హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 11(నమస్తే తెలంగాణ): సుప్రీంకోర్టు న్యాయవాది మీద హైడ్రా కమిషనర్ రంగనాథ్ పగ తీర్చుకున్నారంటూ సోషల్‌మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతున్నది. అమీన్పూర్ మండలం ఐలాపూర్‌లో చేపట్టిన కూల్చివేతల్లో భాగంగా ముఖీం అనే న్యాయవాదికి చెందిన నిర్మాణాలను హైడ్రా నేలమట్టం చేసింది. ము ఖీం ఈ స్థలాన్ని ఆక్రమించుకున్నారని ఆరోపిస్తూ హైడ్రా ఒక ప్రకటన విడుదల చేసింది.
ఈ నేపథ్యంలో గతంలో సుప్రీంకోర్టు తీర్పును ఉల్లంఘించారంటూ రంగనాథ్‌ను ముఖీం నిలదీశారని, దీంతో నిబంధనలకు వ్యతిరేకంగా ఉన్నాయంటూ ముఖీంకు చెందిన నిర్మాణాలను కూల్చివేశారని స్థానికులు చర్చించుకుంటున్నారు. ముఖీం తండ్రి నిజాం పాలకుల దగ్గర దివాన్‌గా ఉన్న ఓ వ్యక్తి దగ్గర పనిచేసేవాడని, ఆయనతో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం ముఖీం తండ్రికి 19 ఎకరాలు సమకూరిందని స్థానికులు చెప్తున్నారని హైడ్రా జారీ చేసిన ప్రకటనలో పేర్కొన్నారు.
అయితే, ముఖీం ఈ 19 ఎకరాలతోపాటు మరో 21 ఎకరాల మేర కబ్జా చేసి ఫామ్‌హౌస్ నిర్మించినట్టు అక్కడ లేఔట్ యజమానులు చెప్తున్నారని హైడ్రా తెలిపింది. ఈ నేపథ్యంలో హైడ్రా చేపట్టిన కూల్చివేతల తర్వాత ముఖీంను లక్ష్యంగా చేసుకుని విడుదల చేసిన ప్రకటనలు, ఆయననే టార్గెట్‌గా చేసుకొని కమిషనర్ చేసిన వ్యాఖ్యలతో ఇది పూర్తిగా కక్షసాధింపు చర్యగా ఉన్నదని స్థానికులు చర్చించుకుంటున్నారు.
మాకు ఎలాంటి సమాచారం లేకుండానే ఉదయమే మా ఇంటికి వచ్చిన హైడ్రా అధికారులు ఇల్లు ఖాళీ చేయాలని చెప్పారు. ఉన్నపళంగా ఇల్లు ఖాళీ ఎలా చేయాలో దిక్కుతోచలేదు. అప్పటికప్పుడు పనివాళ్లను తీసుకొచ్చి ఇల్లు ఖాళీ చేయించేలా ఏర్పాట్లు చేశాం. ప్రభుత్వం ఇలా ప్రవర్తించడం సరైంది కాదు. మాకు ముందుగా సమాచారం ఇస్తే మేము ఇల్లు ఖాళీ చేసేవాళ్లం.
– దివ్య
మమ్మల్ని నిర్దాక్షిణ్యంగా, ఉన్నపళంగా ఇల్లు ఖాళీ చేయిస్తే ఎక్కడికి పోవాల్నో తెలవడం లేదు. మేమేం తప్పు చేసినం? కిరాయికి వచ్చి ఉండటం తప్పా? అసలు అధికారులు ఎంత భయపెట్టారంటే బయటకు రావాలంటేనే భయమేసింది. బయటకు రాకపోతే మమ్మల్ని ఇంట్లోనే ఉంచి కూలగొడ్తామన్నారు. ఏ తప్పూ చేయని మమ్మల్ని ఫ్లాట్ల నుంచి ఉన్న ఫలంగా బయటకు పంపడం ఇబ్బందిగా ఉన్నది. ఇప్పుడు ఎక్కడికి వెళ్లి ఉండాలో తెలియడం లేదు. ఇల్లు ఖాళీ చేసేందుకు గంట కూడా టైమ్ ఇవ్వలేదు.
– నవ్య
ఉదయం 6 గంటలకు వచ్చి ఇల్లు ఖాళీ చేయమంటే అప్పటికప్పుడు ఎక్కడికి వెళ్లాలి? ఇల్లు సర్దుకొని కూర్చున్నం. ఎక్కడికి వెళ్లాలో తెలియడం లేదు. ఎవరికైనా చెబుదామంటే ఫోన్ చార్జింగ్ లేదు. కరెంట్ కట్ చేశారు. పర్మిషన్లు ఉన్నాయి. అయినా కూల్చేశారు. మాకు ముందస్తు సమాచారం ఇచ్చి ఖాళీ చేయమంటే ఇంత ఇబ్బంది ఉండేది కాదు. ప్రభుత్వం, అధికారులు మమ్మల్ని ఇంత కష్టపెట్టడం సరైంది కాదు.
– మహేశ్వరి