీకేకు అనుకూలంగా పరిస్థితి మారుతున్నట్లు పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. కాగా, పార్టీ సీనియర్ నాయకులు సోనియా గాంధీ, రాహుల్ గాంధీతో చర్చించిన తర్వాతే కర్ణాటక నాయకత్వ మార్పుపై నిర్ణయం ఉంటుందని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే బుధవారం ఢిల్లీలో విలేకరులకు తెలిపారు.